Deeparadhana | దీపారాధన సమయంలో తెలియకుండా చేసే తప్పులు ఇవే..!
28 February 2022, 16:35 IST
- కొందరు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే మంచిదని చేస్తుంటారు. కానీ, దీపారాధన ఎలా చేయాలి? తదితర నియమాలు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీపారాధన ఎలా చేయాలి? అందుకు ఉన్న నియమాలు ఏంటో చూద్దాం.
దీపారాధన ఎలా చేయాలి?
దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. వెండి, పంచ లోగ, ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్లీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేకానీ శుభ్రపరచకుండా వత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు.
దీపారాధన ఎప్పుడు చేయాలి?
తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి.
ఈ దిశలో దీపారాధన చేయకూడదు..
దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి. దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని నమ్ముతారు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి బాధలు తొలగుతాయని ప్రతీతి.
సాధారణంగా దీపారాధనకి ఎక్కువమంది ఉపయోగించేవి దూదితో చేసిన వత్తులు. దూదిని పేని ఈ వత్తులను తయారు చేస్తారు. వీటితో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందంటారు.
వివిధ రకాల వత్తులతో దీపారాధన..
పార్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే.. పసుపు వస్త్రంతో చేసిన వత్తులు మంచివి. వివాహ జీవితం సాఫీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించేవాళ్లు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ఆప్యాయత, అనురాగాలతో కొనసాగుతుంది అంటారు పెద్దలు.
అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏక హారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డ వత్తిని ఏక హారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి. అగరవత్తులు, ఏక హారతి, కర్పూర హారతిని దీపారాధన నుంచి వెలిగించకూడదు.
దేవుతల ప్రకారం దీపారాధన..
దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీమహావిష్ణువుకు, సుబ్రహ్మణ్య స్వామికి, కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెబుతుంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్పనూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తికి ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో శనగనూనె వాడరాదు. వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ వేసి దీనిపై దీపారాధన చేయాలి.
టాపిక్