తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Masala Powder: చికెన్ మసాలా పొడి ఇలా తయారు చేసుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది, రెసిపీ చాలా సులువు

Chicken Masala Powder: చికెన్ మసాలా పొడి ఇలా తయారు చేసుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది, రెసిపీ చాలా సులువు

Haritha Chappa HT Telugu

09 February 2024, 17:30 IST

google News
    • Chicken Masala Powder: చికెన్ కూరలో చికెన్ మసాలా వేస్తేనే రుచి పెరుగుతుంది. చికెన్ మసాలాను ఎక్కువగా బయట కొంటూ ఉంటాం. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
చికెన్ మసాలా పొడి
చికెన్ మసాలా పొడి (pixabay)

చికెన్ మసాలా పొడి

Chicken Masala Powder: చికెన్ వేపుడు, చికెన్ కూరలకు చికెన్ మసాలా పొడి దట్టిస్తేనే టేస్ట్ ఎక్కువగా వచ్చేది. దీన్ని ఎక్కువగా అందరూ బయటే కొంటూ ఉంటారు. దీన్ని బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేశారంటే ఏడాదంతా నిల్వ ఉంటుంది. దీని రెసిపీ చాలా సులువు. దీనిలో ఇంట్లో ఉండే ఉత్పత్తులే వినియోగిస్తాము. కాబట్టి 10 నిమిషాల్లో చికెన్ మసాలా పొడి రెడీ అయిపోతుంది. దీన్ని గాలి చొరబడిన కంటైనర్లలో పెట్టుకొని దాచుకుంటే ఆరు నెలల నుంచి ఏడాది వరకు తాజాగా ఉంటుంది. చికెన్ మసాలా రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

చికెన్ మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు

ధనియాలు - ఒక కప్పు

సోంపు గింజలు - రెండు స్పూన్లు

జీలకర్ర - రెండు స్పూన్లు

మిరియాలు - ఒక స్పూను

ఎండుమిర్చి - ఎనిమిది

కరివేపాకులు - అయిదు రెమ్మలు స

మెంతులు - ఒక స్పూను

ఉప్పు - ఒక స్పూను

చికెన్ మసాలా రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి కరివేపాకులను వేసి చిన్న మంట మీద వేయించాలి.

2. అవి క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి.

4. అదే కళాయిలో మెంతులు, ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, మిరియాలు కూడా వేసి వేయించాలి.

5. ఇవి వేగుతున్నప్పుడే మంచి సువాసన వస్తాయి.

6. వాటన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేయాలి.

7. ముందుగా వేయించుకున్న కరివేపాకులను కూడా వేసి ఉప్పు కలిపి మెత్తటి పొడిలా చేసుకోవాలి. అంటే చికెన్ మసాలా పొడి రెడీ అయినట్టే.

8. దీన్ని ఒక గాలి చొరబడని కంటైనర్లలో వేసి దాచుకోవాలి.

9. ఇది తాజాగా ఉంటుంది. మూత తీసి వదిలేస్తే ఆ వాసన అంతా బయటకు పోతుంది.

10. కాబట్టి కేవలం వాడినప్పుడు మాత్రమే మూత తీసి తర్వాత వెంటనే పెట్టేయాలి.

మసాలా పొడిని ఇంట్లోనే పరిశుభ్రంగా తయారు చేసుకోవచ్చు. బయట కొన్ని చికెన్ మసాలాలలో ఆర్టిఫిషియల్ రంగులు కలిపే అవకాశం ఉంది. అదే ఇంట్లోనే చేసుకుంటే ఎలాంటి కృత్రిమ రంగులు కలపరు. కాబట్టి ఇది మంచి ఆరోగ్యకరం. అంతేకాదు కూరల్లో ఇది కలిసి ఇగురు, మంచి రంగు ఇవ్వడంతో పాటు మంచి వాసనా, రుచిని కూడా అందిస్తుంది. ఒకసారి ఇంట్లోనే చికెన్ మసాలా పొడిని మేము చెప్పినట్టు తయారు చేసి చూడండి. బయట కొన్న చికెన్ మసాలాపొడికి, ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలాపొడికి తేడా మీకే తెలుస్తుంది.

ధనియాలు అధికంగా చికెన్ మసాలా పొడిలో ఉపయోగించాము, కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ధనియాలు వాడడం వల్ల దద్దుర్లు, దురదలు, గజ్జి వంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. జట్టు రాలడం వంటి సమస్య కూడా తగ్గుతుంది. ధనియాలు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం