Intimate Hygiene | ఆడ, మగ ఎవరైనా 'ఆ భాగాల్లో' వేసవిలో ఎలాంటి కేర్ తీసుకోవాలి?
05 April 2022, 17:46 IST
- ఎండాకాలంలో శరీర అంతర్భాగాల పరిశుభ్రత ఎంతో ముఖ్యం. సున్నిత భాగాలైన మెడ, చంకలు, గజ్జెల్లో చెమట ఎక్కువపడుతుంది. కాబట్టి ఎలాంటి సంరక్షణ తీసుకోవాలో తెలుసుకోండి.
Intimate Hygiene
సీజన్ మారుతున్నకొద్దీ మన శరీరం కూడా అనేక మార్పులకు గురవుతుంది. బాహ్య వాతావరణానికి మన చర్మం బహిర్గతం అవుతుంది కాబట్టి మొదటగా చర్మ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ ఎండాలంలో అయితే వేడి, ఉక్కపోతలతో ఏర్పడే ప్రధాన సమస్య చెమట. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం.
ఆడవారికైనా, మగవారికైనా చెమట పట్టడం సాధారణం. ఈ చెమట కారణంగా వేసుకున్న బట్టలు తడిగా మారుతాయి. శరీరం నుంచి చెమట వాసనతో పాటు ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చెమట ఎక్కువగా పట్టే శరీర అంతర్గత భాగాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ ఎండాకాలంలో వేసుకునే దుస్తుల నుంచి చర్మానికి అద్దె కాస్మెటిక్స్ వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఈ వేసవిలో ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి?
తీవ్రమైన వేడి, చెమట కారణంగా శరీరంలోని వివిధ సున్నితమైన భాగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. మెడ, చంకలు, గజ్జెల్లో బ్యాక్టీరియా చేరి ఎక్కువ చెమట తయారవుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో దురదపెడుతుంది, దద్దుర్లు ఏర్పడతాయి. ఆడవారికైతే పీరియడ్స్ సమస్య కూడా అదనంగా ఉంటుంది కాబట్టి అది యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ కు దారితీసే ప్రమాదం ఉంది. అలాంటి ప్రదేశాలలో ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవాలి.
లోదుస్తులను మార్చుకోండి
చెమట ఎక్కువపట్టినట్లు అనిపించినపుడు లోదుస్తులను మార్చుకోండి. బిగుతైన లోదుస్తులు వేసుకోకండి. పరిశుభ్రమైన లోదుస్తులనే ఉపయోగించండి. అలాగే శరీరాన్ని కప్పుకునేందుకు ధరించే దుస్తులు కూడా కాటన్ తో చేసినవై ఉండాలి. వదులుగా, గాలి తగిలేలా ఉండాలి.
షేవింగ్ చేసుకోవాలి
చంకల్లో అలాగే ఇతర అంతర్గత భాగాలలో ఎప్పటికప్పుడు షేవింగ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అయితే ఇది చాలా ప్రధానమైన అంశం. ఆయా భాగాలలో వెంట్రుకలు ఎక్కువగా పెరిగితే చెమట ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి ఆ ప్రదేశాలలో షేవింగ్ చేసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
సెంట్ ఉత్పత్తులను నివారించండి
ఎండాకాలంలో శరీర దుర్వాసన అరికట్టడానికి చాలా మంది సెంట్ ఉత్పత్తులు, సువాసన గల షాంపూలు, సబ్బులు ఉపయోగిస్తారు. కానీ వీటిలోని రసాయనాలు సున్నితమైన ప్రదేశాలలో pH బ్యాలెన్స్‌ను నాశనం చేస్తాయి. తద్వారా ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. వీలైనంతవరకు ఆల్కాహాల్ రహిత, సువాసన తక్కువ ఉండే ఉత్పత్తులను ఉపయోగించండి.
టాపిక్