Egg Masala kheema: దాబా స్టైల్ లో ఎగ్ మసాలా కీమా కర్రీ వండండి, వేడివేడి అన్నంలో అదిరిపోతుంది
11 January 2024, 17:30 IST
- Egg Masala kheema: దాబా స్టైల్ లో ఎగ్ మసాలా కీమా కర్రీ వండితే రుచి మామూలుగా ఉండదు. దీని రెసిపీ ఎలాగో చూద్దాం.
ఎగ్ మసాలా కీమా కర్రీ
Egg Masala kheema: గుడ్డుతో వండిన వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ గుడ్లు కూర, గుడ్లు వేపుడు, ఎగ్ కీమా వంటివి చేస్తే ఎలా? ఓసారి దాబా స్టైల్ లో ఎగ్ మసాలా కీమా కర్రీని కూడా వండండి. వేడివేడి అన్నంలో అదిరిపోతుంది. చపాతీలకు జతగా దీన్ని తింటే రుచిగా ఉంటాయి. ఎగ్ కర్రీ కన్నా దీని రుచి బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం.
ఎగ్ మసాలా కీమా రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు - నాలుగు
జీలకర్ర - ఒక స్పూను
ఉల్లిపాయలు - ఒకటి
పచ్చిమిర్చి - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
కారం - అర స్పూను
జీలకర్ర - ఒక స్పూను
నీరు - తగినంత
కొత్తిమీర - ఒక కట్ట
క్యాప్సికం - ఒకటి
టమాటా - ఒకటి
ధనియాల పొడి - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఎగ్ మసాలా కీమా రెసిపీ
1. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో జీలకర్ర వేసి వేయించాలి.
3. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి వేసి వేయించాలి.
4. ఉల్లిపాయల రంగు మారేవరకు అలా వేయిస్తూ ఉండాలి.
5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు , పసుపు వేసి కలుపుకోవాలి.
6. ఇవన్నీ బాగా మగ్గాక టమోటా తరుగును వేసి మూత పెట్టి మగ్గించాలి.
7. టమోటోలు మెత్తగా అయ్యాక జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
8. చిన్న మంట మీద ఉడికించాలి. పైన మూత పెట్టాలి.
9. ఆ తర్వాత క్యాప్సికం తరుగును వేసి కాస్త నీళ్లు పోసి ఇగురు లాగా ఉడికించాలి.
10. ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లను సన్నగా తరగాలి.
11. ఆ కోడిగుడ్ల తరుగును కళాయిలోని మిశ్రమంలో వేయాలి.
12. బాగా కలిపి ఐదు నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించాలి. దించేముందు తురిమిన కొత్తిమీర ఆకులను చల్లాలి.
13. పైన నిమ్మరసం చల్లుకొని స్టవ్ కట్టేయాలి. కొంతమంది పైన బట్టర్ కూడా వేసుకుంటారు. దీని రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అన్నానికి, చపాతీకి, రోటీకి అన్నింటికి జతగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
టాపిక్