తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetic Foot Care: డయాబెటిస్‌లో పాదాల సంరక్షణే అత్యంత కీలకం.. కాలి గాయాలను నిర్లక్ష్యం చేయొద్దు..

Diabetic Foot Care: డయాబెటిస్‌లో పాదాల సంరక్షణే అత్యంత కీలకం.. కాలి గాయాలను నిర్లక్ష్యం చేయొద్దు..

02 October 2024, 13:20 IST

google News
    • Diabetic Foot Care: మధుమేహం ఉన్న వారు తమ పాదాలను ముఖాన్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తారు. మధుమేహం ఉన్నవారిలో దాదాపు 15 శాతం మంది పాదాల సమస్యలతో బాధపడి వుంటారు. వైద్యుడి వద్దకు సమస్య ముదిరిన తరువాత వెళ్లడం వల్ల కాలిపుండ్లు, గాయాలు తీవ్రమై కాలు తొలగించే వరకూ వెళ్తున్నాయి.
మధుమేహంలో పాదల సంరక్షణ అత్యంత కీలకం
మధుమేహంలో పాదల సంరక్షణ అత్యంత కీలకం

మధుమేహంలో పాదల సంరక్షణ అత్యంత కీలకం

Diabetic Foot Care: మధుమేహం(డయాబెటిక్‌) బాధితుల్లో చాలా మందికి దాని వల్ల వచ్చే సమస్యలపై అవగాహన ఉండదు. భారతీయులలో నిరక్షరాస్యత, చెప్పులు లేకుండా నడిచే అలవాటు, పేదరికం, పొగత్రాగే అలవాటు, సమస్య తీవ్రత పట్ల అవగాహన లేకపోవడం, సమస్య ముదిరిన తరువాత వైద్యుడి వద్దకు వెళ్లడం వంటి కారణాలతో కాళ్లకు వచ్చే పుండ్లు, గాయాలు తీవ్రమై ఒక్కోసారి కాలు తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

డయాబెటిస్‌లో పాదాలలో మార్పు రావడానికి కారణాలు...

మధుమేహంలో ప్రధానంగా కాళ్లలో మార్పులు రావడానికి వాస్కులర్ డిసీజ్ కారణం కావొచ్చు. డయాబెటిక్ న్యూరోపతి, ఇన్ఫెక్షన్‌లు కూడా ఈ సమస్యలకు దారి తీయొచ్చు.

రక్తనాళములలో మార్పు: డయాబెటిస్ వలన పెద్ద మరియు చిన్న రక్త నాళములలో కొవ్వు పేరుకొని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా రక్త ప్రసరణ తగ్గుతుంది. డయాబెటిస్ తో సాధారణంగా కలిసి వుండే అధిక రక్తపోటు, హైపర్ లిపిడీమియా, మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లు ఈ సమస్యను మరింత పెంచుతాయి. ధూమపానం కూడా అలవాటుగావుంటే ఈ సమస్య ఎన్నోరెట్లు ఎక్కువ అవుతుంది.

నాడుల సమస్య (డయాబెటిక్ న్యూరోపతి):

డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తుల్లో నాడుల సమస్యతో బాధపడేవారు నొప్పి, ఊష్ణోగ్రతలను గ్రహించలేక పోవడం వలన, యాంత్రిక, రసాయన చర్యలు, అధిక ఊష్ణోగ్రతలను పాదముల స్పర్శతో గ్రహించలేక పోవడం జరుగుతుంది. గాయం తగిలినా వారు కొన్ని సార్లు గుర్తించ లేరు. మళ్ళీ మళ్ళీ గాయం మీద ఒత్తిడి, రాపిడి జరిగినా గ్రహించలేరు. దీని వలన గాయం మానకపోవడం, పెద్దది కావడం జరుగుతుంది.

