Lord Ganesha | సర్వ గణాలకు అధిపతి.. విఘ్నేశ్వరుడి గురించి ఆసక్తికర కథనాలు
హిందూమతంలో ప్రణవ మంత్రమైన ఓంకార స్వరూపాన్నే వినాయకుడని అంటారు. విఘ్నేశ్వరుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు.
హిందువులు అమితంగా ఆరాధించే వినాయకుడు సకల దేవతల్లో తొలి పూజ అందుకునే దైవంగా ప్రసిద్ధి. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా, కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి చిహ్నంగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు క్రతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. విద్యాభ్యాసం ప్రారంభించే సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక, లీలలను గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. వినాయకుడిని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు.
శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే అయినా కూడా, హిందూ సాంప్రదాయాల్లోనూ గణపతికి ప్రాధాన్యం ఉంటుంది. గణాధిపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు. వినాయకుడికి అనేక పేర్లున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు మొదలైనవి ఇలా వందకు పైగా పేర్లు ఉన్నట్లు ప్రతీతి. శ్రీ అనే గౌరవవాచకాన్ని ఈ పేర్ల ముందు వాడుతుంటారు.
గణం అంటే ఒక సమూహం. పతి లేదా ఈశ అంటే యజమాని, నాయకుడు అని అర్థం. ఇక్కడ గణాలు అంటే గణేశుడి తండ్రియైన శివుడి సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు. అలాగే హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకార స్వరూపాన్నే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు.
వినాయకుడి గురించి కొన్ని ఆసక్తికర కథనాలు
వినాయకుడి గురించి కొన్ని ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
అవేంటంటే..
మహాభారత గ్రంథ రచన
పురాణ ఇతిహాసం అయిన మహాభారత మహా కావ్య రచన చేసింది వినాయకుడేనని కథనం. మహా జ్ఞాని అయిన వేద వ్యాసుడు తన మహాభారతాన్ని అర్థం చేసుకోని రచించాలంటే సకల విద్యాబుద్ధులు తెలిసిన గణేశుడు సరైన యోగ్యుడని భావిస్తాడు. అందుకోసం వ్యాస మహర్షి గణేశుడిని ఈ కార్యం చేసిపెట్టాల్సిందిగా కోరగా, అందుకు గణేశుడు అంగీకరిస్తాడు. అయితే ఎక్కడా ఆపకుండా, ప్రతి శబ్దం యొక్క అర్థాన్ని గ్రహించి లిఖించాల్సిందిగా సూచిస్తాడు. ఆ విధంగా, వ్యాసుడు మహాభారత కావ్యాన్ని ఏకధాటిగా శ్లోకాల రూపంలో పఠిస్తుండగా గణపతి వాటి సారాన్ని అర్థం చేసుకుంటూ మహాభారత గ్రంథాన్ని లిఖించాడు.
కాగా, ఇలా రాస్తున్న క్రమంలో వినాయకుడు రాసే కలం విరిగిపోతుంది, దీంతో వెంటనే వినాయకుడు తన ఒక దంతాన్ని విరిచి కలంగా మలిచి రచన కొనసాగిస్తాడు. ఈ విధంగా తాను వ్యాసుడికి ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. అప్పట్నించీ వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు వచ్చిందని పురాణ గాథల్లో ఉంది.
గణేశుడు వివాహితుడా?
కొన్ని పురాణ గాథలు గణేశుడిని బ్రహ్మచారిగా పేర్కొన్నాయి. అయితే మరికొన్నిచోట్ల వినాయకుడు కవలలైన బుద్ధి, సిద్ధి అనే దేవతలను వివాహమాడాడని నమ్ముతారు. వీరికి ఇద్దరు కుమారులు శుభం, లాభం ఉన్నారని కథనం.
గణేశుడు, తులసి కథ
బ్రహ్మావవర్త్ పురాణం ప్రకారం, గంగా నది ఒడ్డున ధ్యానం చేస్తున్న గణేశుడి మనోజ్ఞతను చూసి తులసి దేవి ఆశ్చర్యపోయింది. తులసి దేవి తనను పెళ్లి చేసుకోమని గణేశుడిని అడగగా, అందుకు గణేశుడు తను ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటానని చెప్తాడు. తనను తిరస్కరించినందుకు తులసి కోపంతో గణపతి బ్రహ్మచర్యం నాశనమవుతుందని శపిస్తుంది. ఇందుకు గణేశుడు కోపోద్రిక్తుడై తులసిని ఎప్పటికీ మొక్కగానే ఉండమని శపిస్తాడు. తులసి శాపంతో గణపతి వివాహం జరిగి పిల్లలు కలుగుతారు, వినాయకుడి శాపంతో తులసి అప్పట్నించీ మొక్కగానే పూజలందుకుంటుందని పురాణాల్లో ఉంది.
గణేశ్ ఉత్సవాలు 10 రోజుల పాటు జరిగే పండుగ. గణేశ చతుర్థి సందర్భంగా భక్తులు గణపతి విగ్రహాలను ఊరూరా, వాడవాడలా ప్రతిష్టిస్తారు. తమ ఇళ్లల్లో కూడా గణేశుడి ప్రతిమను కొలువుదీర్చి, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ప్రతిరోజూ దీపధూపనైవేద్యాలను సమర్పిస్తారు. భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఒక్క మనదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి (ఇండోనేషియా), బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో విఘ్నేశ్వరుడిని కొలుస్తున్నారు. అంతేకాకుండా భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో విశేష పూజలందుకుంటున్నాడు మన గణనాథుడు.
సంబంధిత కథనం
టాపిక్