EV Battery Explosion | ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలకుండా ఈ చిట్కాలు పాటించండి!
10 May 2022, 18:30 IST
- ఇటీవల కాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.
Electric Scooter - Random Image
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పెరిగాయి. e- స్కూటర్లను తయారుచేసే స్టార్టప్స్ కూడా ఇండియాలో ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ప్రస్తుతం వారానికో కొత్త మోడల్ మార్కెట్లో విడుదలవుతుంది. అయితే అంతా బాగానే ఉన్నా ఇటీవల కాలంగా EVల బ్యాటరీలు పేలుతుండటం కలవరపెట్టే అంశం. పర్యావరణహితం కోసం రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు చోదకుల ప్రాణాలను తీస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. వరుసగా చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలతో ఎలక్ట్రిక్ వాహనం ఉపయోగించాలంటేనే వినియోగదారులు జంకుతున్నారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో సీటు కింద బాంబు పెట్టుకున్నట్లే EVలు తయారయ్యాయి. దీంతో ఇంధన ఖర్చు ఎక్కువైనా సరే మళ్లీ సాంప్రదాయ వాహనాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇది ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్న EV ఇండస్ట్రీ భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది.
అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అటు EVల తయారీదారులు కూడా దేశంలో ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా నాణ్యమైన బ్యాటరీలను రూపొందించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
భవిష్యత్తు ఎలా ఉన్నా ప్రస్తుతానికి వస్తే EVలు వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సురక్షితంగా ఉంచడానికి, అలాగే అందులో బ్యాటరీల దీర్ఘాయువును పెంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి కచ్చితంగా పాటించండి.
ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతుంటే ఈ చిట్కాలు పాటించండి
- మీ ఎలక్ట్రిక్ వాహనంలోని బ్యాటరీలు అత్యంత చల్లని, వేడి వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వాటికి రక్షణ కవచాలు తొడగండి.
- ఎలక్ట్రిక్ వాహనాన్ని నీడలో పార్క్ చేయండి. ప్లగ్ ఇన్‌లో ఉంచండి. తద్వారా మీ వాహనంలో థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గ్రిడ్ పవర్‌తో మాత్రమే పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతల పరిధిని నియంత్రణలో ఉంచండి.
- నాణ్యమైన బ్యాటరీ రకాలనే ఎంచుకోండి. బ్యాటరీ ఛార్జింగ్ చేసేందుకు ప్రామాణికమైన ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. వేరొకరి ఛార్జర్‌ను ఉపయోగించవద్దు, ఛార్జర్‌లను పదేపదే మార్చవద్దు.
- బ్యాటరీ ఎప్పుడూ పూర్తిగా అయిపోయే వరకు ఉపయోగించవదు, నిండుగా ఛార్జింగ్ చేయవద్దు. ఎల్లప్పుడు 20 శాతానికి తక్కువ కాకుండా, 80 శాతానికి మించకుండా ఛార్జింగ్ పెట్టుకోవాలి.
- మీ ఎలక్ట్రిక్ వాహనంతో రైడ్ చేసి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టవద్దు. ఒక గంటసేపు పక్కన ఉంచి చల్లబరచడం మంచిది. ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
- బ్యాటరీలను ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశంలో గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. బ్యాటరీకి కనీసం 2 మీటర్ల పరిధిలో ఎలాంటి వస్తువులను ఉంచకూడదు.
- మీరు ఎలక్ట్రిక్ వాహనం నడిపేటపుడు వేడెక్కుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాహనం నీడలో పార్క్ చేయండి. కొద్దిసేపు ఉపయోగించడం ఆపేయండి.
మీ బ్యాటరీకి సంబంధించి ఎలాంటి సమస్యను గుర్తించినా వెంటనే ఛార్జింగ్ నుంచి తొలగించి, మీ డీలర్‌ను సంప్రదించండి. సురక్షితమైన రైడ్‌ను పొందండి.
టాపిక్