Diabetes Care in Monsoon। మీకు షుగర్ ఉందా? అయితే వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
08 August 2023, 11:34 IST
- Diabetes Care in Monsoon: మధుమేహులకు రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో కచ్చిమైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. కొన్ని జాగ్రత్తలను ఇక్కడ తెలుసుకోండి.
Diabetes Care in Monsoon
Diabetes Care in Monsoon: వర్షాకాలంలో వేడివేడి చిరుతిళ్లు తినకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం కష్టమే. రోడ్డు పక్కన సమోసాలు, పునుగులు, కచోరి వంటి వాటికి లొంగిపోతే అనారోగ్యాల బారినపడటం తప్పదు. కాబట్టి ఈ సీజన్ లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలం చాలా మనోహరంగా కనిపించవచ్చు, కానీ ఇది మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. మధుమేహం ఉన్న ఈ వర్షాకాలంలో బయటి ఆహారాలను పూర్తిగా నివారించాలి. ఇంట్లో వండిన, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి.
ప్రస్తుతం వర్షాలు అడపదడపా కురుస్తున్నప్పటికీ, భారీ వర్షం పడినపుడు డ్రైనేజీ వ్యవస్థ చెడిపోవడం, రోడ్లపైనే మురికినీరు ప్రవహించడం ఉంటుంది. దీనికితోడు కండ్లకలక వంటి ఇన్ఫెక్షన్లు, డైంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు, చర్మ వ్యాధులు వంటివి ప్రబలుతున్నాయి. మధుమేహులకు రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉంటుంది. కాబట్టి కచ్చిమైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. కొన్ని జాగ్రత్తలను ఇక్కడ తెలుసుకోండి.
మీ పాదాలను జాగ్రత్తగా చూసుకోండి
మీకు మధుమేహం ఉంటే, మీ పాదాలు ప్రమాదంలో పడవచ్చు. చిన్న కోత కూడా హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. అధిక రక్త చక్కెర ఫలితంగా రక్త ప్రసరణ బలహీనపడుతుంది. ఫలితంగా మీ పాదంలోని నరాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని న్యూరోపతి అంటారు.
మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి
వర్షాకాలం ఇన్ఫెక్షన్లు ప్రబలే సీజన్. ఇప్పుడు వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పాటు కంటి ఇన్ఫెక్షన్‌లకు సంబంధించిన కేసులు పెరుగున్నాయి. ఈ కంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి, మీ చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి, మీ కళ్ళను తరచుగా తాకకుండా ఉండండి.
ఆరోగ్యకరమైన భోజనం తినండి
మధుమేహ ఉన్నప్పుడు సంవత్సరంలో ఏ సీజన్ లో అయినా, ఏ రోజైనా ఎల్లప్పుడూ ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే కాలానికి తగ్గట్లుగా ఆహారంలో మార్పులు ఉంటాయి కాబట్టి, మధుమేహం కలవారు ఈ వర్షాకాలంలో వారి ఆహార ఎంపికల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శుభ్రంగా వండిన ఆహారాన్ని మాత్రమే తినండి. పోషకాలు కలిగిన, మీ రోగనిరోధక శక్తికి సహాయపడే వాటిని తినండి.
హైడ్రేషన్ కీలకం
వర్షాకాలంలో దాహం అంతగా ఉండనప్పటికీ, మీ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ముఖ్యం. మాన్‌సూన్‌లో తరచుగా మారే వాతావరణం, వేడి- తేమ పరిస్థితులు నిర్జలీకరణానికి దారితీయవచ్చు. కాబట్టి మధుమేహులు సరిపడా నీరు తాగాలి. మితంగా కొబ్బరి నీళ్లను కూడా తాగవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం
వర్షాకాలంలో చురుకుదనం లోపిస్తుంది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఈ అలవాటు మీ అనారోగ్య సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తగినంత విశ్రాంతి తీసుకుంటూనే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, చురుకుగా ఉండాలి. ఇంట్లోనే ఉంటూ కూడా డయాబెటీస్‌ను నియంత్రించే వ్యాయామాలు చేయవచ్చు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.