తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakaya Niti Telugu | మీ జీవితంలో ఈ ముగ్గురూ ఉంటే మీ అంత అదృష్టవంతులే లేరు!

Chanakaya Niti Telugu | మీ జీవితంలో ఈ ముగ్గురూ ఉంటే మీ అంత అదృష్టవంతులే లేరు!

HT Telugu Desk HT Telugu

30 July 2023, 7:07 IST

google News
    •  Chanakaya Niti Telugu: చాణక్యుడి ప్రకారం, జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా మన వద్ద ఓ ముగ్గురు వ్యక్తులు ఉంటే దేన్నైనా జయించవచ్చు. ఆ ముగ్గురు ఎవరో ఇక్కడ తెలుసుకోండి.
Chanakaya Niti Telugu
Chanakaya Niti Telugu (Unsplash)

Chanakaya Niti Telugu

Chanakaya Niti Telugu: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవిత పురోగమనానికి సంబంధించిన అనేక ఆలోచనలను వ్యక్తపరిచాడు. చాణక్యుడి ప్రకారం, ఆనందం, విచారం అనే రెండు జీవితంలో ముఖ్యమైన భాగాలు. ఆనందాన్ని పంచుకోవడం వల్ల ఆ ఆనందం మరింత పెరుగుతుంది, బాధను పంచుకోవడం ఆ బాధను మరింత తగ్గిస్తుందని చాణక్యుడు చెప్పాడు. సంతోషకరమైన జీవితానికి ఆయన తన నీతిశాస్త్రంలో అనేక సూత్రాలను ఇచ్చాడు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, జీవితంలో ఎలా ముందుకు సాగాలి అనే దానిపై చాణక్యుడు తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

చాణక్యుడి ప్రకారం, జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా మన వద్ద ఓ ముగ్గురు వ్యక్తులు ఉంటే దేన్నైనా జయించవచ్చు. వారే మనకు కొండంత ధైర్యాన్నిస్తారు, కష్టకాలంలో మనకు అండగా నిలుస్తారు. ఆ ముగ్గురిని జీవితంలో ఎప్పుడూ దూరంగా నెట్టకూడదు, వారిని వదులుకోకూడదు. మరి ఆ ముగ్గురు ఎవరో చూద్దాం.

సంస్కారవంతమైన భార్య

భార్య సంస్కారవంతురాలు, సున్నిత స్వభావి, తెలివైనది అయితే, అలాంటి భార్య దొరికిన భర్త చాలా అదృష్టవంతుడు. జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా, అలాంటి భార్యలు భర్తలకు తోడునీడలా నిలుస్తారు. అంతే కాదు, భర్తకు ఎదురయ్యే ప్రతి క్లిష్ట క్షణాన్ని దృఢ సంకల్పంతో ఎదుర్కొనేందుకు ధైర్యాన్నిస్తారు, ఆ పరిస్థితులతో పోరాడే ప్రేరణ కలిగిస్తారు. సంక్షోభ సమయాల్లో, ఆమె కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. సున్నిత మనస్కురాలైన భార్య ఉండటం నిజంగా పురుషుని అదృష్టమని చాణక్యుడు నొక్కి చెప్పాడు.

అండగా నిలబడే కొడుకు

పిల్లలు తల్లిదండ్రులకు అండగా నిలవాలి. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆశిస్తారు. కొడుకు అనేవాడు ఎప్పుడూ తన పేరును, తన కుటుంబం ప్రతిష్టను సమాజంలో ప్రకాశింపజేయాలి. కూతురు పెళ్లి తర్వాత మరొక కుటుంబానికి అండగా నిలుస్తుంది, కాబట్టి తన కుటుంబాన్ని చూసుకునే బాధ్యత కొడుకుకే ఉంటుంది. ఇంటికి ఒక కొడుకు ఉంటే, కష్టకాలంలో ఎదురొడ్డి నిలబడితే అలాంటి కొడుకు కలిగిన వ్యక్తి అదృష్టవంతుడు. అలాంటి కొడుకు ఉన్నవారు ఎప్పటికీ దుఃఖించాల్సిన అవసరం లేదు. పిల్లలకు మొదటి నుంచి సరైన మార్గనిర్దేశం చేస్తే, వారు వృద్ధాప్యంలో తల్లిదండ్రుల శక్తిగా ఉంటారని చాణక్యుడు చెప్పాడు. పిల్లల్లో చెడు అలవాట్లు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపాడు.

మంచి స్నేహితుడు

ఒక వ్యక్తి జీవితాన్ని అతడి స్నేహ బంధం కూడా నిర్ణయిస్తుంది. వ్యక్తి దశను దిశను ఒక మంచి స్నేహితుడు సరైన మార్గాన్ని అందిస్తాడు. మీరు జీవితంలో మంచి వ్యక్తుల సాంగత్యాన్ని పొందినట్లయితే, మీరు చాలా పురోగతిని సాధించగలరు, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు మార్గంలో వెళ్ళనివ్వరు. వారు నిస్వార్థంగా మీ క్షేమం కోరుకుంటారు. అటువంటి స్నేహితుల సహవాసాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. మంచి స్నేహితుడు తన స్నేహితుడి ఎప్పుడు ఆపద వచ్చినా, నేనున్నానని అండగా నిలుస్తాడు. అలాంటి స్నేహితుడ్ని కలిగిన వ్యక్తి చాలా అదృష్టవంతుడని చాణక్యుడు చెప్పాడు.

చాణక్యుడు చెప్పిన ప్రకారం, పైన పేర్కొన్న ముగ్గురు మీ జీవితంలో ఉంటే, మీరు అదృష్టవంతులే. వారిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. వారే మిమ్మల్ని ప్రగతిపథంలో నడిపించగలరని చాణక్య నీతి చెబుతుంది.

తదుపరి వ్యాసం