తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mental Health : రోజూ ఉదయం ఈ ఆసనాలు వేస్తే చాలు.. ఒత్తిడి దూరం అయిపోతుంది..

Mental Health : రోజూ ఉదయం ఈ ఆసనాలు వేస్తే చాలు.. ఒత్తిడి దూరం అయిపోతుంది..

21 July 2022, 6:41 IST

google News
    • Yoga for Mental Health : ప్రస్తుత రోజుల్లో మానసిక ప్రశాంతత అందరికీ అవసరమే. ఒత్తిడి, నిరాశతో కృంగిపోయేవారు రోజూ ఈ ఆసనలు వేస్తే.. వాటినుంచి ఉపశమనం పొందుతారు అంటున్నారు యోగా నిపుణులు. నిద్రలేచిన వెంటనే ఈ చిన్న చిన్న ఆసనాలను మీరు వేసి.. మీ రోజూవారి ఒత్తిడిని తగ్గించుకోండి. 
ఒత్తిడిని తగ్గించే యోగాసనాలు
ఒత్తిడిని తగ్గించే యోగాసనాలు

ఒత్తిడిని తగ్గించే యోగాసనాలు

Yoga for Mental Health : మంచి మానసిక ఆరోగ్యం మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచడమే కాకుండా సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మీ జీవితాన్ని ఆనందించడానికి సహాయపడుతుంది. నిరాశ, ఆందోళన, ఒత్తిడిని దూరం చేస్తుంది. అయితే మీరు మీ ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. యోగా మీకు పర్​ఫెక్ట్. ఇది మీకు మానసిక శ్రేయస్సును అందించడంలో సహాయపడుతుంది. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడం కోసం.. ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునేవారికి.. మీకు సహాయపడే ఐదు యోగా ఆసనాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుని.. ఒత్తిడిని దూరం చేసుకోండి.

పద్మాసనం

పద్మాసనం ఒత్తిడిని తగ్గించడానికి, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ధ్యాన భంగిమ కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

మీ వీపును నిటారుగా ఉంచి కూర్చోండి. మీ కాళ్లను చాచి.. మీ మోకాళ్లను వంచి.. కుడి కాలును మీ ఎడమ తొడపై, ఎడమ కాలును కుడి తొడపై ఉంచండి. మీ అరచేతులను మోకాళ్లపై ఉంచండి. మీ కళ్లు మూసుకుని లోతైన శ్వాస తీసుకోండి. ఐదు సెకన్లు శ్వాసను ఆపి.. విడుదల చేయండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

హలాసనం

హలాసనం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. అంతేకాకుండా మీ వీపును టోన్ చేస్తుంది. బలపరుస్తుంది.

ముందుగా పడుకోండి. మీ చేతులను చాచి ఉంచండి. మీ శరీరాన్ని అలాగే ఉంచి 90 డిగ్రీల కోణంలో మీ కాళ్లను పైకి లేపండి. ఇప్పుడు మీ చేతుల సహాయంతో మీ కాళ్లను మీ తలపైకి తీసుకువచ్చి.. మీ కాలితో నేలను తాకండి. 30 సెకన్లపాటు ఈ భంగిమలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనంలో నాడీ వ్యవస్థ కూడా బలపడుతుంది.

బాలసనం

బాలసనం మీ నాడీ, శోషరస వ్యవస్థలకు గొప్ప భంగిమ. ఇది మీ తుంటి, చీలమండలు, తొడలను విస్తరించి మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది.

మీ మడమల మీద కూర్చుని మోకరిల్లండి. మీ చేతులను చాచి.. మీ ఛాతీ మీ తొడలను తాకే వరకు ముందుకు వంగండి. లోతైన శ్వాస తీసుకోండి. ఈ విశ్రాంతి భంగిమలో 30 సెకన్ల పాటు ఉండడానికి ప్రయత్నించండి. ఇది అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఉత్తనాసనం

ఈ యోగా భంగిమ ఒత్తిడి, అలసట, తేలికపాటి నిరాశ నుంచి ఉపశమనం పొందడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మీ తొడలు, తుంటి, స్నాయువులను కూడా సాగదీస్తుంది.

నిటారుగా నిల్చొని మీ చేతులను మీ తలపైకి ఎత్తండి. శ్వాస పీల్చుకుని.. మీ అరచేతులు నేలపై ఉండే వరకు ముందుకు వంగండి. మీ తలను మీ మోకాళ్లను ఆన్చేలా ప్రయత్నించండి. మీ కాళ్లను నిటారుగా ఉంచండి. ఆరు-ఎనిమిది శ్వాసల వరకు ఈ భంగిమలో ఉండండి. ఇది భావోద్వేగ సమతుల్యతను కాపాడుతుంది.

బిటిలాసనం

ఈ యోగా భంగిమ మీ మనస్సు ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీ వెన్నెముకను బలపరుస్తుంది. భావోద్వేగ సమతుల్యతను కాపాడుతుంది.

మీ తుంటిని నేరుగా మీ మోకాళ్లపై ఉంచి.. మీ చేతులను మీ భుజాల కంటే కొంచెం ముందుగా ఉంచండి. మీ అరచేతుల సహాయం తీసుకుంటూ మోకాళ్లపై పైకి లేవండి. మీ వీపును వంచి.. బొడ్డును లోపలికి లాగుతూ.. గడ్డం ఎత్తండి. 30 సెకన్లపాటు ఈ భంగిమలో ఉండండి.

టాపిక్

తదుపరి వ్యాసం