Age and BP reading: మీ వయసు ప్రకారం ఆరోగ్యకరమైన రక్తపోటు ఎంత ఉండాలో తెలుసుకోండి
08 August 2024, 16:30 IST
Age and BP reading: వయస్సును బట్టి రక్తపోటు ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కాలం జీవించడానికి రక్తపోటు అదుపులో ఉండాల్సిన అవసరం ఉంది.
ఆరోగ్యకరమైన రక్తపోటు రీడింగ్ ఎంత?
రక్తపోటు ఒక జీవనశైలి వ్యాధి. ఇది కొలెస్ట్రాల్, గుండె పనితీరుతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. హైబీపీ వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సరిగా పనిచేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే అధిక రక్తపోటు బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఒకసారి హైబీపీ వచ్చిందా… అది ఇక జీవితాంతం వదిలిపోదు. వయసును బట్టి రక్త పోటు రీడింగ్ ఎంత ఉండాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంతకుమించి పెరగకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ వయసును బట్టి రక్తపోటు రీడింగ్ ఎంతో ఉండాలో తెలుసుకోండి.
18-39 సంవత్సరాల వయస్సు గల పురుషులలో 119/70 మి.మీ బీపీ రీడింగ్ ఉండాలి. ఇక మహిళల్లో 110/68 మి.మీ బీపీ రీడింగ్ ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు.
అదే సమయంలో, 40-56 సంవత్సరాల వయస్సులో ఉన్న మగవారికి 124/77 మి.మీ బీపీ రీడింగ్, మహిళలకు 122/ 74 మి.మీ రక్తపోటు రీడింగ్ ఉండాలి.
అదే సమయంలో, 60 ఏళ్లు పైబడిన పురుషులందరికీ ఆరోగ్యకరమైన రక్తపోటు 133/69 గా ఉంటుంది. మహిళల్లో 139/68గా ఉండాలి. ఇక్కడ ఇచ్చిన రక్తపోటు పరిధిని సాధారణమైనదిగా పరిగణిస్తారు. వయస్సును బట్టి రక్తపోటు రీడింగ్ ఉంటే గుండె మీద ఒత్తిడి పడకుండా పనిచేస్తుంది.
ప్రముఖ కాలేయ వైద్యుడు సరిన్ ఒక పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాలను షేర్ చేశారు. ఎవరైనా దీర్ఘాయుష్షుతో జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మీ రక్తపోటు 100/70 ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు పెరగడం ధమనులకు మంచిది కాదు.
హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఇప్పుడు భారతీయ జనాభాలో పెరిగిపోతోంది. హైబీపీ అంటే గుండె రక్తాన్ని పంప్ చేస్తున్నప్పుడు ధమని గోడలపై అధిక పీడనాన్ని కలిగిస్తుంది. అప్పుడు బీపీ రీడింగ్ పెరుగుతుంది.
కొన్ని ఇతర వైద్య పరిస్థితులు కూడా హైబీపీ రావడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలికంగా మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు, థైరాయిడ్ బారిన పడిన వారు కూడా ఇలా హైబీపీ బారిన పడే అవకాశం ఉంది.
అతిగా మద్యం సేవించిన వారికి, డ్రగ్స్ వాడే వారికి కూడా హైబీపీ వస్తుంది. అలాగే మైగ్రేన్ కోసం వాడే మందులు, గర్భనిరోధక మాత్రలు కూడా హైబీపీకి కారణం అవుతాయి.
ఒక వ్యక్తికి అధికరక్తపోటు వచ్చే ప్రమాదాన్ని కొన్ని లైఫ్ ష్టైల్ అలవాట్లు కూడా పెంచుతాయి. ఒత్తిడి బారిన తీవ్రంగా పడుతున్నా, ఊబకాయం ఉన్నా, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకున్నా, వ్యాయామం చేయకపోయినా... జంక్ ఫుడ్ అధికంగా తిన్నా కూడా హైబీపీ వచ్చే అవకాశం ఉంది.
హైబీపీ లక్షణాలు
హైబీపీ వచ్చిన వారిలో తలనొప్పి అధికంగా వస్తుంది. చెవిలో ఏదో అసౌకర్యంగా ఉంటుంది. చూపు మసకగా మారుతుంది. తీవ్ర అలసటగా అనిపిస్తుంది. అంతా గందరగోళంగా అనిపిస్తుంది. గుండె కొట్టుకునే వేగం మారుతుంది.