Saree storage tips: పట్టు చీరలు ఇలా భద్రపరిస్తే.. ఎన్నేళ్లయినా పాడవ్వవు..
24 May 2023, 11:02 IST
Saree storage tips: పెళ్లి, ముఖ్యమైన వేడుకలకు కట్టుకున్న పట్టుచీరలను చెక్కుచెదరకుండా ఎలా భద్రపరుచుకోవాలో బోలెడు చిట్కాలు తెలుసుకోండి.
చీరలు భద్రపరిచడానికి చిట్కాలు
పట్టు చీరలంటేనే ఖరీదు. ముఖ్యమైన వేడుకలకు ఎక్కువ ధర పెట్టుకుని కొనుక్కుంటాం. ధరే కాదు వాటితో జ్ఞాపకాలు పెనవేసుకుని ఉంటాయి. పెళ్లికి, ముఖ్యమైన వేడుకలకి సంబంధించిన చీరలంటే ఎంతో ఇష్టం ఉంటుంది. మరి ఎన్నాళ్లయినా చెక్కుచెదరకుండా అవి అలాగే ఉండాలంటే కొన్ని సులభమైన చిట్కాలు తెలుసుకోవాలి.
మడతలు పడిపోకుండా:
చాలా మంది పట్టు చీరలన్నీ ఒక దగ్గర పెట్టాలని చెప్పి పది, ఇరవై చీరలు ఒకదాని మీద ఒకటి మడిచి పెట్టేస్తారు. దానివల్ల కింద ఉన్న చీరలమీద బరువు పడి పాడైపోతాయి. చిట్లిపోతాయి కూడా. అందుకే ఒక వరుసలో నాలుగు లేదా అయిదు చీరలకు మించి సర్దకండి. వాటిని కూడా అప్పుడప్పుడు పైన చీరను కిందికి అలా మారుస్తూ ఉండండి.
మడత ఎలా పెట్టుకోవాలి?
చాలా మంది చీరను మూడు మడతలు చేసి భద్రపరుస్తారు. దానివల్ల సరిగ్గా చీర అంచు దగ్గర మడత పడుతుంది. కొద్ది రోజులకు అంచు పాడవ్వచ్చు కూడా. అలాకాకుండా చీరను రెండు మడతలు చేసి పెట్టుకోండి.
హ్యాంగర్లు:
పట్టు చీరలను స్టీల్ హ్యాంగర్లమీద పెట్టి భద్రపరచకూడదు. దానివల్ల తుప్పు పట్టి చీర పాడయ్యే అవకాశం ఉంది. దానికి బదులుగా చెక్క లేదా ప్లాస్టిక్ తో చేసి హ్యాంగర్లు మాత్రమే వాడండి.
గాలి తగలాలి:
పట్టు చీర కట్టుకున్నాక లోపల పెట్టేముందు కనీసం ఒక్క రోజైనా నీడలో లేదా ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. లేదంటే తేమ వల్ల చీర పాడయిపోతుంది.
కాటన్ బ్యాగులు:
ఇపుడు పట్టు చీరలు పెట్టుకోడానికి ప్లాస్టిక్ ఆర్గనైజర్లు వస్తున్నాయి. కానీ వాటికి బదులుగా కాటన్ వస్త్రం లేదా మజ్లిన్ చేసిన కాటన్ సారీ బ్యాగులు వాడండి. లేదంటే కాస్త పలుచగా ఉన్న కాటన్ వస్త్రంలో చుట్టి పెట్టుకున్నా పరవాలేదు. చెక్కు చెదరకుండా ఉంటాయి. ఒకవేళ కాటన్ ఆర్గనైజర్లు వాడితే ఒకదాంట్లో రెండు కన్నా ఎక్కువ చీరలు పెట్టకండి. కాస్త వదులుగా ఉండాలి.
నాఫ్తలీన్ గోళీలు:
చాలా మంది ఈ నాఫ్తలీన్ ఉండల్ని వాడితే చీరలు పాడవవు అని చీరల్లో వీటిని పెట్టేస్తారు. ఎక్కువ రోజులు అలాగే ఉంచితే చీరల రంగు పోతుంది. నాఫ్తలీన్ ఉండ చీరని తగలకుండా ఒక పాలిథీన్ కవర్లో గానీ, పేపర్లో గానీ చుట్టి దానికి రంధ్రాలు చేసి బీరువా లేదా కబోర్డ్ మూలల్లో చీరలకు దూరంగా పెట్టండి. దీనికి బదులుగా లవంగాలు కాస్త దంచి కాటన్ వస్త్రంలో మూట కట్టొచ్చు. లేదా అసలు తేమ లేకుండా ఎండబెట్టిన వేప ఆకులను కూడా పెట్టుకోవచ్చు. వీటివల్ల చీరలు సిల్వర్ ఫిష్ వల్ల పాడుకావు.
తేమ:
కాటన్ వస్త్రంలో చుట్టడంతో పాటే ఈ మధ్య చీరల తేమను పీల్చుకునే సిలికాన్ జెల్ బ్యాగులు దొరుకుతున్నాయి. మామూలుగా కొత్తగా కొన్న వాటిర్ బాటిళ్లలో మనకు కనిపిస్తాయివి. అలాంటివే చీరలకు హాని చేయనివి దొరుకుతున్నాయి. వాడి చూడండి. అక్కడక్కడా పెడితే చీరలు పాడవ్వవు.
ఆరబెట్టడం:
చీరలు వాడినా, వాడకపోయినా ప్రతి మూడు నాలుగు నెలలకోసారి వాటిని నీడలో ఆరబెట్టాలి. వాటి మడతలను మార్చాలి. అంటే ఇది వరకు ఎలాగైతే మడిచి పెట్టుకున్నామో దానికి రివర్స్‌లో మడత పెట్టుకోవాలి. దానివల్ల అచ్చుల్లాగా పడిపోవు.
బ్లవుజులు:
చీరలు, బ్లవుజులు ఎప్పుడూ కలిపి మడుచుకోకూడదు. దాదాపుగా పట్టుచీరలన్నింటికీ వర్క్ ఉంటుంది కాబట్టి వాటివల్ల చీరతో పాటూ బ్లవుజు కూడా పాడవుతుంది. వాటిని కూడా ఒక కాటన్ వస్త్రంలో చుట్టి పెట్టుకోవాలి.
టాపిక్