తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dhoop Stick, Wick Diy: శ్రావణంలో శివారాధన కోసం సువాసనల ధూపం స్టిక్, వత్తులు ఇలా చేయండి..

Dhoop stick, wick DIY: శ్రావణంలో శివారాధన కోసం సువాసనల ధూపం స్టిక్, వత్తులు ఇలా చేయండి..

06 August 2024, 8:30 IST

google News
  • Dhoop stick, wick DIY: శ్రావణంలో శివుడిని పూజించడానికి మూలికా ధూపం ఎలా తయారు చేయాలో, సువాసనలు వెదజల్లే వత్తులు ఎలా చేయాలో తెల్సుకోండి. 

ధూపం స్టిక్, వత్తులు
ధూపం స్టిక్, వత్తులు (pinterest)

ధూపం స్టిక్, వత్తులు

పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసం మొత్తం శివుడిని పూజిస్తారు. ఆ మాసంలో శివుడు భక్తుల కోరికలను నెరవేర్చడానికి స్వయంగా భూలోకానికి వస్తాడని చెబుతారు. భక్తులంతా తమ ఇళ్లను అలంకరించి శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటారు. ఇళ్లు మొత్తం పరిమళాలు గుబాలించాలంటే.. దానికోసం అవసరమయ్యే ధూపం స్టిక్, సువాసనలు వెదజల్లే వత్తి తయారీ ఎలాగో చూడండి. పూజలో ఉపయోగించండి.

ధూపం స్టిక్ తయారీ:

1. ధూపం స్టిక్ తయారీ కోసం మార్కెట్ నుంచి ఏమీ తేవాల్సిన పనిలేదు. మార్కెట్లో దొరకే దూపం కప్స్ లాగానే వీటిని వెలిగిస్తే కూడా మంచి పొగ వస్తుంది. సువాసనలతో ఇల్లు నిండిపోతుంది.

2. దానికోసం దేవుడికి పెట్టిన పువ్వుల రేకులు ఎండిపోయినవి తీసుకోవాలి. లేదంటే తాజా పూలని తీసుకుని ఎండబెట్టి ఆ రేకులను వాడాలి. అలాగే కొబ్బరి పీచు లేదా కలప పొట్టు వాడొచ్చు. వీటితో పాటు కొద్దిగా గంధం పొడి, గోధుమపిండి, కర్పూరం, దేశీ నెయ్యి తీసుకోవాలి.

3. నెగిటివిటీని తొలగించే ఈ మూలికా ధూపం స్టిక్ తయారు చేయడానికి, ముందుగా ఎండిన పూరేకులు, కొబ్బరి బెరడును మిక్సీలో వేసి మెత్తని పొడిని తయారు చేయండి. ఇప్పుడు ఈ పొడిని జల్లెడ పట్టండి. అప్పుడు అందులో ముద్దలు ఉండవు. ఎంత సన్నటి పొడి ఉంటే ధూపం అంత బాగా సిద్ధమవుతుందని గుర్తుంచుకోండి.

4. ఇప్పుడు ఈ పొడిలోనే కొద్దిగా గంధం పొడి, గోధుమపిండి, కర్పూరం పొడి కలపాలి. ఇప్పుడు ఈ పొడిని నెయ్యి సహాయంతో ముద్దలా చేసుకోవాలి.

5. ఈ ముద్దను కొద్దికొద్దిగా తీసుకుని మీకిష్టమైన ఆకృతిలో ధూపం స్టిక్స్ తయారు చేసుకోండి. కప్స్ లాగా, పొడవాటి స్టిక్స్ లాగా చేసుకోవచ్చు.ఫ్యాన్ కింది రెండ్రోజులు ఆరనిస్తే బాగా గట్టిపడతాయి. పూజలో వీటిని వెలిగించుకుంటే మంచి వాసనలు వెదజల్లుతాయి.

సువాసనల వత్తుల తయారీ:

1. వెలిగించగానే మంచి వాసననిచ్చే వత్తుల తయారీ చాలా సులభం. దీని కోసం, 1 గిన్నెడు నెయ్యి, 6 నుండి 7 కర్పూరం బిల్లలు, సుమారు 30 దాకా పత్తితో చేసిన వత్తులు అవసరం.

2. ముందుగా ఒక పాత్ర లో నెయ్యిని వేడి చేయాలి. ఆ తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కర్పూరం ముక్కలను గ్రైండ్ చేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. గోరువెచ్చని నెయ్యిలో కర్పూరం పొడి వేసి బాగా కలపాలి.

3. అందరి ఇంట్లో ఉండే ఐస్ క్యూబ్ ట్రే ఇప్పుడు అవసరం అవుతుంది. ముందుగా ఈ ట్రేలో ఉండే అన్ని గడుల్లో వత్తులు ఉంచాలి. అవి కాస్త బయటకు వచ్చేలా ఉండాలి. వాటిలో నెయ్యిని కొద్దికొద్దిగా వేయాలి.

4. వీటిని అరగంట సేపు ఫ్రీజర్ లో ఉంచితే గట్టిపడతాయి. మీరు దీపం వెలిగించేటప్పుడు వీటిలో ఒక వత్తిని నెయ్యి బిల్లతో సహా తీసుకుని దీపం మధ్యలో పెట్టి వెలిగిస్తే చాలు. ఇంటి వాతావరణం మొత్తం కర్పూరం వాసనతో నిండిపోతుంది. సానుకూలంగానూ అనిపిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం