Maintain Good Eyesight : ఆలస్యం ఏమిలేదు.. ఇప్పటికైనా మీ కళ్లను.. కంటిపాపల కాపాడుకోండి..
13 October 2022, 18:00 IST
- World Sight Day 2022 : వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యం దెబ్బతినడం వంటివి జరుగుతాయి. పైగా వీటి ప్రభావం కళ్లపైనే ఎక్కువ పడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో చిన్నా పెద్దా లేకుండా అందరూ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మీ కంటిని రక్షించుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్లకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి
Maintain Good Eyesight : అక్టోబరు 13న ప్రపంచ దృష్టి దినోత్సవం జరుపుకుంటారు. అయితే రెటీనా వ్యాధుల గురించి అవగాహన పెంచడానికి, కంటి సమస్యలను నివారించడానికి ఈ డేని నిర్వహిస్తున్నారు. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా అనారోగ్యానికి గురయ్యే లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక పరిస్థితులు ఉన్నవారిలో.. సాధారణ కంటి పరీక్షల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడానికి ప్రపంచ దృష్టి దినోత్సవం చేస్తున్నారు.
ఒక నెలలో 60% రెటీనా వ్యాధి రోగులను, 10% గ్లాకోమా రోగులను మరియు 30% కంటిశుక్లం రోగులను చూస్తున్నామని VRSI ప్రెసిడెంట్ డాక్టర్ N.S మురళీధర్ తెలిపారు. అయితే ఈ మూడు పరిస్థితులలో సకాలంలో రోగ నిర్ధారణ లేకపోవడం వల్లే ఈ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. దాని ఫలితంగా కోలుకోలేని దృష్టి నష్టం జరుగుతుందని వెల్లడించారు. అయితే మెరుగైన దృష్టిని కావాలనుకునేవారు 6 చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెగ్యులర్ చెక్అప్‌లు
మంచి కంటి చూపు కావాలి అనుకుంటే సరిపోదు. దానికోసం రెగ్యులర్ కంటి చెక్అప్‌లు చేయించుకోవాలి. ఎందుకంటే అవి వ్యాధులను నివారించడంలో లేదా వాటిని ముందుగానే గుర్తించడంలో, దృష్టి నష్టాన్ని ఆపడంలో సహాయపడతాయి.
కంటి వ్యాధులు
కంటికి సంబంధించిన వ్యాధుల గురించి బాగా తెలుసుకోండి. ఇది మీ కంటిచూపును మెరుగ్గా చేయడంలో సహాయపడుతుంది. బాహ్య నష్టం అయినా లేదా అంతర్లీన పరిస్థితి అయినా.. మన కంటి చూపును కాపాడుకోవడంలో అవగాహన కచ్చితంగా ఉండాలి.
షేడ్స్ ధరించండి
మాక్యులా డిజెనరేషన్ అనేది కాలక్రమేణా మాక్యులా క్షీణించడం వల్ల వస్తుంది. ఇది అస్పష్టత, కొన్ని సందర్భాల్లో అంధత్వం ఏర్పడేలా చేస్తుంది. సూర్యుడి UV కిరణాలు వీటికి ముఖ్యకారణం. కాబట్టి మీ సన్ గ్లాసెస్ ధరించడం ద్వారా మీ కళ్లను రక్షించుకోవచ్చు.
స్క్రీన్ సమయాన్ని తగ్గించండి
కంప్యూటర్‌లు, టీవీలు, ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్లు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్క్రీన్ భారం కళ్లపై పడకుండా కొంత విరామం తీసుకోవాలి. ఇలా ఎక్కువసేపు చూడడం వల్ల మీ కళ్లు పొడిబారిపోతాయి. స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి మీరు ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోవాలి. లేదా 20-20-20 నియమాన్ని ప్రయత్నించండి. మీ ముందు 20 అడుగుల దూరంలో 20 సెకన్ల పాటు ప్రతి 20 నిమిషాలకు దూరంగా చూడండి.
మధుమేహ వ్యాధిగ్రస్తులైతే..
మధుమేహమున్నవారు DRని నివారించాలనుకుంటే లేదా నిర్వహించాలనుకుంటే గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించడం, నియంత్రించడం ముఖ్యం. ఎందుకంటే అధిక స్థాయి గ్లూకోజ్ DR నుంచి అంధత్వాన్ని కలిగిస్తుంది. అయితే అధిక రక్తపోటు గుండె, కళ్లను దెబ్బతీస్తుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి
హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ కళ్లకు ఒత్తిడిని కలిగిస్తాయి. రెటీనా నష్టం, కంటి వ్యాధులు ఎక్కువయ్యేలా చేస్తాయి కాబట్టి.. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.
టాపిక్