Chettinad Aloo fry: బంగాళదుంప వేపుడు అంటే ఇష్టమా? చెట్టినాడ్ స్టైల్లో ఆలూ ఫ్రై చేసి చూడండి
28 November 2024, 15:30 IST
- Chettinad Aloo fry: బంగాళదుంప వేపుడుకు అభిమానులు ఎక్కువ. ఎప్పుడూ ఒకేలా కాకుండా చెట్టినాడ్ స్టైల్లో ఆలూ ఫ్రై చేయండి. మీకు ఎంతో నచ్చుతుంది.
చెట్టినాడ్ ఆలూ వేపుడు
బంగాళదుంప వేపుడు లేదా ఆలూ ఫ్రై... ఇది ఎంతో మందికి ఇష్టమైన వంటకం. సాంబార్ తో పాటు సైడ్ డిష్‌గా ఆలూ ఫ్రై ఉండాల్సిందే. పప్పన్నం, పెరుగన్నం దేనితో తిన్నా కూడా ఆలూ ఫ్రై అదిరిపోతుంది. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా చెట్టినాడ్ స్టైల్లో చేసి చూడండి. దీని రెసిపీ మీకు ఎంతో నచ్చుతుంది. ఇది పిల్లలకు బాగా నచ్చే రెసిపీ. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు వెజిటేరియన్ పదార్థాలు పెట్టాల్సి వస్తే కచ్చితంగా చెట్టినాడ్ ఆలూ ఫ్రై పెట్టి చూడండి. ఇది ఎవరికైనా బాగా నచ్చేస్తుంది.
చెట్టినాడ్ ఆలూ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బంగాళదుంపలు - అరకిలో
కరివేపాకులు - గుప్పెడు
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
నూనె - తగినంత
ఎండుమిర్చి - ఆరు
మరాఠీ మొగ్గ - ఒకటి
అనాస పువ్వు - ఒకటి
లవంగాలు - ఐదు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
మినప్పప్పు - ఒక స్పూను
శెనగపప్పు - ఒక స్పూన్
ధనియాలు - రెండు స్పూన్లు
సోంపు - ఒక స్పూను
చెట్టినాడ్ ఆలూ ఫ్రై రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, శెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.
2. కాసేపటికి సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు, మరాఠీ మొగ్గ, ఎండుమిర్చి కూడా వేయించి వాటిని మిక్సీలో వేసి పొడిచేసుకుని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే కళాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
4. తర్వాత గుప్పెడు కరివేపాకులను వేసుకోవాలి.
5. అలాగే పసుపును కూడా వేసి వేయించుకోవాలి.
6. ముందుగానే బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మీడియం సైజు ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు పసుపు వేసిన నూనెలో బంగాళదుంప ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
8. పైన మూత పెట్టి చిన్న మంట మీద 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
9. ఆ తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి.
10. ఉప్పు బాగా కలిసాక ముందుగా మసాలా చేసి పెట్టుకున్న పొడిని వేసి అన్ని ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి.
11. తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి.
12. అంతే ఆటూ చెట్టినాడ్ ఫ్రై రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎవరికైనా నచ్చేస్తుంది.
బంగాళదుంప వేపుడు ఎలా చేసినా రుచిగానే ఉంటుంది. చెట్టి నాడ్ స్టైల్ లో చేస్తే ఆ రుచి రెండింతలు అవుతుంది. అయితే బంగాళదుంపలను మరీ మెత్తగా ఉడికిస్తే ముక్కలు ముక్కలుగా వేపుడు రాదు. ముద్దయిపోయే అవకాశం ఉంది. కాబట్టి బంగాళదుంపలను 80 శాతం ఉడికించండి. మిగతా 20 శాతం కళాయిలో వేయించేటప్పుడు ఉడికిపోతాయి. అప్పుడు ముక్కలుగా వేపుడు వస్తుంది. ముక్కలు మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోండి. అలా అయితేనే చెట్టినాడ్ ఆలూ ఫ్రై రుచి తెలుస్తుంది.