Coconut Oil : స్ట్రెచ్‌మార్క్స్ నుంచి.. లిప్‌కేర్ వరకు.. కొబ్బరినూనె బెస్ట్
10 August 2022, 13:24 IST
- Coconut Oil Benefits : స్ట్రెచ్ మార్క్స్ వదిలించుకోవడానికైనా.. లేదా పెదవుల మృదుత్వాన్ని కాపాడుకోవడానికి కొబ్బరి నూనె చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా వివిధ చర్మ సంబంధిత సమస్యలకు ఇది సహజ పరిష్కారం. మరి చర్మానికి కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనెతో ఉపయోగాలు
Coconut Oil Benefits : కొబ్బరి నూనెతో ఉపయోగాలు అన్ని ఇన్ని కాదు. సహజమైన కొబ్బరినూనెతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. మీరు షాక్ అవుతారు. అంతేకాకుండా ఈ సమస్యకు కూడా కొబ్బరినూనె వాడొచ్చా అని మీరు ఆశ్చర్యపోతారు. అందుకే కొబ్బరినూనెను కేవలం తలకే కాకుండా.. మీ వివిధ సమస్యలకు ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుని.. మీకున్న ఇబ్బందులను నయం చేసుకోండి.
శిశువు చర్మానికి..
కొబ్బరి నూనె పిల్లలకు గొప్ప మాయిశ్చరైజర్. ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి.. చిన్నపిల్లలకు ఉపయోగించడానికి ఎలాంటి భయం అవసరం లేదు. అందుకే పిల్లలకు స్నానం చేయించే ముందు శరీరానికి మసాజ్ చేయడానికి దీనిని వాడతారు. కొబ్బరి నూనె నవజాత శిశువుల చర్మాన్ని బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇది మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇది వారి సున్నితమైన చర్మాన్ని తేమగా చేస్తుంది.
పగిలిన మడమలకై..
కాళ్ల పగుళ్లు అనేవి చాలా కామన్. కానీ వాటిని పట్టించుకోకపోతే చాలా చిరాకుగా కనిపిస్తాయి. ఒక్కోసారి నొప్పిని కలిగిస్తాయి. పగిలిన మడమలు చాలా అసౌకర్యంగా ఉంటాయి. మీ మడమ చుట్టూ చర్మం పొడిగా, గట్టిగా ఉన్నప్పుడే కాళ్లు పగులుతాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. మెరుగైన ఫలితాల కోసం.. కొబ్బరి నూనెను మడమపై మసాజ్ చేయవచ్చు. పగిలిన మడమలు రక్తస్రావం లేదా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే.. కొబ్బరి నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వాటిని నయం చేయడంలో సహాయపడతాయి.
పొడిబారిన పెదవులకు..
కొబ్బరి నూనె చాలా హైడ్రేటింగ్ కాబట్టి.. ఇది మీ పెదవులను కఠినమైన వాతావరణం నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా చలిగా ఉన్నసమయంలో మీ పెదవులు పొడిబారకుండా.. కొబ్బరి నూనె కాపాడుతుంది. మీరు కొబ్బరి నూనెను ఉపయోగించి ఇంట్లో లిప్ బామ్ కూడా తయారు చేసుకోవచ్చు.
మేకప్ రిమూవర్
కొబ్బరి నూనె ఒక అద్భుతమైన మేకప్ రిమూవర్. మీరు మీ మేకప్‌ను తొలగించాలనుకుంటున్నప్పుడు.. ఓ కాటన్ బాల్‌కి కొబ్బరి నూనెరాసి.. మేకప్‌ను తీయండి. ఇది చాలా ఈజీగా మీ మేకప్‌ను తొలగిస్తుంది.
స్ట్రెచ్ మార్క్స్
గర్భధారణ సమయంలో.. లేదా బరువు పెరిగినా.. తగ్గిన ఈ స్ట్రెచ్మార్కులు పడతాయి. ఇవి శరీరంపై చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. కాబట్టి వాటిని నివారించడానికి కొబ్బరి నూనె ఉత్తమమైనది. దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా.. స్ట్రెచ్ మార్కులను నయం చేస్తుంది. చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేసి.. స్ట్రెచ్ మార్క్స్ వల్ల కలిగే దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కేవలం ఒక చెంచా కొబ్బరి నూనెను స్ట్రెచ్ మార్క్స్‌కు అప్లై చేసి.. అది గ్రహించే వరకు మసాజ్ చేయాలి.
టాపిక్