తెలుగు న్యూస్  /  Lifestyle  /  Bitter Foods - Not Only Salt & Pepper Add Some Bitter Too

Bitter Foods | ఉప్పు, కారాలే కాదు మీ ఆహారంలో చేదును చేర్చండి, ఆరోగ్యానికి మంచిది

HT Telugu Desk HT Telugu

30 June 2022, 16:16 IST

    • మీ ఆహారంలో రుచికోసం ఉప్పు, కారాలే కాదు అప్పుడప్పుడు కొంచెం చేదు రుచిని కూడా జోడించండి. ముఖ్యంగా వర్షాకాలంలో చేదు రుచి కలిగిన ఆహారాలు తింటే ఎంతో మంచిది.
Bitter Foods
Bitter Foods (Unsplash)

Bitter Foods

మనం రోజూ అనేక రకాల రుచులను ఆస్వాదిస్తాం. అయితే మన ఆహారంలో ఎక్కువగా ఉప్పు, కారాలే ఉంటాయి. అప్పుడప్పుడు పులుపు, అలాగే తీపి కలిగిన పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. కానీ చేదు ఆహారాలకు మాత్రం దూరంగా ఉంటాం. నిజానికి మనం తినే ఆహారంలో ఉప్పు, తీపిలకు ఎంత ప్రాముఖ్యత ఉందో చేదుకు కూడా అంతే సమానమైన ప్రాముఖ్యత ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇప్పుడు వాతావరణం మారుతోంది. వర్షాకాలం ప్రారంభమైంది, ఈ సమయంలో నీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. అనేక సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. మరోవైపు తేమ వాతావరణంతో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి సందర్భంలో చేదు రుచికలిగిన ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం ద్వారా అవి శరీరంలోని విష పదార్థాలను బయటకు తొలగించడమే కాకుండా మన రోగనిరోధక శక్తిని బలపరిచి, మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

మరి ఈ మాన్‌సూన్ సీజన్‌లో కొంచెం చేదును కూడా ఎందుకు రుచి చూడకూడదు? ఇది మీ కడుపును శుభ్రపరుస్తుంది. వర్షాకాలం సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం మీ ఆహారంలో ఏమేం చేర్చుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

కాకరకాయ

కాకరకాయలు మనకు అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన వెజిటెబుల్. దీనిని కొంతమంది ఇష్టంగా తింటే, చాలామంది చేదు అని దూరం పెట్టేస్తారు. కానీ కాకరకాయ తింటే అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలుగుతాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాకరకాయ తింటే అది శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించి, శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా నివారిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

ఆవాలు

వర్షాకాలంలో తప్పనిసరిగా ఆవాలు మన వంటకాల్లో వేసుకోవాలి. వంటల్లో ఆవనూనెను వాడాలి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి, జీవక్రియను ప్రోత్సహిస్తాయి. డయాసిల్‌గ్లిసరాల్ అనే పోషకం ఆవాలలో లభిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కాపర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి అలాగే పోస్ట్ మెనోపాజ్ సమస్యల నుండి రక్షించగలవు. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకుతాయి. ఆవాలలోని పోషకాలు శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందించగలవు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించగవు.

వేప

వేపను ఆయుర్వేదంలో ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. వేప ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. వర్షాకాలంలో మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 10-12 శుభ్రమైన వేప ఆకులను నమలండి. ఎలాంటి వ్యాధులు మీ దరిచేరవు. రక్తహీనతను కూడా వేప ఆకులు సరి చేస్తాయి. అనేక చర్మ సమస్యలు నయమవుతాయి. మీ చర్మం కూడా మెరుస్తుంది. మీరు ఆరోగ్యంగా తయారవుతారు.

పసుపు

భారతీయ వంటగదిలో పసుపును దాదాపు అన్ని కూరల్లో ఉపయోగిస్తారు. అయితే తాజాగా లభించే పచ్చిపసుపుతో మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయి. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ప్రబలే జలుబు, దగ్గుతో పాటు అనేక సీజనల్ వ్యాధుల నుంచి మీకు రక్షణ కవచంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుంది.

మెంతులు- జీలకర్ర

మెంతులను కూడా మన వంటల్లో వాడతాం. వర్షాకాలంలో మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే మీ ఆహారంలో మెంతులు, జీలకర్రను సరిపడినంతా వేసుకోండి.

టాపిక్