Early Morning Swimming | ఉదయాన్నే లేచి స్విమ్మింగ్ చేయండి.. ఈ ప్రయోజనాలు పొందండి!
06 June 2022, 6:46 IST
- స్విమ్మింగ్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది, ధ్యానం చేస్తున్నటువంటి ఫలితాలు ఉంటాయి. హృదయ స్పందనలు లయబద్ధం అవుతాయి. ఉదయాన్నే లేచి ఈతకొడితే మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయంటున్నారు నిపుణులు. ఈ స్టోరీ చదవండి.
swimming
వేకువజామున నిద్రలేవాలంటేనే మనలో చాలా మందికి బద్ధకం. అదీకాకుండా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయమంటే అదొక కఠినమైన టాస్క్‌లా అనిపిస్తుంది. కానీ ఉదయమే లేచి దబేల్ మని ఏదైనా స్విమ్మింగ్ పూల్‌లో దూకేసి ఈత కొడితే నిద్రమబ్బు అనేది పూర్తిగా ఎగిరిపోతుంది. ఈత కొట్టడం సరదాగా ఉంటుంది. మరోవైపు శరీరానికి వ్యాయామం కూడా అవుతుంది. ఉదయం లేచి ఈత కొట్టడమో లేదా ఈత నేర్చుకోవడమో చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే ఈత రానివారు నిపుణుల సమక్షంలో ఈ యాక్టివిటీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
చాలామంది ఈత కొట్టడం అనేది మధ్యాహ్నం లేదా రోజు ప్రారంభమైన చాలాసేపటికి ప్రారంభిస్తారు. అలాకాకుండా ఉదయాన్నే లేచి ఈతకొడుతే చాలా రీఫ్రెషింగ్‌గా ఉంటుంది.సూర్యోదయం అవుతుండగా ఈత కొట్టడం, సూర్యోదయం అయ్యాక పూల్‌సైడ్ విశ్రాంతి తీసుకోవడం వలన మీకు మంచి అనుభూతితో పాటు, ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
సూర్యోదయాన్ని చూసే అవకాశం
మీరు సూర్యోదయం చూసి ఎన్ని రోజులు అవుతుంది..ఒకసారి గుర్తుచేసుకోండి. మీకు అవుట్‌డోర్ పూల్ సౌకర్యం లేదా మీ ప్రాంతంలో సముద్రాన్ని కలిగి ఉండే అదృష్టవంతులైతే ఉదయాన్నే తీరం వెంబడి సూర్యోదయం చూస్తే ఆ దృశ్యం వెలకట్టలేనిది. చల్లటి నీటిలో స్విమ్మింగ్ చేసి, ఆ తర్వాత బయటకు వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి. మృదువైన లేత సూర్యకిరణాలు మీ శరీరాన్ని తాకినపుడు మీకు వెచ్చదనంతో పాటు విటమిన్-డి లభిస్తుంది. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయవచ్చు.
సులభమైన ఉదయం వ్యాయామం
ఉదయం ఈత కొట్టడం చాలా సరదాగా ఉంటుంది. ఎంతో ఉత్సాహంతో ఈత కొట్టవచ్చు. ఇది రోజులో మీకు చక్కటి వ్యాయామం అవుతుంది. మీరు చల్లని, రిఫ్రెష్ పూల్ గుండా వెళుతున్నప్పుడు మీ కండరాలు సక్రియం అవుతాయి. కీళ్ల నొప్పులు లేదా చిన్న గాయాలు ఉన్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. కేలరీలు ఖర్చు అవుతాయి. మొత్తం శరీరానికి వ్యాయామం లభించినట్లు అవుతుంది. ఆపై వ్యాయామం చేసినట్లు కూడా అనిపించదు.
ఒత్తిడి, ఆందోళన దూరం
వారానికి రెండు సార్లు, కొన్ని ల్యాప్‌లు ఈతకొట్టడం ద్వారా మీ శరీరానికి మంచి రిలాక్సింగ్ గా అనిపించడంతో పాటు పునరుజ్జీవనం పొందినట్లు అనిపిస్తుంది. రోజువారీ గందరగోళం నుంచి కొంత విరామం లభించినట్లు అనిపిస్తుంది. స్విమ్మింగ్ సరదాగా ఉంటుంది కాబట్టి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. నిరాశనిస్పృహల నుంచి బయటపడి సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. మీరు రాత్రికి ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఈత తోడ్పడుతుంది.