తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Escalators To Mountains: పర్వతాలకు ఎస్కలేటర్లు పెట్టేసినా చైనా.. చెత్త ఐడియా అంటున్న నెటిజన్లు?

escalators to mountains: పర్వతాలకు ఎస్కలేటర్లు పెట్టేసినా చైనా.. చెత్త ఐడియా అంటున్న నెటిజన్లు?

09 August 2024, 18:30 IST

google News
  • escalators to mountains: చైనాలో పర్వతాలకు ఎస్కలేటర్ అమర్చారు. దీని గురించి భిన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెళ్లువెత్తుతున్నాయి. ఎందుకో తెల్సుకోండి.

పర్వతానికి ఎస్కలేటర్లు
పర్వతానికి ఎస్కలేటర్లు (Instagram)

పర్వతానికి ఎస్కలేటర్లు

అద్భుతమైన పర్వత దృశ్యాలను చూసే అవకాశాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో, చైనాలోని టూర్ ఆపరేటర్లు పర్వత ప్రాంతంలో ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రకృతి అద్భుత దృశ్యాలను కొండ ఎక్కి చూడలేని వాళ్లకి ఇదొక మంచి మార్గం. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు సునాయాసంగా కొండ అంచుకు చేరుకోగలుగుతారు. మరింకేం? అంతా బానే ఉంది కదా అంటే..

పర్వతారోహణకు అర్థం ఏది?

ఈ ఎస్కలేటర్లు పర్వతారోహణకు ఉన్న అర్థాన్ని పూర్తిగా పాడు చేస్తాయనేది విమర్శకుల వాదన. కాలి నడకన కష్టంతో కొండ శిఖరాన్ని చేరుకోవడంలో ఉండే సవాళ్లు, సంతృప్తి వేరు. ఇలా ఏ కష్టం లేకుండా పర్వతాలు ఎక్కితే దాని అనుభూతి పొందలేమంటున్నారు ప్రకృతి ప్రియులు. పర్యాటకులకు వచ్చే సంతృప్తికర అనుభవాన్నీ ఈ ఎస్కలేటర్లు పాడు చేస్తాయంటున్నారు. అంతే కాకుండా ఆ పర్వతానికి ఉన్న సహజ అందం కూడా ఈ ఎస్కలేటర్ ఏర్పాటు వల్ల పాడైపోయిందట. తిరుపతి కొండ కాలి నడకన ఎక్కడానికి, బస్సులో వెళ్లి దర్శనం చేసుకోడానికి తేడా ఉంది కదా? కష్టపడి చేసుకున్న దర్శనంలో వచ్చే సంతృప్తి వర్ణించలేనిది. ఇక్కడ విమర్శకుల వాదన కూడా అదే.

జెజియాంగ్ ప్రావిన్స్ లోని చునాన్ కౌంటీలోని తియాన్యు పర్వతంపై ఒక ఎస్కలేటర్ను ఏర్పాటు చేశారు. ఈ పర్వతం ట్రెక్కింగ్ ద్వారా ఎక్కడానికి 50 నిమిషాల దాకా సమయం పడుతుంది. కానీ ఈ ఎస్కలేటర్‌తో ఏ కష్టం లేకుండా ఉన్నచోటే నిలబడి పది నిమిషాల్లో అంచుదాకా చేరుకోవచ్చు. తర్వాత ఓ 3 కిలోమీటర్లు కాలి నడక ద్వారా ప్రయాణిస్తే సరిపోతుంది. ఈ నొప్పి లేని పర్వతారోహన ఆలోచన మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారు?

"ఇది వృద్ధులు, పిల్లలకు ఉత్తమం! కష్టపడి ఎక్కాల్సిన అవసరం లేదు. దీంతో నా బిడ్డ సంతోషంగా ఉంది, కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను" అని ఒక సోషల్ మీడియా యూజర్ కామెంట్ చేశారు. మరో వ్యక్తి "నేను మౌంటెన్ ఎస్కలేటర్ వాడటం కోసం ఆసక్తితో ఉన్నాను. ప్రతి ఒక్కరూ తమకు నచ్చింది ఎంచుకోవచ్చు. నేను ఎస్కలేటర్ మార్గాన్నే కొండ ఎక్కడానికి ఎంచుకుంటాను." అన్నారు. "మీరు నిజంగా పర్వతమే ఎక్కకపోతే పర్వతారోహణకు అర్థం ఏంటి? అని ఒక విమర్శకుడు ప్రశ్నించాడు."ఎస్కలేటర్లు పర్వత సహజ సౌందర్యాన్ని పాడుచేస్తాయి -మీరు దానిని చూడలేరా?" అని మరొక ప్రకృతి ప్రేమికుడు కామెంట్ చేశారు.

 

టాపిక్

తదుపరి వ్యాసం