Ganesh Chaturthi Decoration Ideas |వినాయక చవితి కోసం డెకొరేషన్ ఇలా చేయండి
24 August 2024, 14:43 IST
- Ganesh Chaturthi Decoration Ideas: వినాయక చవితి వస్తే అనేక సైజులలో ఆకట్టుకునే గణనాథుడి ప్రతిమలు కొలువుదీరుతాయి. కేవలం విగ్రహాలే కాదు, వాటికోసం చేసే డెకొరేషన్ కూడా అద్భుతహ అనిపిస్తుంది. మీరు డెకొరేషన్ ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే ఇక్కడ కొన్ని ఐడియాలు ఉన్నాయి.
Ganesh Chaturthi Decoration
వినాయక చవితి భారతదేశం అంతటా అత్యంత కోలాహలంగా జరుపుకునే హిందూ పండుగలలో ఒకటి. దీనినే గణేష్ చరుర్థి లేదా వినాయక చతుర్థి అనే పేర్లతోనూ పిలుస్తారు. చవితి రోజున వినాయకుడి ప్రతిమను కొలువుదీర్చటం దగ్గర్నించీ నుంచి నిమజ్జనం వరకు 10 రోజుల పాటు దీపధూప నైవేద్యాలతో ధూంధాంగా వేడుకలు నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆ విఘ్నేశ్వరుడిని పూజిస్తారు.
ఇక, వేడుకల విషయానికి వస్తే.. వినాయక చవితికి ముందురోజు నుంచి పండుగ సందడి మొదలవుతుంది. ప్రతీ పట్టణంలో, వాడవాడలా అనేక రూపాలలో, అనేక పరిమాణాలలో గణేశుడి విగ్రహాలు కొలువుదీరుతాయి. ఇంట్లోనూ వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఆరాధిస్తాం.
అయితే వినాయకుడి విగ్రహాలు కొలువుదీర్చటం ఒక ఎత్తైతే, డెకొరేషన్ మరొక ఎత్తు. చిన్నా,పెద్ద అందరూ వివిధ గ్రూపులుగా ఏర్పడి చందాలు వేసుకొని వారి స్థాయికి తగినట్లు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. అదే స్థాయిలో డెకొరేషన్ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఈ డెకొరేషన్ అనేది మరో స్థాయిలో ఉండేది. సినిమా సెట్టింగులను తలపించేలా గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు. ఇటీవల కాలంలో ఈ తరహా సెట్టింగ్లు తగ్గిపోయాయి.
మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం నెలకొల్పితే, ఆకర్షణీయంగా డెకొరేషన్ ఎలా చేసుకోవాలో ఇక్కడ కొన్ని ఐడియాలు అందిస్తున్నాం. ఇవి మీకు ఉపయోగపడతాయోమో పరిశీలించండి.
కర్టెన్లతో ఫ్లవర్ డెకరేషన్
వినాయకుడి విగ్రహాన్ని కొలువుదీర్చే చోట, వెనకవైపున మిరుమిట్లు గొలిపే కర్టెన్లు మంచి లుక్ తీసుకువస్తాయి. తెలుపు లేదా క్రీమ్ వంటి లేత రంగుల కర్టెన్‌లనూ ఉపయోగించవచ్చు. వీటిపై ఆర్కిడ్‌లు లేదా ఎర్ర గులాబీల వంటి ముదురు రంగుల పువ్వులతో ఫ్రేమ్‌ను తయారుచేయండి.
రంగు కాగితాలతో అలంకరణ
పూలతో డెకొరేషన్ చేస్తే ఒక రోజు తర్వాత వాడిపోతాయి, మళ్లీ మార్చాల్సి ఉంటుంది. మరి ఎక్కువ రోజులు వినాయక విగ్రహాన్ని ఉంచితే, రంగుల కాగితాలతో అలంకరణలు చేయవచ్చు. పువ్వులు, పేపర్ ఫ్యాన్లు, దండలు, వాల్ హ్యాంగింగ్‌లు, మరిన్ని వంటి అలంకరణ వస్తువులను ఉపయోగించవచ్చు. సీతాకోకచిలుకలు, గొడుగులు వంటి కొన్ని డిజైన్లను అతికించితే కూడా బాగుంటుంది.
బ్యాక్‌గ్రౌండ్ వాల్
వెనకాల బ్యాక్‌గ్రౌండ్ వాల్ ఫ్లోరోసెంట్ పేపర్, గ్లిట్టర్ షీట్‌లను ఎంచుకుంటే గణేషుడి ప్రతిమ మరింత కళతో కనిపిస్తుంది. లేదా ఒక ఆకర్షణీయమైన వాల్ పేపర్ గోడకు అతికించి.. మరిన్ని అలంకరణ వస్తువులతో అలంకరించినపుడు కూడా అందంగా కనిపిస్తుంది.
దీపాల వెలుగులు
చిన్న పందిరిలాగా వేసి రంగురంగుల ఎలక్ట్రిక్ బల్బులు లేదా మామూలు దీపాలతో అలంకరిస్తే ఆ దృశ్యం దేదీప్యమానంగా కనిపిస్తుంది. లేదా సింపుల్ గా చుట్టూ డెకొరేషన్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. స్ట్రింగ్ లైట్లు, స్పాట్‌లైట్లు, ఫ్యాన్సీ లాంతర్లు ఉపయోగించిన సృజనాత్మకంగా కనిపిస్తుంది.
రెడీమేడ్ మండపాలు
మీకు అలంకరణలు చేయడానికి సమయం లేకపోతే కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మార్కెట్లోనే వివిధ పరిమాణాలలో రెడీమేడ్ మండపాలు లభిస్తున్నాయి. ఇంట్లో తక్కువ స్థలంలో పెట్టుకోవటానికి కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రెడీమేడ్ గణపతి మండపాలను సాధారణంగా థర్మాకోల్ షీట్లు , పూలతో తయారు చేస్తారు. నేరుగా ఈ రెడీమేడ్ మండపాలను తీసుకువచ్చి అందులో మీ ఇంటి గణపతిని కొలువుదీర్చవచ్చు.