Effective Remedy for Acidity | కడుపులో మంటనా? ఇదిగో చిటికెలో తగ్గించే చిట్కా!
30 August 2022, 20:34 IST
- Effective Remedy for Acidity: ఏదైనా తిన్న తర్వాత కడుపులో మంట, మలబద్ధకం వంటి సమస్యలు వేధిస్తుంటే తక్షణ ఉపశమనం కోసం సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఒక ఎఫెక్టివ్ రెమెడీని ఇక్కడ తెలుసుకోండి.
Get Relief from Acidity
చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చలమైన జీవనశైలి కారణంగా ఎసిడిటీ, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు సాధారణమే. ఇటీవలి కాలంలో చాలా మందే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీర్ఘకాలం పాటు మలబద్ధకం సమస్య ఉంటే జీర్ణవ్యవస్థపై కూడా చాలా చెడు ప్రభావం ఉంటుంది. దీని కారణంగా వ్యక్తికి తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం మొదలైన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా సంభవిస్తాయి. కాబట్టి జీర్ణ సమస్యలు ఉండకూడదంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి.
చాలా మందిని వేధిస్తున్న మరొక సమస్య కడుపులో మంట. ఏదైనా తిన్న తర్వాత వెంటనే కడుపులో మంటగా, చికాగుగా అనిపిస్తుంది. దీనినే ఎసిడిటీ అంటారు. ఈ సమస్య వ్యక్తిని కుదురుగా ఉండనివ్వదు, చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎసిడిటీని సకాలంలో చికిత్స చేయకపోతే, సమస్య మరింత పెరుగుతుంది. దీంతో స్టమక్ అల్సర్స్, గుండెల్లో మంట, ఛాతీ నొప్పి, రక్తస్రావం, మింగడానికి ఇబ్బంది మొదలన సమస్యలకు దారితీస్తుంది.
అయితే ఎసిడిటీని వదిలించుకోవటానికి సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. నల్ల ఉప్పు, వాము తీసుకోవడం ద్వారా ఎసిడిటీ, మలబద్ధకం, ఇతర జీర్ణాశయాంతర సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఎసిడిటీకి ఎఫెక్టివ్ రెసిపీ
Effective Remedy for Acidity: ముందుగా వాము లేదా ఓమ విత్తనాలను ఒక పాన్‌లో వేయించి, అనంతరం దానిని పొడిగా గ్రైండ్ చేయండి. ఈ పొడికి కొద్దిగా నల్ల ఉప్పు కలపండి. భోజనం తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక టీస్పూన్ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే ఎసిడిటీ ఉండదు.
అలాగే ఒరేగానో, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకున్నా ఇలాంటి ఫలితమే ఉంటుంది. ఒరేగానో మొక్కలో థైమోల్ ఉంటుంది. బ్లాక్ సాల్ట్ ఆల్కలాయిడ్స్ కలిగి ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఆహారంలో మార్పులు
మీరు ఎసిడిటీ, గ్యాస్‌తో ఇబ్బంది పడుతుంటే మీరు రోజూ తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నూనెతో వండి స్పైసీ పదార్థాలను తగ్గించాలి. ఎప్పుడైనా ఇలాంటి మసాలా ఆహారాలు తిన్నప్పుడు ఆ రోజు కచ్చితంగా ఆకుకూరలను తినండి. ఇది పొట్టలో పేరుకున్న హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. అలాగే ప్రతిరోజూ ఆహారంలో కారం తక్కువగా ఉడికించిన కూరగాయలను తినాలి.
భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత ఒక చిన్న చెంచాడు వాము, చిటికెడు నలుపు ఉప్పు, లేదా రాళ్ల ఉప్పును అర గ్లాసు నీటిలో కలిపి త్రాగాలి.
మోతాదుకు మించవద్దు
వామును మోతాదుకు మించి తీసుకోవద్దు. ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వాంతులు లేదా అలెర్జీలు కలగవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజులో రెండుసార్లు కంటే ఎక్కువ తీసుకోవద్దు. టీస్పూన్ కంటే ఎక్కువ తినవద్దు. ఇంకా మీకు కాలేయ సమస్యలు లేదా నోటి పూతలు ఉన్న సందర్భంలో కూడా వాము తినవద్దు.
టాపిక్