డయాబెటిక్ మోటార్ న్యూరోపతి వలన చిన్న కండరములు బలహీనమై కాలి వేళ్ళు వంకరలు పోతాయి. దీనివలన సన్నని ఎముకల చివర్లు నేల వైపు పొడుచుకువచ్చి వాటి మీద వత్తిడి పెరిగి, పుండ్లు ఏర్పడతాయి. అటనామిక్ న్యూరోపతి వలన చర్మం పొడిగా మారి కాళ్లలో పగుళ్ళు ఏర్పడతాయి. పగుళ్ళ ద్వారా ఇన్ఫెక్షను పాదం లోపలకు ప్రవేశిస్తుంది. టెండానులు, ప్లాంటార్ ఫేసియా వంటి తెల్లటి టిష్యూలు బాక్టీరియాను నిరోధించలేవు. అందువలన పాదాల లోపలి భాగాలకు కూడా ఇన్ఫెక్షన్ ప్రాకుతుంది.

ఇన్ఫెక్షన్ :

డయాబెటిస్ ఉన్న వారిలో రక్తప్రసరణ సరిగా జరగక పోవడం, రోగనిరోధక శక్తి తక్కువ కావడం వలన ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా వుంటుంది. గాయమైన చోటుకు రక్తం సరఫరా జరుగక పోవడం వలన కణజాలం నశించి, ఆప్రాంతంలో బాక్టీరియా ఎక్కువగా పెరగడానికి కారణమవుతుంది. డయాబెటిక్ ఫుట్‌లో అనేకరకాల క్రిములు పెరుగుతాయి.

డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్ వివిధ స్థాయిలు:

  • పాదాలకు ప్రమాదం కలిగించని స్థితి

• చీము లేకపోవడం

• రక్తప్రసరణ సాధారణంగా వుండటం

  • ఇన్ఫెక్షను లక్షణాలు లేకపోవడం
  • ఇన్ఫెక్షన్ చర్మానికి పరిమితం కావడం
  • పాదాలకు ప్రమాదం కలిగించే స్థితి
  • 2. సెం.మీ. కన్నా ఎక్కువ ప్రాంతంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వుండటం

• లింఫ్ నాళాల చారలు కనిపించడం.

  • కుళ్ళి పోయిన చర్మం, కండరాలు
  • చర్మము క్రింద కండలో ఇన్ఫెక్షన్ వుండటం
  • ఎముకల వరకు ఇన్ఫెక్షన్ వ్యాపించడం కారణాలై ఉంటాయి.

పాదాలను జాగ్రత్తగా ఎలా సంరక్షించుకోవాలి?

1. పాదాలను ప్రతిరోజు పరీక్షించుకోవాలి. అద్దం సాయం కూడా తీసుకోవాలి. పాదాలు, గోర్లు, వ్రేళ్ళ మధ్య స్థలము మొదలైనవాటిని చూడాలి.

2. రోగి చూపు మందగించినట్లయితే, కుటుంబ సభ్యుల సహకారంతో పరీక్షించుకోవాలి.

3. పాదాలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకించి వేళ్ళ సందులను పొడిగా, శుభ్రంగా వుంచుకోవాలి.

4. పాదాల పగుళ్ళకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడాలి. కాలివ్రేళ్ళ మధ్య తడిగా ఉంచరాదు.

5. పాదాలను నీటిలో నాన్చరాదు.

6. పాదాల మీద వేడి నీటి బాటిల్స్ వుంచరాదు.

7. గోర్లను పాదాలకు సమాంతరంగా కత్తిరించాలి. అంచులు వేళ్ళలోనికి పదునుగా చొచ్చుకొని పోయేలా కత్తిరించకూడదు.

8. కాలి ఆనెలకు (Corns) ప్లాస్టర్స్ అంటించరాదు.

9. సాక్స్ బిగుతుగా ఉండకూడదు, ప్రతిరోజు మార్చాలి.

10. పాదరక్షలు లేకుండా ఒట్టి పాదాలపై ఇంటిలోకూడ నడువరాదు.

11. చెప్పులకు రాళ్ళు, ముళ్లు, మేకులు గుచ్చుకున్నాయేమో పరిశీలించాలి.

12. ధూమపానం మానివేయాలి.

13. బైకులో వెనుక వైపు కూర్చునప్పుడు సైలెన్సర్లకు దూరంగా కాళ్ళు వుంచాలి. లేనిచో సైలెన్సర్ల వేడికి కాళ్ళమీద గాయలు ఏర్పడవచ్చు.

14. గుడులకు వెళ్లేటపుడు సాయంకాలం నేల వేడి తగ్గిన తరువాత మాత్రమే వెళ్ళాలి.

తదుపరి వ్యాసం