Food Storage | ఇలాంటివి పొరపాటున కూడా ఫ్రిజ్‌లో నిల్వచేయవద్దు!
21 July 2022, 19:10 IST
- కూరగాయలు, పండ్లు ఇతర అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే కొన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
Don't keep these things in fridge
ఆహార పదార్థాలను నిల్వ చేయాలంటే సరైన పద్ధతి తెలిసి ఉండాలి. పదార్థాన్ని బట్టి అది నిల్వ చేసే విధానం కూడా వేరుగా ఉంటుంది. అప్పుడే అవి చాలాకాలం పాటు తాజాగా నిలిచి ఉంటాయి. ఇప్పుడు ఫ్రిజ్‌ల వినియోగం పెరిగాక, మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ప్రతీ పదార్థాన్ని ఫ్రిజ్‌లో తోసేస్తున్నారు. అయితే అన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు. కొన్ని రకాల కూరాగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచటం కంటే బయటే తాజాగా ఉంటాయి. కాబట్టి రిఫ్రిజిరేటర్‌లో ఏయే కూరగాయలు, పండ్లు, పదార్థాలు నిల్వచేయకూడదో ఇక్కడ తెలిజేస్తున్నాం.
ఈ కింద జాబితా చేసిన పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వచేయకపోవటమే ఉత్తమం.
1) టొమాటో
టొమాటోలను నిల్వచేయటానికి ఫ్రిజ్ ఉత్తమమైన ప్రదేశం కాదు. టొమాటోలు ఎండలో పెరిగుతాయి, విపరీతమైన ఉష్ణోగ్రతలను అవి తట్టుకోలేవు. ఫ్రిజ్‌లోని చల్లని ఉష్ణోగ్రతలు వాటి రుచిని పాడు చేస్తాయి.
2) అరటిపండ్లు
అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడవుతాయి. అరటిపండ్ల నుంచి ఇథిలీన్ వాయువు విడుదలవుతుంది, దీనివల్ల చుట్టుపక్కల ఉన్న పండ్లు కూడా త్వరగా పండుతాయి. కాబట్టి వాటిని వంటగదిలో ప్రత్యేకంగా ఉంచడానికి ప్రయత్నించండి.
3) బ్రెడ్
బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల చాలా త్వరగా ఆరిపోతుంది. బ్రెడ్ దాని తేమను కోల్పోతుంది. అందువల్ల, బ్రెడ్‌ను నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం బ్రెడ్ బాక్స్‌లో ఉంచడం లేదా వంటగదిలో గాలి తగలకుండా భద్రపరచటం. బిస్కెట్లు అయినా అంతే.
4) బంగాళాదుంప
బంగాళాదుంపలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. వాటిని కూరగాయల బుట్టలో బయట ఉంచడానికి ప్రయత్నించండి. ఫ్రిజ్‌లో ఉంచితే కుచించుకుపోతాయి.
5) వెల్లుల్లి
వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెట్టడం తప్పుకాదు. కానీ మీరు వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఇతర పదార్థాలతో ఉంచినపుడు దాని ఫ్లేవర్ మిగతా పదార్థాలకు అంటుకుంటుంది. అంతేకాదు వెల్లుల్లి ఫ్రిజ్‌లో త్వరగా మొలకెత్తుతుంది. ఈ సందర్భంలో దాని రుచి, వాసన కూడా చెడిపోతుంది.
6) నెయ్యి
నెయ్యిని ఫ్రిజ్‌లో ఉంచితే గడ్డకట్టడంతో పాటు దాని రుచి, సువాసను కోల్పోతుంది.
7) స్వీట్లు
స్వీట్లను ఫ్రిజ్‌లో ఉంచటం వలన అవి గట్టిగా తయారవుతాయి. వాటి తాజాదనం, అలాగే వాటి అసలు రుచిని కోల్పోతాయి. ఫ్లేవర్ నశించి తినేటపుడు చప్పగా అనిపిస్తాయి.
ఇవేకాకుండా.. తేనే, ఉల్లిపాయలు, ఆపిల్స్, అవకాడో, స్ట్రాబెర్రీలు, కాఫీ పొడి, దోసకాయలు, ఆకుకూరలు వంటి ఫ్రిజ్‌లో ఉంచటం కంటే బయట ఉంచితేనే తాజాగా, పోషక విలువలను కలిగి ఉంటాయి.
టాపిక్