DASH Diet : ఈ DASH డైట్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటి?
28 July 2022, 14:20 IST
- DASH Diet : అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి చాలామంది DASH డైట్‌ను ఫాలో అవుతున్నారు. DASH డైట్ అంటే Dietary Approaches to Stop Hypertension. అయితే ఈ డైట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. DASH డైట్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Dietary Approaches to Stop Hypertension diet
DASH Diet : ఒత్తిడి, కాలుష్యం లేదా జన్యుపరమైన కారణాల వల్ల కూడా చాలా మంది హైపర్‌టెన్షన్(రక్తపోటు)కు గురవుతారు. అధిక రక్తపోటు ధమనుల గోడలను దెబ్బతీసి.. గుండె, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే అధిక రక్తపోటు ఉన్న వారు.. ఎల్లప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు యూఎస్‌కు చెందిన DASH డైట్‌ను ఫాలో అవుతారు. ఈ డైట్‌లో ఇండియాలో దొరికే ఆహారాన్ని చేర్చి తీసుకుంటారు. అయితే DASH డైట్‌ను ఫాలో అవుతున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అంటున్నారు నిపుణులు. అవేంటో.. డైట్‌లో తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో.. తీసుకోకూడనవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
DASH డైట్‌లో తీసుకునే ఆహారాలు
భారతీయ DASH డైట్‌లో ఎక్కువగా మెంతి నీరు, పండ్లు, కూరగాయలు, నూనె లేని పప్పు పరాటా, పనీర్, మొలకెత్తిన పెసర్లు, పాలక్ పనీర్, ఓట్స్ ఉప్మా, గ్రీన్ సలాడ్, పెరుగు, చపాతీ, బ్రౌన్ రైస్‌ను తీసుకోవచ్చు.
ఇవి రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. సరే వీటిని రక్తపోటు తగ్గుతుంది కదా అని ఎక్కువగా తినకూడదు. వీటిని కూడా కాస్త మితంగా తినాలి.
DASH డైట్‌లో తినకూడని ఆహారాలు
ఆహారం నుంచి ఉప్పును పూర్తిగా మినహాయించాలి. దీనితో పాటు కుకీలు, పేస్ట్రీలు, సోడాలు వంటి చక్కెర కలిగి ఉన్న స్నాక్స్‌కు దూరంగా ఉండాలి. కొన్ని రకాల మాంసాలతో పాటు ఆల్కహాల్, కెఫిన్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
నూనెల వాడకం చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే అధిక నూనె ఆహార ప్రణాళికను నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
DASH డైట్‌లో చేయవలసినవి & చేయకూడనివి
DASH డైట్‌తో పాటు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. రక్తపోటు స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. కాబట్టి వాటిని పూర్తిగా నిలిపివేయాలి.
హైపర్‌టెన్షన్‌ను తగ్గించడానికి ఒత్తిడిని తగ్గించడం చాలా అవసరం. కాబట్టి అభిరుచులు, క్రీడలు లేదా ధ్యానం చేయండి.
DASH డైట్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
ఈ ఆహారం మీ మొత్తం ఆరోగ్యాన్ని బాగా ప్రోత్సహిస్తుంది. రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా భారతీయ DASH డైట్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ ఆహారం మీ ఎముకలను బలపరుస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. జీవక్రియ రుగ్మతలను నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా DASH డైట్ ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.