Morning Workouts | జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు, ఇంటి వద్దే ఇలా చేస్తే చాలు!
30 May 2022, 6:38 IST
- ఉదయం వేళ నిద్రలేచిన వెంటనే మొదటి గంటలో శరీరానికి కొంత శ్రమ కల్పిస్తే రోజంతా చురుకుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. అదెలాగో తెలుసుకోండి..
Climbing stairs
ఉదయం లేచి వ్యాయామాలు చేయమంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ రోజంతా శక్తివంతంగా, చురుగ్గా ఏ పనులైనా చేసుకోవాలంటే అందుకు ఉదయం మీరు చేసే వర్కౌట్సే సహాయపడతాయి. అయితే వ్యాయామాలు మాత్రమే చేయాలని నిబంధన ఏం లేదు శరీరానికి కాస్త శ్రమ కల్పించి చెమటోడిస్తే చాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా మెట్లు ఎక్కుతూ దిగుతూ చేయడం, ఇంటి అవసరమయ్యే పనులు చేయడం కూడా చేయవచ్చు.
ఉదయం వేళ చెమటోడ్చినపుడు ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఆ తర్వాత లభించే ఒక అనుభూతి మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది. కాబట్టి తేలికపాటి వార్మప్స్ చేసిన సరిపోతుందని చెబుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలి, ప్రతిరోజూ ఉదయం ఏదో ఒకరూపంలో శరీరాన్ని వేడెక్కించేలా చేసి చెమటతో చల్లార్చాలి అని చెబుతున్నారు.
ఉదయం వేళ జిమ్‌కు వెళ్లే పనిలేకుండా ఇంటి వద్దనే ఉంటూ శరీరానికి కొంత శ్రమ కల్పించడానికి ఏమేం చేయవచ్చో ఇక్కడ చూడండి.
మెట్లు ఎక్కడం- దిగడం
మీ ఇంటి వద్దనే ఒక 20 నిమిషాల పాటు మెట్లు ఎక్కడం దిగడం చేస్తూ చెమట బయటకు వచ్చేలా మీ శరీరానికి శ్రమ కల్పించండి.
ఈ రకంగా మెట్లు ఎక్కడం దిగడంచేస్తే జిమ్‌కి వెళ్లకుండానే మీరు గొప్ప వ్యాయామ సాధన చేసినట్లు అవుతుంది. ఇది ఒక కార్డియో ఎక్సర్సైజ్ లాగా మీకు ఉపయోగపడుతుంది.
బాడీ క్లైంబర్
అడ్వెంచర్ ఇష్టపడేవారు ట్రెక్కింగ్ పేరుతో కొండలు, గుట్టలు ఎక్కేస్తారు. ఉదయాన్నే ఇది మంచి వ్యాయామం కూడా అవుతుంది. అయితే కొండలు, గుట్టలు ఎక్కకుండానే ఇంటివద్దనే ఆ తరహాలో సైడ్ కిక్ త్రూలు, లాటరల్ షఫుల్స్ లేదా ట్రాన్‌వర్స్ లంగ్స్ లాంటి వ్యాయామాలు చేస్తే ట్రెక్కింగ్ చేసిన అనుభూతి, అదే రకమైన ఫలితం లభిస్తుంది. ఇలా 20 నిమిషాలు చేయాలి, ప్రతీ 20 నిమిషాలకు ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి.
స్క్వాట్స్/ గుంజీలు తీయడం
ఉన్నచోటునే కూర్చోవడం లేవడం చేయాలి. ఛాతి నిటారుగా ఉంచి ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా గుంజీలు తీస్తూ ఉండాలి. ఒక 20 నిమిషాల పాటు ఇవి చేసినా సరిపోతుంది.