High Blood Pressure Control । అధిక రక్తపోటును నివారించాలా? దోసకాయ జ్యూస్ తాగండి!
17 August 2022, 17:39 IST
- అధిక రక్తపోటు అనేది చాలా తీవ్రమైన సమస్య. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం. అయితే దోసకాయ జ్యూస్ తాగటం వలన హైబీపీని నియంత్రించవచ్చునని నిపుణుల సలహా.. దోసకాయ జ్యూస్ ఎలా చేయాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
Cucumber Juice - High Blood Pressure
హైబీపీ (High Blood Pressure Control) అనేది చాలా సాధారణంగా అనిపించే సమస్య, లక్షణాలు కూడా కనిపించవు. కానీ ఇది కొన్నిసార్లు వ్యక్తి మరణానికి కూడా దారి తీస్తుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. అధిక రక్తపోటు ఉన్నవారికి ఆకస్మిక గుండెపోటు, గుండె ఆగిపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్ మొదలగు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. చాలావరకు ఈ హైబీపీ అనేది ఒత్తిడితో కూడిన జీవనశైలి వలన సంభవిస్తుంది.
అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ కలిగినపుడు గుండెకు వెళ్లే ధమని గోడలపై రక్త ప్రసరణ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. మామూలుగా 140/90గా ఉండాల్సిన రక్త ప్రసరణ కంటే 180/120గా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే హైబీపీగా పరిగణిస్తారు. రోజూవారీ కార్యకలాపాల ఆధారంగా ఈ రక్తపోటు అనేది రోజంతా మారుతూ ఉంటుంది. అయితే ఒత్తిడి, ఆందోళనతో పాటు ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవటం, అలాగే వ్యాయామం లేకపోవటం మొదలైన కారణాల చేత అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఈ హైబీపీని చికిత్స చేయకపోతే ప్రాణాలకు ప్రమాదం.
ఆహారంలో మార్పులు చేసుకోవటం, ఉప్పుకారాలు తగ్గించటం ద్వారా హైబీపీని అదుపులో ఉంచవచ్చు. దీనితో పాటు దోసకాయ జ్యూస్ తీసుకోవటం ద్వారా కూడా రక్తపోటు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్య కలిగిన వారు దోసకాయ జ్యూస్ తాగడం వల్ల వారి రక్తపోటు నియంత్రణలో ఉండటమే, శరీరంలోని టాక్సిన్స్ కూడా బయటకు పంపవచ్చు. ఇంకా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
దోసకాయలో ఉండే పోషకాలు
దోసకాయలో కాల్షియం, నాట్రియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఎక్కువ భాగం నీరు ఉంటుంది కాబట్టి చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల దోసకాయ తింటే బరువు కూడా తగ్గుతారు. ఇంకా దోసకాయలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, గ్లూకోజ్, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దోసకాయ తింటే అనేక రకాలుగా మేలు జరుగుతుంది. దోసకాయ జ్యూస్ చేసుకొని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి చలువ చేస్తుంది, హైబీపీని తగ్గిస్తుంది.
దోసకాయ జ్యూస్ ఎలా తయారు చేయాలి?
దోసకాయ జ్యూస్ చేయడానికి, ముందుగా 3 మీడియం సైజ్ దోసకాయలను తొక్కను తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలను బ్లెండర్‌లో వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం రసాన్ని ఫిల్టర్ చేసి, పలుచగా అయ్యేందుకు కొన్ని నీళ్లు కలుపుకోవాలి. రుచికోసం ఈ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లగా సర్వ్ చేయాలి. ఈ దోసకాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ కింద చూడండి.
అధిక బరువు తగ్గవచ్చు
దోసకాయ జ్యూస్ లో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి, బరువు తగ్గడంలోనూ సహాయపడతాయి.
ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి
దోసకాయ రసంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు మంచి నిద్రను అందించటంలో సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అందువల్ల అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు దోసకాయ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవాలి.
జీర్ణక్రియ సమస్యలు దూరం
గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం, పొత్తికడుపు ఉబ్బరం, కడుపులో చికాకు లేదా ఛాతీలో మంట వంటి సమస్యలు ఉంటే, మీరు తప్పనిసరిగా దోసకాయ జ్యూస్ తాగి చూడండి. అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.