తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రుచులయందు బిర్యానీ రుచి వేరయా.. ఈ బిర్యానీలను తప్పక రుచి చూడాల్సిందేనయా!

రుచులయందు బిర్యానీ రుచి వేరయా.. ఈ బిర్యానీలను తప్పక రుచి చూడాల్సిందేనయా!

Manda Vikas HT Telugu

28 February 2022, 20:11 IST

google News
    • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80 రకాల బిర్యానీ రకాలు వండిపెడుతున్నారు. కొత్తకొత్త ప్రయోగాలతో కొత్తకొత్త బిర్యానీలు అందుబాటులోకి వస్తున్నాయి. అన్ని బిర్యానీలను బియ్యంతోనే వండుతారు.
Biryani
Biryani (Stock Photo)

Biryani

బిర్యానీ ఈ పేరులోనే రుచి ఉంది. నాలుకను లపలపలాడించే వైబ్రేషన్స్ ఇందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80 రకాల బిర్యానీ రకాలు వండిపెడుతున్నారు. కొత్తకొత్త ప్రయోగాలతో కొత్తకొత్త బిర్యానీలు రుచి పోసుకుంటున్నాయి. అన్ని బిర్యానీలను బియ్యంతోనే వండుతారు. అయితే తయారీ విధానం, అందులో వాడే సుగంధ ద్రవ్యాలు, వచ్చే ఫ్లేవర్ ను బట్టి రకాల బిర్యానీలో వైవిధ్యం అనేది కనిపిస్తుంది. అయితే మన వద్ద బాగా ప్రాముఖ్యత పొందిన బిర్యానీ రకాలేంటో తెలుసుకోండి. ఈ బిర్యానీలను మీరు రుచి చేశారో లేదో చెక్ చేసుకోండి.

హైదరాబాద్ దమ్ బిర్యానీ: 

ఆకలేసినపుడు హైదరాబాద్ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది దమ్ బిర్యానీ. నవాబుల కిచెన్లో కూడా దమ్ బిర్యానీ మెయిన్ కోర్స్ గా ఉండేది. అలా అప్పటి నుంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ రంగు, రుచి, వాసనలు ప్రపంచానికి పాకి ప్రపంచంలోనే హైదరాబాద్ దమ్ బిర్యానీ 'ది బెస్ట్' అని గుర్తింపుపొందింది. దాదాపు మీలో చాలా మందికి దమ్ బిర్యానీ ఫేవరెట్ అయి ఉంటుంది.

చిక్ పేట దొన్నే బిర్యానీ: 

ఆకుతో చేసిన గిన్నెలాంటి ఒక డొప్పలో దీనిని వడ్డిస్తారు కాబట్టి దీనికి దొన్నె బిర్యానీ అని పేరు వచ్చింది. ఇది కన్నడీగుల కిచెన్ లో పాపులర్ అయిన బిర్యానీ. దీనికి బాస్మతీ బియ్యం కాకుండా మామూలు బియ్యాన్నే వాడతారు. నీలగిరి ప్రాంతంలో లభించే కొన్ని ప్రత్యేక సుగంధ దినుసులతో ఈ బిర్యానీని తయారు చేస్తారు. రంగులో ఆకుపచ్చ, పసుపు కలిపినట్లుగా ఉంటుంది. దీని రుచి, వాసన అమోఘం. హైదరాబాద్ బిర్యానీకి చేంజ్ కోరుకునేవారు ప్రత్యామ్నాయంగా ఈ బిర్యానీ ట్రై చేయొచ్చు.

అంబూర్ బిర్యానీ: 

తమిళనాడు కిచెన్ నుంచి పాపులర్ అయిన బిర్యానీ ఇది. ఈ వంటకాన్ని కూడా బాస్మతి బియ్యంతో కాకుండా మామూలు బియ్యంతో వండుతారు. ఈ బిర్యానీ రుచిలో టొమాటో ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది.

మలబార్ - తలసెరీ బిర్యానీ: 

మలబార్ బిర్యానీ కేరళలోని మలబార్ ప్రాంతంలో చాలా పాపులర్. పచ్చి మిరపకాయలు, దాల్చినచెక్క, లవంగాలు, సోపు, యాలకులు, మిరియాల మొక్కలతో చేసిన ఒక పేస్టును నూరి ఈ బిర్యానీ కోసం మసాలాగా వినియోగిస్తారు. ఇందులో ఫిష్ బిర్యానీ అయితే బాగుంటుంది.

కేరళకు చెందిన మరొక రకం తలసెరి బిర్యానీ. ఇందులో ప్రత్యేకమైన రుచి కోసం కాల్చిన జీడిపప్పును ఉపయోగిస్తారు. అలాగే బాస్మతి బియ్యానికి బదులుగా చిట్టి ముత్యాలు అనే బియ్యం రకాన్ని వాడతారు.

కలకత్తా బిర్యానీ: 

బెంగాలీలను బంగాళాదుంపలను విడదీయలేమంటారు. వారి కిచెన్లోని చాలా వంటకాల్లో ఆలుగడ్డలను వినియోగిస్తారు. బిర్యానీలో కూడా! కలకత్తా బిర్యానీని మాంసం, ఆలుగడ్డలు, కొద్దిగా పెరుగు వేసి, కొన్ని మసాల దినుసులతో తయారుచేస్తారు. స్పైసీనెస్ కోరుకోని వారికి ఈ బిర్యానీ చాలా బాగుంటుంది.

దిండిగల్ బిర్యానీ: 

దిండిగల్ బిర్యానీలో మాంసం వేరుగా, బిర్యానీ వేరుగా వండి ఆ తర్వాత రెండు కలిపి ఉడికిస్తారు. మసాలాను పేస్టుగా చేసి వినియోగిస్తారు. దీంతో దీని రుచి విభిన్నంగా కొద్దిగా పుదీనా ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది.

బిస్మిల్లా బిర్యానీ: 

ఆంధ్రా కిచిన్ లోని పల్నాడు ప్రాంతంలో ఈ బిర్యానీ ఫేమస్. ఈ బిర్యానీకి ఘాటెక్కువ, డబుల్ మసాల కలిగి ఉంటుంది.

లక్నోవి అవధి బిర్యానీ: 

ఈ తరహా బిర్యానీ నార్త్ ఇండియాలో పాపులర్. బిర్యానీ మసాలలో సోంపు, దాల్చినచెక్క, కుంకుమపువ్వు లాంటి సుగంధద్రవ్యాలను వినియోగించి చేస్తారు. దీనిని తయారుచేసే విధానం కూడా హైదరాబాద్ 'దమ్' బిర్యానిని పోలి ఉంటుంది. కాబట్టి చూడటానికి దమ్ బిర్యానీలాగే కనిపించినా, రుచిలో తేడా ఉంటుంది.

సింధీ బిర్యానీ: 

సింధులోయ ప్రాంతంలో ఈ తరహా బిర్యానీని వండుతారు. ఇందులో వాడే మిర్చి మసాలా, బంగాళాదుంపలు, ఎండిన రేగు, పుదీనా, పుల్లని పెరుగు సింధీ బిర్యానీకి భిన్నమైన రుచిని అందిస్తాయి. మసాలా ఎక్కువ వినియోగిస్తారు కాబట్టి ఇది కూడా స్పైసీగా ఉంటుంది.

 

టాపిక్

తదుపరి వ్యాసం