వైట్ డిశ్చార్జి స్త్రీలలో సాధారణం. నెలసరికి ముందు లేదా తరువాత, అండం విడుదలయ్యే సమయంలో, శృంగారంలో పాల్గొన్నపుడు.. వైట్ డిశ్చార్జ్ అవుతుంది. కానీ నిరంతరం ఈ సమస్య వేదిస్తుంటే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి. లేదంటే దానివల్ల వేరే ఇన్ఫెక్షన్లు రావడం, శరీరం బలహీనంగా మారడం లాంటి సమస్యలొస్తాయి. అలాగే డిశ్చార్జి తెల్లగా కాకుండా పసుపు రంగులో లేదా ఇంకేదైనా మార్పు కనిపిస్తే సమస్య ఎక్కువగా ఉందని అర్థం. వెజైనా ప్రాంతంలో దురద ఉన్నా, లేదంటే వాసన వస్తున్నా కూడా వెంటనే వైద్య సలహాతో చికిత్స ప్రారంభించాలి.
డిశ్చార్జి తక్కువగానే ఉంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలతో సమస్య తగ్గించుకోవచ్చు.
బియ్యం వండి వార్చిన గంజి నీళ్లు తాగడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. దీంట్లో ఉండే పోషకాల వల్ల వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది.
తులసి మొక్కకున్న ఔషద గుణాల వల్ల ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది. నేరుగా తీసుకోకుండా తులసి రసంలో కొద్దిగా తేనె కలిపి తాగాలి. లేదా పాలలో తులసి రసం కలుపుకుని తాగినా మంచిదే.
రెండు గ్లాసుల నీళ్లలో చెంచా మెంతులు కలిపి వేడిచేయాలి. నీళ్లు సగం అయ్యేదాకా మరిగించాలి. ఆ నీటిని చల్లార్చి తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో ఎంతగానో తోడ్పడే క్రాన్‌బెర్రీ ఈ సమస్యకు కూడా పనిచేస్తుంది. ఈ పండు రసం తాగినా లేదా సప్లిమెంట్లు తీసుకున్నా కూడా డిశ్చార్జ్ సమస్య రాదు.
రెండు కప్పుల నీళ్లలో అంగుళం అల్లం ముక్క దంచి వేయాలి. నీళ్లు మరిగి సగం అయ్యేదాకా ఆగాలి. చల్లారాక తాగాలి. ఇది వారానికి రెండు సార్లు చేయొచ్చు.
ఉసిరిలో విటమిన్ సి తో పాటూ, చాలా పోషకాలుంటాయి. నేరుగా కానీ లేదా ఉసిరితో చేసిన మురబ్బా, లేదా ఉసిరి పొడి తిన్నా మంచిదే. రోజూ ఒక ఉసిరి తింటే బోలెడు ప్రయోజనాలు.