Capsicum Masala Rice: క్యాప్సికం మసాలా రైస్ ఇలా చేసి పెట్టండి, పిల్లలకు కచ్చితంగా నచ్చుతుంది
Capsicum Masala Rice: కొందరు పిల్లలు క్యాప్సికం తినడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లల చేత క్యాప్సికం తినిపించాలంటే ఇలా క్యాప్సికం మసాలా రైస్ రెసిపీ ప్రయత్నించండి.
Capsicum Masala Rice: క్యాప్సికంను ఇష్టపడే వారి సంఖ్య చాలా తక్కువ. దాంతో కూర చేసినా, ఫ్రై చేసినా... తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారి కోసమే క్యాప్సికం మసాలా రైస్. దీన్ని చేస్తే క్యాప్సికం తినని వారు కూడా ఇష్టంగా తినడం మొదలుపెడతారు. దీన్ని అరగంటలో చేసేయొచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒక్కసారి దీన్ని చేసి చూడండి. వారంలో కనీసం ఒక్కసారైనా చేసుకోవడం అలవాటుగా చేసుకుంటారు.
క్యాప్సికం మసాలా రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
క్యాప్సికం - రెండు
వండిన అన్నం - మూడు కప్పులు
ఆవాలు - ఒక స్పూను
నెయ్యి - రెండు స్పూన్లు
కొబ్బరి తురుము - ఒక స్పూను
ఎండుమిర్చి - మూడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
జీలకర్ర - అర స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ధనియాలు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
వేరుశెనగ పలుకులు - రెండు స్పూన్లు
మసాలా రైస్ రెసిపీ
1. ముందుగానే అన్నాన్ని వండుకొని పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి.
2. ఆ అన్నంలో ఒక స్పూన్ నెయ్యిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేయండి.
4. నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడించండి.
5. తర్వాత మినప్పప్పును కూడా వేయండి. అలాగే ధనియాలు, వేరుశెనగ పలుకులు, దాల్చిన చెక్క వేసి వేయించండి.
6. ఇప్పుడు ఇవన్నీ బ్లెండర్లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి.
7. మసాలా పొడి రెడీ అయినట్టే.
8. ఇప్పుడు అదే పాత్రలో కాస్త నూనె వేసి క్యాప్సికంను సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. వాటిని అతిగా ఉడికించకూడదు.
9. క్యాప్సికం ముక్కలు కాస్త పచ్చిగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి.
10. ఇప్పుడు తురిమిన కొబ్బరి, ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసి ఒక అరగంట వేయించుకోండి.
11. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని అందులో వేసి పులిహోర కలుపుకున్నట్టు బాగా కలుపుకోండి.
12. స్టవ్ కట్టేసి పైన కొత్తిమీర తరుగు చల్లుకోండి. అంతే క్యాప్సికం మసాలా రైస్ రెడీ అయినట్టే.
13. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పవచ్చు. పిల్లలు, పెద్దలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.
క్యాప్సికంలు మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. వారానికి ఒక్కసారైనా క్యాప్సికంలు తినడం చాలా అవసరం, కానీ చాలా తక్కువ మంది వీటిని ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. చైనీస్ మసాలా నూడిల్స్, చైనీస్ వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు మాత్రమే కాస్త పైన చల్లుకొని తింటున్నారు. వాటిని అప్పుడు కూడా ఏరి పక్కన పెట్టేస్తున్నారు. నిజానికి క్యాప్సికంలు తినడం చాలా అవసరం.
క్యాప్సికంలలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల అదనపు కొవ్వు కరుగుతుంది. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. ఇవి ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తాయి. దీనివల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఎక్కువ. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవడంలో కూడా క్యాప్సికం ముందుంటుంది.
టాపిక్