Foods to Avoid with Arthritis । మీకు కీళ్లనొప్పులు ఉన్నాయా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!
07 July 2023, 8:30 IST
- Foods to Avoid with Arthritis: చాలా మంది కీళ్ళు, ఎముకల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మాత్రలు లేదా స్ప్రేల వైపు మొగ్గు చూపుతారు. కానీ, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Foods to Avoid with Arthritis
Foods to Avoid with Arthritis: మీకు విపరీతంగా కీళ్ల నొప్పులు లేదా మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నాయా? ఇందుకు మీరు తినే ఆహారం కారణం కావచ్చు. కీళ్ళలో నొప్పి కలిగినపుదు చాలా మంది నొప్పి నివారణి స్ప్రేలు, మందులు, మాత్రల వైపు మొగ్గు చూపుతారు. కానీ ఇవి తాత్కాలిక ఉపాశమనాన్ని మాత్రమే అందించగలవు. నొప్పులను నివారించాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కీళ్ళ నొప్పులకు కారణం ఎముకలు అరిగిపోవడం, లేదా బలహీనపడటం. శరీరంలో కాల్షియం స్థాయిలు సరైన స్థాయిలో లేకపోవడం లేదా క్షీణించడం ఉన్నప్పుడు ఎముకలు బలహీనపడి నొప్పి కలుగుతుంది. కొన్ని ఆహారాలు శరీరంలో కాల్షియం స్థాయిలను తగ్గిస్తాయి. మీకు కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, ఆ ఆహారాలేమిటో తెలుసుకోండి.
కార్బొనేటెడ్ డ్రింక్స్
మీరు మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని భావిస్తే, సోడా, కూల్ డ్రింక్స్ వంటి కార్బోనేటేడ్ పానీయాలకు వీడ్కోలు చెప్పండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కార్బోనేటెడ్ పానీయాలలో అధిక చక్కెర కంటెంట్ ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం నష్టానికి దారితీస్తుంది. ఫలితంగా ఎముకల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. అంతే కాదు దంత సమస్యలకు కూడా దారి తీస్తుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్
ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలామందికి ఇష్టం. జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారు, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కు ఎక్కువగా అలవాటుపడతారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఫ్రెంచ్ ఫ్రైస్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లోని కాల్షియం కంటెంట్ బలహీనపడుతుంది. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ తో పాటుగా సోడియం ఎక్కువ ఉండే బంగాళదుంప చిప్స్, బర్గర్లు, పిజ్జా లేదా ఏదైనా ఫాస్ట్ ఫుడ్‌కు కూడా దూరంగా ఉండాలి.
కెఫిన్
మనం రోజూ కాఫీ, టీలు తాగుతాం. కానీ కొంతమంది రోజుకు లెక్కలేనన్ని సార్లు తాగుతారు. మనం తీసుకునే డ్రింక్స్ లో కెఫీన్ కంటెంట్ ఎక్కువగా ఉందో లేదో తెలుసుకోవాలి. కెఫిన్ కలిగిన పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కాఫీ మొక్కలు మరియు టీ ప్లాంట్లలో కెఫిన్ తక్కువ మొత్తంలో ఉంటుంది.
చాక్లెట్, క్యాండీలు
చాక్లెట్ లేదా క్యాండీలను చాలా మంది ఇష్టపడతారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం ఎముకలకు చాలా హానికరం. వీటిలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సహజంగా పెంచుతుంది. అలాగే ఎముకల సాంద్రతను నేరుగా ప్రభావితం చేస్తుంది. చాక్లెట్స్ మాత్రమే కాదు, చక్కెర ఎక్కువ ఉండే ఐస్ క్రీం, కేకులు, లడ్డూలు లేదా డెజర్ట్‌లు వంటి తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎముకలు లేదా కీళ్ల నొప్పులు ఉన్నవారు ఎండిన పండ్లు, బెర్రీలు, క్రూసిఫెరస్ కూరగాయలు, ఆలివ్ నూనెతో కూడిన ఆహారం తీసుకోవాలి.
టాపిక్