Health question: నా ఏడేళ్ల పాపకి తరచూ మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్ వస్తోంది, కారణమేంటి?
15 September 2024, 14:00 IST
Health question: ఉమ్మనీరు గురించి ఓ గర్భవతి అడిగిన ప్రశ్నకు, తన పాపకు వస్తున్న మూత్ర నాళ ఇన్ఫెక్షన్ గురించి ఓ అమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానం చూడండి.
ఉమ్మనీరు కనిపించగానే ఆసుపత్రికి వెళ్లాలా?
ప్రెగ్నెన్సీ చివరి వారాల్లో బిడ్డ రాకకోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో తల్లి మదిలో రకరకాల ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో ఉండే ఓ ప్రశ్నకు నిపుణుడి సమాధానం తెల్సుకోండి. అలాగే అమ్మాయిలో తరచూ వస్తున్న యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి ఓ అమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానమూ చూడండి.
1. నేను గర్భవతిని. నవంబర్ చివరిలో డాక్టర్ డెలివరీ తేదీని ఇచ్చారు. కానీ డెలివరీ గురించి నేను చాలా భయపడుతున్నాను. ఉమ్మనీరు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలా లేక నొప్పులు పెరిగే వరకు వేచి ఉండాలా? వీటి గురించి వివరించి నా భయం పోగొట్టండి.
మీ ప్రసవానికి ఇంకా దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉంది. గర్భధారణ మూడవ త్రైమాసికంతో మీ గైనకాలజిస్ట్ ఉమ్మనీరు కారడం, పురిటి నొప్పులు, శిశువు కదలికను గమనించడం, ఇతర ప్రసవ లక్షణాల గురించి మీకు వివరంగా చెబుతారు. మీరు అనవసర భయాలు పెట్టుకోకండి. అయితే మీరడిగినట్లు ఉమ్మనీరు కారడం ప్రసవం కాబోతున్నారనడానికి సంకేతమే. ఉమ్మనీరు కారితే తప్పకుండా వెంటనే వైద్యుల్ని ఆలస్యం చేయకుండా సంప్రదించండి. కొంతమందిలో ప్రెగ్నెన్సీ చివరి రోజుల్లో వైట్ డిశ్చార్జి ఎక్కువగా ఉంటుంది. దీన్నే పొరబడి ఉమ్మనీరు అనుకుంటారు. ఈ స్పష్టత కోసం వైద్యుల్ని కలిస్తే మంచిది.
ఒకవేళ ఉమ్మనీరే కారుతోందని మీకు స్పష్టత ఉంటే నొప్పులు వచ్చేదాకా వేచి ఉండకూడదు. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. కొన్నిసార్లు ఉమ్మనీరు కారినా పూర్తిగా విచ్ఛిన్నం అవ్వదు. అలా అయితే మాత్రం కొన్ని గంటల్లోనే ప్రసవం పూర్తవుతుంది. అలాగే నెలలు నిండకముందే ఉమ్మనీరు కనిపిస్తే వైద్యులు పరిశీలించి చికిత్స చేస్తారు.
2. నా కూతురికి ఏడేళ్లు. కొంతకాలంగా తరచూ యూటీఐలతో బాధపడుతోంది. మూత్రంలో మంట అంటోంది. ఇంత చిన్న అమ్మాయికి యుటిఐ ఉండటం సాధారణమేనా? ఈ సమస్య శాశ్వతంగా పోవడానికి ఏం చేయాలి?
మూత్రనాళ ఇన్ఫెక్షన్ (యుటిఐ) ఏ వయస్సులోనైనా రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వల్లే మూత్రం వెళ్లేటప్పుడ మంట వస్తుంది. అపరిశుభ్ర టాయిలెట్ల వాడకం, ప్రైవేటు భాగాల శుభ్రత విషయంలో జాగ్రత్త లేకపోవడం, తక్కువ నీరు తాగడం వల్ల పిల్లల్లోనూ యూటీఐ రావచ్చు. మీ పాపకు పదేపదే యుటిఐ వస్తుంటే, మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రైవేట్ భాగాలను శుభ్రం చేయడానికి తనకి సరైన పద్ధతి నేర్పండి. పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్పండి. కాటన్ లోదుస్తులు ధరించేలా చూడండి. కొన్నిసార్లు చిన్న వయస్సులోనే డయాబెటిస్ కారణంగా కూడా యుటిఐ పదేపదే వస్తుంది. ఈ దిశగా కూడా ఆలోచించాలి. ఒకసారి పిల్లల వైద్యుణ్ని కలవడం ఉత్తమం. సాధారణంగా యుటిఐలు యాంటీబయాటిక్స్‌తో నయం చేస్తారు. అయితే, యాంటీబయాటిక్స్ ఎల్లప్పుడూ వైద్య సలహాతో మాత్రమే తీసుకోవాలి.