Cheese Stuffed Capsicum: పిల్లల కోసం చీజ్ స్టఫ్డ్ క్యాప్సికం రెసిపీ, దీన్ని చూస్తేనే కొరికి తినేయాలనిపిస్తుంది
18 April 2024, 17:30 IST
- Cheese Stuffed Capsicum: క్యాప్సికం తినే వారి సంఖ్య తక్కువే. ఓసారి చీజ్ స్టఫ్డ్ క్యాప్సికం రెసిపీ ట్రై చేయండి. చూస్తేనే నోరూరి పోతుంది. వెంటనే తినేయాలనిపిస్తుంది.
చీజ్ స్టఫ్డ్ క్యాప్సికం రెసిపీ
Cheese Stuffed Capsicum: క్యాప్సికంతో చేసిన వంటకాలను ఇష్టపడే వారి సంఖ్య చాలా తక్కువ. ఆరోగ్యం కోసం తప్ప క్యాప్సికంను ఇష్టంగా తినేవారు ఎవరూ ఉండరు. ఇక్కడ మేము చీజ్ స్టఫ్డ్ కాప్సికం రెసిపీ ఇచ్చాము. దీన్ని చూస్తుంటే నోరూరిపోతుంది. ఎవరికైనా కూడా దీన్ని తినాలనిపిస్తుంది. ఇది చేయడం చాలా సులువు. ముఖ్యంగా పిల్లలకు ఇది నచ్చుతుంది.
చీజ్ స్టఫ్డ్ క్యాప్సికం రెసిపీకి కావలసిన పదార్థాలు
క్యాప్సికం - రెండు
పనీర్ తురుము - అరకప్పు
జీలకర్ర పొడి - ఒక స్పూను
ఉల్లిపాయ - ఒకటి
ఉడకబెట్టిన బంగాళదుంపలు - రెండు
మోజారెల్లా చీజ్ తురుము - అరకప్పు
నూనె - అర స్పూను
కారం పొడి - ఒక స్పూను
పావ్ బాజీ మసాలా - ఒక స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
పచ్చిమిర్చి - రెండు
మిరియాల పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
చీజ్ స్టఫ్డ్ క్యాప్సికం రెసిపీ
1. ఓవెన్ ముందుగానే ప్రీ హీట్ చేసుకుని పెట్టుకోవాలి.
2. క్యాప్సికంను మధ్యలోకి రెండు ముక్కలు చేయాలి. రెండువైపులా ఉన్న గింజలను తీసేయాలి. అప్పుడు అవి చిన్న కప్పుల్లాగా అవుతాయి. వాటిని పక్కన పెట్టుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉడకబెట్టిన బంగాళదుంపలు తురుము, పనీర్ తురుము, కారం, గరం మసాలా, మిరియాలు పొడి, ఉప్పు, పావ్ బాజీ మసాలా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని ఐదు నుంచి ఏడు నిమిషాలు వేయించుకోవాలి.
6. అవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ను కట్టేయాలి.
7. ఇప్పుడు క్యాప్సికంలో ఈ మిశ్రమాన్ని వాటిలో స్టఫ్ చేయాలి.
8. స్టఫ్ చేశాక పైన మోజారెల్లా చీజ్ తురుమును పూర్తిగా చల్లుకోవాలి.
9. బేకింగ్ ట్రేలో వీటిని పెట్టి 20 నిమిషాలు బేక్ చేయాలి. అంతే చీజ్ స్టఫ్డ్ క్యాప్సికం రెడీ అయినట్టే. పైన ఒరేగానో లేదా చిల్లి ఫ్లాక్స్ జల్లుకొని తింటే ఆ రుచే వేరు.
పిల్లలకు, యువతకు ఇది నచ్చే రెసిపీ. క్యాప్సికం తో కలిపి ఈ చీజ్ రెసిపీ తింటూ ఉంటే రుచి అదిరిపోతుంది. వీటిని చేయడం చాలా సులువు. ఓవెన్ ఉంటే చాలు ఒక్కసారి చేసుకున్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
టాపిక్