Grapes Halwa: నల్ల ద్రాక్షలతో టేస్టీ హల్వా ఇలా చేస్తే నోరూరిపోతుంది
25 May 2024, 15:45 IST
- Grapes Halwa: నల్ల ద్రాక్షలతో ఒకసారి హల్వా చేసి చూడండి. తింటున్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు.
నల్ల ద్రాక్షతో హల్వా
Grapes Halwa: ద్రాక్ష పండ్లు మార్కెట్లో విరివిగా దొరుకుతూనే ఉంటాయి. వాటిలో నల్ల ద్రాక్ష పండ్లను ఈ హల్వా కోసం ఎంచుకోండి. దీనివల్ల హల్వా రంగు కూడా ముదురు రంగులో వస్తుంది. చూడగానే తినాలనిపించేలా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు కూడా నల్ల ద్రాక్ష హల్వా నచ్చడం ఖాయం. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం దీనికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే దీనిలో పంచదార, మైదా అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా వారికి హాని చేసేవే కాబట్టి పిల్లలకే ఈ నల్ల ద్రాక్షతో చేసే హల్వా నచ్చుతుంది.
ద్రాక్ష హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
నల్ల ద్రాక్ష పండ్లు - 100 గ్రాములు
బాదం పప్పులు - గుప్పెడు
జీడిపప్పులు - గుప్పెడు
పంచదార - పావు కిలో
మైదా - పావు కిలో
నల్ల ద్రాక్ష హల్వా రెసిపీ
1. ఒక గిన్నెలో మైదా పిండిని వేసుకోవాలి.
2. అందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ దాన్ని పూరీ పిండి లాగా మెత్తగా ముద్దలా కలుపుకోవాలి.
3. తర్వాత మరో మూడు కప్పుల నీళ్లను పోసి అది పలచగా అయ్యేలా కలుపుకోవాలి. ఇది పాలుని గుర్తు తెచ్చేలా పల్చగా అవుతుంది. ఆ తర్వాత పక్కన పెట్టేయాలి.
4. ఒక అరగంట తర్వాత చూస్తే మైదాలో కాస్త నీళ్లు పైకి తేలినట్టు ఉంటాయి.
5. ఆ తేలిన నీటిని వంపేయాలి. అడుగున ఉన్న తేటని మాత్రం తీసుకోవాలి.
6. ఇప్పుడు నల్ల ద్రాక్షలను గింజలు తీసేసి మిగతా మిశ్రమం మిగతా వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
7. ఆ మొత్తం ద్రాక్ష మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పంచదార, నీళ్లు వేసి పాకం తీసుకోవాలి.
9. తీగపాకం వచ్చాక మైదా మిశ్రమాన్ని, ద్రాక్ష మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
10. చిన్న మంట మీద మాడిపోకుండా కలుపుకోవాలి. ఇది గట్టిగా దగ్గరగా అయ్యేవరకు అలా కలుపుతూనే ఉండాలి.
11. ఇప్పుడు నెయ్యిని వేసి బాగా కలపాలి.
12. మరొక పక్కా చిన్న కళాయి పెట్టి అందులోని నెయ్యి వేసి జీడిపప్పులు, బాదం పప్పులు తరుగును వేసి వేయించుకోవాలి.
13. ఆ మిశ్రమాన్ని కూడా ఈ హల్వాలో వేసి బాగా కలుపుకోవాలి.
14. హల్వా దగ్గరగా ముద్దలా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
15. అంతే టేస్టీ నల్ల ద్రాక్ష హల్వా రెడీ అయినట్టే.
16. దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లార్చి ముక్కలు కోసుకోవాలి. ఇది హల్వా సాగుతున్నట్టుగా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. మాడుగుల హల్వాను గుర్తుచేస్తుంది.
హల్వాను ఇష్టపడేవారు ఇలా ఇంట్లోనే సులువుగా హల్వాను తయారు చేసుకోవచ్చు. అయితే ద్రాక్ష పండు హల్వాలో మైదా వినియోగించాము. కాబట్టి అతి తక్కువగా తింటేనే మంచిది. ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి చేసుకుని తింటే పరవాలేదు. కానీ ప్రతిరోజూ మైదా ఉన్న ఆహారాన్ని తినడం మంచిది కాదు.
టాపిక్