high protein lunch: ప్రొటీన్ ఎక్కువగా ఉండే రుచికరమైన శాకాహార వంటలివే..
30 April 2023, 12:00 IST
high protein lunch: మీ మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఈ రుచికరమైన కూరల్ని చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి!
పాలక్ పన్నీర్
మాంసం, పాలలోనే ఎక్కువ ప్రొటీన్ దొరుకుతుంది అనుకుంటాం. ముఖ్యంగా శాకాహారం తినే వాళ్లకి ప్రొటీన్ దొరకడం కష్టం అనిపిస్తుంది. కానీ రుచికరమైన ఈ శాకాహార కూరలతో మీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్ దొరుకుతుంది. అవేంటంటే..
శనగల మసాలా:
నానబెట్టి ఉడికించిన శనగలకు టమాటా రసం, వివిధ మసాలాలు కలిపి ఈ శనగల కూరను తయారు చేస్తారు. ఉదయాన్నే అల్పాహారంలో తీసుకోవాలి అనుకుంటే కొద్దిగా నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి అందులో శనగలు, పసుపు, ఉప్పు, కారం వేస్తే చాలు. మసాలాలు తక్కువగా వేసుకుంటే సరిపోతుంది.వాటిమీద ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని తినేయొచ్చు. ఈ శనగల కూర మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్, పీచు ఇస్తుంది. దాంతోపాటే ఇనుము, ఫోలేట్, మాంగనీస్ కూడా ఉంటాయి.
ఎర్ర కందిపప్పు:
మసూర్ పప్పు లేదా ఎర్ర కందిపప్పులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా చేసుకునే టమాటా పప్పులాగా లేదా ఆకుకూరలతో కలిపి.. ఎన్ని రకాలుగా అయినా దీన్ని వండుకోవచ్చు. దీంట్లో ప్రొటీన్, ఐరన్, ఫోలేట్లు, పీచు అధికంగా ఉంటాయి. ఇదొక్కటనే కాదు.. దాదాపు ప్రతి పప్పుల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు రోజూవారీ భోజనంలో పప్పును తప్పకుండా భాగం చేసుకుంటే మంచిది.
పాలక్ పన్నీర్:
పాలకూరను ఉడికించి మిక్సీ పట్టి వివిధ మసాలాలు కలిపి పన్నీర్‌ను ఈ రసంలో ఉడికిస్తే కూర సిద్ధం అవుతుంది. పన్నీర్‌లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. పాలకూర లో ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్ తో పాటూ ఆరోగ్యం కావాలనుకుంటే ఇది చక్కని ఎంపిక. చేయడం కూడా చాలా సులువే.
రాజ్మా మసాలా:
రాజ్మా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా తినే వంటకం. కానీ దీంట్లో ఉంటే పోషకాల వల్ల ఇదిప్పుడు అందరికీ అలవాటవుతోంది. నానబెట్టి ఉడికించిన రాజ్మా గింజల్ని టమాటా రసంలో కొన్ని మసాలాలు కలిపి వండితే ఈ కూర సిద్ధం అవుతుంది. రాజ్మాలో చాలా ఎక్కువ ప్రొటీన్ దొరుకుతుంది. రాజ్మాను అన్నంతో, చపాతీలోకి ఎలాగైనా తినొచ్చు. మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో దీన్ని తీసుకోవచ్చు.
టోఫు టిక్కా మసాలా:
చికెన్ టిక్కా మసాలా తరహాలో చేసేదే ఈ వంటకం. టోఫు అంటే సోయాబీన్ పాలతో చేసే పన్నీర్ అనుకోవచ్చు. టోఫును మసాలాలో మ్యారినేట్ చేసి గ్రిల్ చేసి, టమాటా గ్రేవీలో వండాలి. మీ ఇష్టానికి తగ్గ మసాలాలు వేసుకోవచ్చు. శాకాహారులకు ఎక్కువగా ప్రొటీన్ దొరకేది టోఫు లోనే. దీంట్లో క్యాల్షియం, ఇనుము కూడా అధికంగా ఉంటాయి. చికెన్ టిక్కా మసాలా లాగా శాకాహారంలో వండాలనుకున్నపుడు ఇది ప్రయత్నించి చూడండి.
టాపిక్