Double Chin exercises: ఇలా చేస్తే డబుల్ చిన్ సమస్య.. నెల రోజుల్లో మాయం!
02 October 2023, 18:15 IST
Double Chin exercises: లావు అవ్వడం వల్ల, లేదా ఇంకేమైనా శారీరక మార్పుల వల్ల డబుల్ చిన్ సమస్య మొదలవుతుంది. దీన్ని కొన్ని సింపుల్ వ్యాయామాలతో చెక్ పెట్టొచ్చు.
డబుల్ చిన్ సమస్యకు వ్యాయామాలు
కొందరికి దవడలు, గడ్డం కింది భాగంలో అదనంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అందువల్ల ముఖాకృతి దెబ్బతింటుంది. చర్మం కాస్త సాగినట్లై చూడ్డానికీ అంత బాగుండదు. వయసు మీద పడినట్లు అనిపిస్తుంది. ఇలా డబుల్ చిన్ సమస్యతో ఇబ్బంది పడే వారు చిన్న చిన్న వ్యాయామాలతో దాని నుంచి బయటపడొచ్చు. శరీర ఆరోగ్యానికి మనం ఎలాగైతే వ్యాయామాలు చేస్తామో అలాగే డబుల్ చిన్ కోసం ముఖ వ్యాయామాలు తప్పనిసరి. క్రమం తప్పకుండా వీటిని చేయడం వల్ల నెల రోజుల్లోనే ఫలితం తప్పకుండా కనిపిస్తుంది.
వ్యాయామం 1 :
టెన్నిస్ బంతిని తీసుకుని గడ్డం కింద ఉంచండి. బాల్ కింద టేబుల్ లాంటిది సపోర్డ్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు గడ్డంతో బాల్‌పై ఒత్తిడి కలిగించండి. గట్టిగా నొక్కి వదిలేయండి. ఇలా రోజుకు కనీసం 30 సార్లయినా చేయండి. దీని వల్ల గడ్డం కింది భాగంలో ఉన్న కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. పేరుకున్న కొవ్వు కరగడం మొదలవుతుంది.
వ్యాయామం 2 :
చూయింగ్ గమ్‌న్‌ని నోట్లో వేసుకుని వీలైనంత ఎక్కువ సేపు నమిలేందుకు ప్రయత్నించండి. దీని వల్ల ముఖంలోని కొవ్వులు కరుగుతాయి.
వ్యాయామం 3 :
నాలుకను నోటి బయటకు పెట్టండి. దాన్ని గుండ్రంగా మడిచి సున్నా ఆకారంలో చుట్టండి. అలా ముక్కును అందుకోవడానికి ప్రయత్నించండి. ఇలా నాలుకను ముక్కు వైపునకు పెట్టి కనీసం పది నిమిషాలైనా ఉంచండి. ఇలా చేయడం వల్ల నాలుక కింద భాగంలో ఉన్న కండరాలపై ఒత్తిడి కలుగుతుంది. ఫలితంగా అక్కడ కొవ్వు కరుగుతుంది.
వ్యాయామం 4 :
పెదవుల్ని ముందుకు అని సున్నా ఆకారం వచ్చేలా చేయండి. అలా ఇప్పుడు తలను కుడి పక్కకు తిప్పండి. పది సెకన్లు ఉంచండి. తర్వాత పెదవుల్ని అలాగే ఉంచి మళ్లీ ఎడమ వైపుకు తిప్పండి. అలా మరో పది సెకెన్లు ఉంచండి. ఇలా మార్చి మార్చి పది నిమిషాల పాటు చేయండి.
వ్యాయామం 5 :
మెడను సాగదీసినట్లుగా చేస్తూ ముందుకు అనండి. తర్వాత యధాస్థానానికి తీసుకు రండి. ఇప్పుడు మెడను వీలైనంత వెనక్కి అనండి. పది సెకెన్ల తర్వాత మళ్లీ మామూలు స్థితికి రండి. ఇలా పది నిమిషాల పాటు చేయండి. దీని వల్ల గడ్డం కింద, మెడ భాగంలో ఉన్న కొవ్వులు కొంచెం కొంచెంగా కరగడం మొదలుపెడతాయి. వీటిని క్రమం తప్పకుండా ఓ నెల పాటు చేస్తే ఫలితం మీకు వెంటనే కనిపిస్తుంది.
టాపిక్