Paneer Egg Popcorn । ఓటీటీలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? చిన్న బ్రేక్ తీసుకోండి, పాప్‌కార్న్ తినండి!
22 December 2022, 18:54 IST
- ఇంట్లో మీ మూవీ టైంని మరింత వినోదాత్మకంగా మార్చుకోండి. బ్రేక్ టైంలో పాప్‌కార్న్ తినాలనుకుంటే స్పెషల్ Paneer Egg Popcorn Recipe ఇక్కడ ఉంది చూడండి.
Paneer Egg Popcorn Recipe
మీరు సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లినపుడు ఇంటర్వెల్ లో విక్రయించే పాప్‌కార్న్ ధర సినిమా టికెట్ ధర కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పాప్‌కార్న్ తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది, పెద్దగా శ్రమ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా నచ్చిన ఫ్లేవర్లలో పాప్‌కార్న్ సిద్ధం చేయవచ్చు. అయితే కరోనా తర్వాత థియేటర్లకు వెళ్లి సినిమా చూసే సాంప్రదాయం తగ్గింది. ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్. మనకు నచ్చిన సినిమాలను ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు, ఎన్నిసార్లు ఎన్ని సినిమాలైనా చూడవచ్చు. ఇప్పుడు ఇంట్లోనే సినిమా థియేటర్ ఫీల్ పొందేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి ఇంట్రవెల్ సమయంలో పాప్‌కార్న్ ఎందుకు ఉందకూడదు?
మీకోసమే స్పెషల్ పనీర్ ఎగ్ పాప్‌కార్న్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. మీరు హాయిగా సినిమా చూస్తూ, మీకు నచ్చిన డ్రింక్స్ తాగుతూ, మధ్యలో పనీర్ పాప్‌కార్న్‌ని తింటూ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే సాయంత్రం స్నాక్స్ కోసం, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, ఏదైనా పార్టీ ఏర్పాటు చేసినపుడు కూడా ఇది మంచి స్టార్టర్ లాగా కూడా మీకు ఉపయోగపడుతుంది. మరి రుచికరమైన పనీర్ ఎగ్ పాప్‌కార్న్ మీరూ తినాలనుకుంటే, దీని తయారీకి ఏమేం కావాలి, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.
Paneer Egg Popcorn Recipe కోసం కావలసినవి
- పనీర్/ టోఫు - 250 గ్రాములు
- కారం పొడి - 1 టీ స్పూను
- ఒరేగానో - 1/2 టీస్పూన్
- నల్ల మిరియాల పొడి - 1/4 టీస్పూన్
- బుక్వీట్ - 1/2 కప్పు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పసుపు - చిటికెడు
- బేకింగ్ సోడా - చిటికెడు
- బ్రెడ్ క్రమ్స్ - అర కప్పు
- ఉప్పు - రుచి ప్రకారం
- గుడ్లు - 2 (ఐచ్ఛికం)
పనీర్ పాప్‌కార్న్ తయారీ విధానం
- ముందుగా పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కుండలో పనీర్ ముక్కలు, నల్ల మిరియాల పొడి, కారం, పసుపు ఒరేగానో, కొద్దిగా ఉప్పు కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయండి.
- మరో పాత్రలో బుక్వీట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేకింగ్ సోడా, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు మ్యారినేట్ చేసిన పనీర్ ముక్కలను ఒక్కొక్కటిగా బ్యాటర్ మిశ్రమంలో ముంచి ఆపైన బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేయాలి.
4. ఒకవేళ మీరు గుడ్లు తినేవారు అయితే, మీరు పైన విధంగా బ్యాటర్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా పనీర్‌ను బీట్ చేసిన గుడ్డు మిశ్రమంలో ముంచి, బ్రెడ్ ముక్కల గిన్నెలో టాసు చేయవచ్చు.
5. అదనపు క్రంచ్ కోసం మీరు పనీర్‌ను గుడ్డు లేదా బ్యాటర్ రెండింటిలో ముంచి డబుల్ కోట్ చేయవచ్చు. మీరు పూర్తిగా శాకాహారి అయితే, పనీర్ స్థానంలో టోఫును భర్తీ చేసి టోఫు పాప్ కార్న్ రెడీ చేయవచ్చు.
6. ఈ పనీర్ ముక్కలను వేడి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
అంతే, రుచికరమైన పనీర్ ఎగ్ పాప్‌కార్న్ రెడీ. టొమాటో కెచప్‌తో అద్దుకొని తింటూ ఇంట్లో మీ మూవీ టైంను ఆస్వాదించండి.