తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Plants: ఈ శీతాకాలపు పూల మొక్కల్ని పెంచుకుంటున్నారా? లేదా?

Winter Plants: ఈ శీతాకాలపు పూల మొక్కల్ని పెంచుకుంటున్నారా? లేదా?

17 December 2023, 17:30 IST

google News
  • Winter Plants: చలికాలంలో సులభంగా పెరిగి, గార్డెన్‌కి అందాన్ని తీసుకొచ్చే మొక్కలు కొన్నున్నాయి. అవేంటో, వాటి వివరాలేంటో పూర్తిగా తెలుసుకోండి.

శీతాకాలపు మొక్కలు
శీతాకాలపు మొక్కలు (pickpik)

శీతాకాలపు మొక్కలు

శీతాకాలపు చలిలో చక్కగా పెరిగే పూల మొక్కలు కొన్ని ఉంటాయి. మొక్కలు పెంచుకోవడంపై ఆసక్తి ఉన్న వారు ఎవరైనా సరే.. అలాంటి మొక్కల్ని పెంచుకోవడం తప్పనిసరి. ఇవి మీ తోటకు కొత్త రంగుల్ని జోడిస్తాయి. అందాన్ని ఇనుమడింప చేయడంతోపాటు కొన్ని చీడ పీడలనూ దరి చేరనీయకుండా చూస్తాయి. ఆ మొక్కలేంటో తెలుసుకుందాం రండి.

బంతి:

శీతాకాలపు మొక్కలనగానే ముందుగా గుర్తొచ్చేవి బంతి మొక్కలు. రకరకాల రంగుల్లో ఉండే, రేఖల్లో ఉండే వీటిని తప్పకుండా ఈ కాలంలో తోటలో పెంచుకోవచ్చు. కుండీల్లో అయినా సరే ఇవి చక్కగా పెరుగుతాయి. వీటిని పొడవుగా ఎదగకుండా చూసుకోవాలి. ఎదిగే క్రమంలో ముందుగానే తలను తెంపేస్తే పక్కనుంచి రెమ్మలు వస్తాయి. ఎక్కువ పూలు పూస్తాయి. కూరగాయల మొక్కల మధ్యలో, పంట పొలాల్లోనూ వీటిని నాడటం వల్ల రసం పీల్చే పురుగులు, దోమల్లాంటి వాటిని ఇవి దరి చేరనీయవు. అందువల్ల మిగిలిన మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి.

చామంతి:

గుత్తులు గుత్తులుగా పూలు విరబూసి చేమంతి పూలు ఉన్న చోటికే అందాన్ని తీసుకొస్తాయి. వీటిలో సుమారు 30 జాతుల మొక్కలున్నాయి. ఇవి ముఖ్యంగా ఆసియా ఖండానికి సంబంధించిన మొక్కలే. మట్టి బలం బాగా ఉంటే ఒక్కో చామంతి మొక్క నుంచి దాదాపుగా 70 నుంచి 120 వరకు పూలు పూస్తాయి. ఇవి వంగిపోకుండా ఉండేలా కర్రతో ఊతం ఇవ్వడం మంచిది. అందువల్ల మట్టిలో పడి కుళ్లిపోకుండా ఉంటాయి. పూలు కూడా ఎక్కువగా పూసేందుకు ఆస్కారం ఉంటుంది.

పిటూనియా:

మొక్క నిండా పూలు విరగబూసే మొక్కల్లో పిటూనియా ఒకటి. ఇవి ఎక్కువగా వేలాడే బాస్కెట్లలో పెంచుకుంటే బాగుంటుంది. వీటి విత్తనాలను మొలకెత్తించి నారు వచ్చిన తర్వాత ఒక కుండీ లోనే ఐదు నుంచి పది వరకు మొక్కల్ని నాటుకోవచ్చు. ఇవి కాస్త కిందకి వాలి, పెరిగి పూలు పూస్తాయి. వీటిలో రకరకాల రంగులు ఉంటాయి. కొన్ని రెండేసి రంగులు కలగలిసిన పూలు కూడా ఉంటాయి. నాటు, హైబ్రీడ్‌ అంటూ వీటిలో చాలా రకాలు ఉంటాయి. నచ్చిన రంగుల్ని కలగలిపి వేసుకుంటే ఇవి ఉన్న చోటుకే అందం తీసుకువస్తాయి. చాలా చలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇవి బాగా పెరుగుతాయి.

ఆస్టర్లు:

చామంతి పూల మాదిరిగానే ఉండే ఆస్టర్‌ పూలు పూస్తే చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. వీటిలో గులాబీ రంగు, నీలం, తెలుపు, వీటిలో లేత రంగులు ఇలా రకరకాల రంగులు ఉంటాయి. అన్నింటినీ కలిపి వేసుకున్నా కూడా ఇవి నిండుగా పూలు పూసి అందంగా ఉంటాయి. కుండీల్లోనూ చక్కగా పెరుగుతాయి. అయితే వీటిని పొడవుగా కాలి బాటలకు ఇరు వైపులా వేసుకోవడం వల్ల చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి.

తదుపరి వ్యాసం