Vitamin B12 deficiency: ఈ 6 లక్షణాలు ఉంటే విటమిన్ బీ 12 లోపం ఉన్నట్టే
14 March 2023, 20:30 IST
- Vitamin B12 deficiency: ఈ 6 లక్షణాలను బట్టి విటమిన్ బీ 12 లోపం గమనించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలోని వివిధ భాగాలు తమ విధులు నిర్వర్తించేందుకు విటమిన్ బీ 12 అవసరం
విటమిన్ బీ 12 లోపం యువతలో కంటే వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శాఖాహారుల్లో కూడా విటమిన్ బీ12 లోపం కనిపిస్తుంది. భారతీయుల్లో సుమారు 47 శాతం మందిలో విటమిన్ బీ12 లోపం ఉన్నట్టు అంచనా. మాంసాహారానికి దూరంగా ఉండడం, లేదా మితంగా తినడం ఒక కారణం అయి ఉండొచ్చని అంచనా. బీ12 అనేది ఒక అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది. శరీరం తనంతట తాను బీ12 ఉత్పత్తి చేయలేదు. అందువల్ల ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా జంతు ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. వెజిటేరియన్లు, వేగన్స్ అయితే సప్లిమెంట్ల ద్వారా గానీ, విటమిన్ బీ 12 కలిపిన బలవర్థక ఆహారం ద్వారా గానీ పొందవచ్చు. ఈ బీ 12 విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ తగ్గినప్పుడు విటమిన్ లోపం ఏర్పడుతుంది. అంతిమంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
‘కణాలు, కండరాల పోషణకు శరీరం బీ12పై ఆధారపడుతుంది. బీ12 లోపం సాధారణంగా ఆందోళన కలిగించే అంశం కాదు. అయితే సరైన సమయంలో దీనిని హాండిల్ చేయకపోతే కష్టమైపోతుంది. విటమిన్ బీ12 లోపం ఉన్నట్టు గుర్తించేందుకు కొన్ని లక్షణాలు గమనించాలి..’ అని చెంబూర్ జెన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ విక్రాంత్ షా చెప్పారు.
విటమిన్ బీ 12 లోపం లక్షణాలు
మూడ్ హెచ్చుతగ్గులు: విటమిన్ బీ12 లోపం వల్ల మానసికంగా హెచ్చుతగ్గులు (మూడ్ స్వింగ్స్) ఎదుర్కొంటారు.
జ్ఞాపకశక్తి సమస్యలు: బీ12 విటమిన్ లోపం ఏర్పడితే జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. మీరు కీ ఎక్కడ పెట్టారో, వాలెట్ ఎక్కడ పెట్టారో పదే పదే వెతుక్కోవాల్సి వస్తుంది.
బాలెన్స్ కోల్పోతారు: మీరు తరచుగా పడిపోతున్నట్టయితే అది విటమిన్ బీ12 లోపంగా గమనించాలి.
కండరాల బలహీనత: విటమిన్ బీ12 లోపం ఉంటే మీ కండరాలు బలహీనంగా మారుతాయి.
కుంగుబాటు: మీరు గతంలో ఉన్నంత హుషారుగా లేకపోతే, మీకు ఆత్మ విశ్వాసం తగ్గినట్టు అనిపిస్తే, నిరాశ, నిస్సహాయత అనిపిస్తే విటమిన్ బీ12 లోపం ఉన్నట్టు గమనించాలి.
అలసట, రాత్రి చెమటలు: విటమిన్ బీ 12 లోపం ఉంటే రాత్రిపూట చెమటలు పడుతుంటాయి. తీవ్రమైన అలసటగా ఉంటుంది.
‘విటమిన్ బీ12 లోపం ఉంటే వైద్యుల సలహా మేరకు తగిన సప్లిమెంట్లు తీసుకోవాలి. అలాగే చేపలు, గుడ్లు, పాలకూర, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం తీసుకోవాలి..’ అని డాక్టర్ షా సూచించారు.