తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curry Leaves Buttermilk । కరివేపాకు మజ్జిగ ఒక గ్లాసు తాగితే, దాని ఆరోగ్య ప్రయోజనాలే వేరు!

Curry Leaves Buttermilk । కరివేపాకు మజ్జిగ ఒక గ్లాసు తాగితే, దాని ఆరోగ్య ప్రయోజనాలే వేరు!

HT Telugu Desk HT Telugu

22 April 2023, 14:14 IST

    • Curry Leaves Buttermilk Recipe: వేసవిలో చలువ చేసే ఆహారాలలో మజ్జిగ చాలా ఆరోగ్యకరమైనది, కరివేపాకు ఔషధ గుణాలకు ప్రసిద్ధి. ఈ రెండూ కలిపి చేసే కరివేపాకు మజ్జిగ రెసిపీని ఇక్కడ తెలుసుకోండి.
 Curry Leaves Buttermilk Recipe
Curry Leaves Buttermilk Recipe (istock)

Curry Leaves Buttermilk Recipe

Summer Recipes: వేసవిలో తీసుకునే ఆహార పదార్థాలలో మజ్జిగ అనేది అగ్రస్థానంలో ఉంటుంది. భోజనం తర్వత, భోజనానికి ముందు, నిద్రించే సమయంలో మజ్జిగను ఎప్పుడైనా తీసుకోవచ్చు. వేసవి వేడికి పెరిగిన మీ శరీర ఉష్ణోగ్రతను ఒక గ్లాసు మజ్జిగ తాగడం ద్వారా సహజంగా చల్లబరుచుకోవచ్చు. అంతేకాకుండా మజ్జిగ ఒక ప్రోబయోటిక్ ఇది జీర్ణక్రియను పెంచుతుంది, పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది. మజ్జిగలో ఇతర మూలికలు, మసాలాలు కలిపి మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. దీనిని చాస్ అని పిలుస్తారు. కరివేపాకును కలిపి మజ్జిగ చేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.

కరివేపాకు ఎంత ఆరోగ్యకరమైనదో తెలిసిందే. కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్‌లతో పాటు విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి విటమిన్‌లు ఉంటాయి. కరివేపాకు ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్, ఇది మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడి, మీ జుట్టు పెరుగుదలకు అలాగే చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. కరివేపాకు తినడం ద్వారా గుండె కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఇలాంటి ప్రయోజనాలు పొందేందుకు కరివేపాకు మజ్జిగ చక్కటి పానీయం. కరివేపాకు మజ్జిగ రెసిపీని ఇక్కడ తెలుసుకోండి.

Curry Leaves Buttermilk Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు పెరుగు
  • 2 కప్పుల నీరు
  • 2 రెమ్మలు కరివేపాకు
  • 1 పచ్చి మిర్చి
  • 1/2 టీస్పూన్ నల్ల మిరియాలు పొడి
  • రుచికి కొద్దిగా ఉప్పు

కరివేపాకు మజ్జిగ తయారీ విధానం

  1. కరివేపాకు మజ్జిగ రెసిపీని చేయడానికి ముందుగా పెరుగులో నీరు కలిపి మజ్జిగలా తయారు చేసుకోండి.
  2. అనంతరం ఒక మిక్సర్-జార్‌లో కరివేపాకు ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు, నల్లమిరియాలు, ఉప్పు కలిపి ముతక పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
  3. తరువాత మజ్జిగలో ఈ కరివేపాకు మిశ్రమం వేసి, బాగా కలిసే వరకు మరొక సారి బ్లెండ్ చేయండి.
  4. చివరగా, ఒక గ్లాసులో పోసిసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకోవచ్చు.

అంతే, కరివేపాకు మజ్జిగ రెడీ. మీరు దీనిని నిల్వచేసుకొని రోజులో ఎప్పుడైనా తాగవచ్చు.

తదుపరి వ్యాసం