Chanakya Niti Telugu। ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తేముందు.. ఈ సంకేతాలు కనిపిస్తాయి!
04 August 2023, 7:07 IST
- Chanakya Niti Telugu: ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తేముందు ముందు కొన్ని సూచికల ద్వారా గ్రహించవచ్చునని చాణక్యుడు అభిప్రాయపడ్డాడు. చాణక్యుడు ప్రకారం, ఆ సంకేతాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.
Chanakya Niti Telugu
Chanakya Niti Telugu: ఆచార్య చాణక్యుడు భారతీయ పురాతన తత్వవేత్త, ఎన్నో విషయాల్లో ప్రావీణ్యం సాధించి అపర మేధావిగా పేరుగాంచాడు. ఈయన రచించిన ప్రసిద్ధ గ్రంథం 'చాణక్య నీతిశాస్త్రం' కాలాతీతంగా నిలిచిన నిజ జీవిత పాఠాల సమాహారం. ఆయన బోధనలు నేటికీ ప్రతీ వ్యక్తి వర్తిస్తాయి, చాణక్య నీతి సూత్రాలు వ్యక్తులకు మంచి మార్గనిర్ధేశనం చేస్తాయి, వారిని కష్టాల నుంచి గట్టెక్కడంలో సహాయపడతాయి. చాణక్యుడు ఒక గొప్ప ఆర్థిక నిపుణుడు కూడా. జీవితంలో ఆర్థిక సంక్షోభాలు ఎందుకు తలెత్తుతాయో చాలా రకాలుగా వివరించారు. ఇవి కాకుండా, ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తేముందు ముందు కొన్ని సూచికల ద్వారా గ్రహించవచ్చునని చాణక్యుడు అభిప్రాయపడ్డాడు. చాణక్యుడు ప్రకారం, ఆ సంకేతాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి మొక్క ఎండిపోవడం
హిందూ మతం ప్రకారం, తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి మొక్కను దేవతగా కొలుస్తూ నిత్యం పూజిస్తారు. అయితే ఇంటిలోని తులసి మొక్క తగిన సంరక్షణ తర్వాత కూడా ఎండిపోతే, అది రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతం అని చాణక్యుడు నమ్మాడు.
అద్దం పగిలిపోవడం
చాణక్యుడు ప్రకారం, ఏ ఇంట్లో అయితే పదేపదే అద్దం పగులుతుందో అది దారిద్య్రాన్ని సూచిస్తుంది. రాబోయే ఆర్థిక నష్టానికి సూచన కావచ్చు. సంపద కోల్పోయి పేదవారిగా మారవచ్చు.
ఇంట్లో నిరంతరం గొడవలు
ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఏ ఇంట్లో అయితే నిరంతరం గొడవలు జరుగుతుంటాయో, ఇంటి సభ్యుల మధ్య తరచూ విభేదాలు తలెత్తుతుంటే, అది రాబోయే ఆర్థిక సంక్షోభానికి సూచన కావచ్చు. గ్రహ దోషం లేదా వాస్తు దోషం వంటి సమస్యలు కూడా దీనికి కారణమని చాణక్యుడు నమ్మాడు.
ఇంట్లో పూజలు లేకపోవడం
పూజలు చేయని ఇంట్లో సుఖం లేదా శ్రేయస్సు ఉండదని చాణక్యుడు నమ్మాడు. పూజలు చేయకపోవడం అశుభం. ఆ ఇల్లు ఆర్థిక సమస్యలకు నిలయం అని చాణక్యుడు పేర్కొన్నారు.
పెద్దలను అగౌరవపరచడం
పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ఒక ప్రాథమిక అంశం. ఏ ఇంట్లో అయితే పెద్దలు పదేపదే అవమానాలకు గురవుతారో, అగౌరవపడతారో ఆ ఇల్లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. రాబోయే ఆర్థిక సంక్షోభానికి అదొక సంకేతమని చాణక్యుడు నమ్మాడు. పెద్దల పట్ల అగౌరవంగా ప్రవర్తించే వారు, జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేరని అన్నారు.
ముగింపు మాట:
రాబోయే ఆర్థిక సంక్షోభాలకు పైన పేర్కొన్న అంశాలు సూచికలు కావొచ్చేమో గానీ, అవే కచ్చితమైన కారణాలు కాదని చాణక్యుడు తెలిపాడు. ఏదైనా ఆర్థిక సంక్షోభం ఏర్పడితే దాని ప్రభావాలను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి పైన పేర్కొన్న అంశాలను సూచికగా భావించి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని చాణక్య నీతి చెబుతోంది.