Brahma Muhurtham | ఉదయం ఏ సమయంలో నిద్రలేస్తే మంచిది? బ్రహ్మముహూర్తం అంటే అదే!
27 June 2022, 6:34 IST
- ఉదయాన్నే నిద్రలేవాలి అని పెద్దలు చెప్తారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలని పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి? ఇంతకీ అసలు ఎప్పుడు లేస్తే మంచిది? బ్రహ్మముహూర్తం ఎప్పుడు? ఇలాంటి విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
Best time to wake up
ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే రోజూ పొద్దున్నే లేవాలని చెప్తారు. చెప్పడమే కాదు వారు ఆచరిస్తారు కూడా. అందరికన్నా ముందుగానే లేచి వారి కార్యకలాపాలను ప్రారంభింస్తారు. కొన్ని నియమాలను పాటిస్తున్నారు కాబట్టే వారు ఇప్పటితరం వారికంటే దృఢంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు.
మరి పొద్దున అంటే ఏ సమయంలో లేవాలి? మేల్కొలనడానికి ఉత్తమమై సమయం అంటూ ఏదైనా ఉందా? అంటే పురాతన కాలంలో హిందూ పవిత్ర గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలనాలని ఉంది. ఎప్పుడు లేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఆయుర్వేద శాస్త్రంలో వివరంగా ఉంది. మన పెద్దవాళ్లు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడం మంచిది అని చెప్తారు. విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా చదివితే వారికి ఎలాంటి క్లిష్టమైన విషయం అయినా సులభంగా అర్థం అవుతుంది. ఎక్కువకాలం గుర్తుంచుకుంటారు అని గురువులు తరచూ సూచిస్తారు.
సూర్యోదయం కంటే ముందు లేదా సూర్యుడు ఉదయించేటపుడు మేల్కొంటే త్వరగా కార్యకలాపాలను పూర్తిచేసుకోవచ్చు. ఎక్కువ పగటి సమయాన్ని కలిగి ఉంటారు. దీంతో మరింత శక్తివంతంగా పనిచేయవచ్చు. రోజంతా చురుకుగా ఉంటారు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఆయుర్వేద నిపుణురాలు డా. దీక్ష భావ్‌సర్ ఉదయాన్నే ఎప్పుడు లేవాలనే దానిపై వివరణ ఇచ్చారు. బ్రహ్మ ముహూర్తంపైనా చర్చించారు.
బ్రహ్మముహూర్తం ఎప్పుడు?
బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభమై 48 నిమిషాలలో ముగుస్తుంది. ఈ 48 నిమిషాల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని చెప్పవచ్చు. ఈ సమయంలో నిద్రలేచి కొన్ని కార్యకలాపాలు చేస్తే ప్రభావవంతంగా ఉంటుందని డా. దీక్ష తెలిపారు.
జ్ఞానాన్ని పొందడానికి (ధ్యానం, ఆత్మపరిశీలన)
జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి (విద్యార్థులకు)
మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి (పర్యావరణం ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది కాబట్టి)
పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి (మీ మానసిక దృష్టి పెరుగుతుంది, ఏకాగ్రతను బలోపేతం అవుతుంది)
ధ్యానం చేయడానికి, పుస్తకాలు చదవడానికి, వ్యాయామం చేయడానికి బ్రహ్మ ముహూర్తం అత్యుత్తమమైన సమయం అని డాక్టర్ దీక్ష తెలిపారు. ఈ ముహూర్తంలో మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మీ జీవితంపై మీకు స్పష్టత లభిస్తుంది. విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారు, మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు లోపలి నుంచి దృఢంగా తయారవుతారు. మీలో ఉత్పాదకత పెరుగుతుంది.
ఎప్పుడు మేల్కోవాలి?
బ్రహ్మ ముహూర్తం ప్రారంభమైన నుంచి సూర్యోదయం అయ్యేలోపు ఏ సమయంలోనైనా మేల్కొనడం ఉత్తమం. ఇలా ఇంద్రియాలకు తాజాదనాన్ని కలిగించే ప్రేమ (సాత్విక) గుణాలు ప్రకృతి ద్వారా మీకు అందుతుంది, ఇది మనశ్శాంతిని చేకూరుస్తుంది. ఒకవేళ ఈ ముహూర్తంలో లేవలేని పక్షంలో సూర్యోదయంతో పాటే నిద్రలేచేలా చూసుకోండి, సూర్యోదయం తర్వాత లేవడం సరికాదు అని చెబుతున్నారు. కాబట్టి గడియారంలో అలారం కాకుండా సహజంగానే నిద్రలేచి పనులు చేసుకునే ప్రణాళికను రూపొందించుకోవాలి. ఎందుకంటే సూర్యోదయం అన్ని రుతువుల్లో ఒకే సమయంలో ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రకృతితో మనస్సును, శరీరాన్ని అనుసంధానం చేయాలని సిఫారసు చేస్తున్నారు.