తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Feel Good Exercises | బాధగా ఉంటే ఈ వ్యాయామాలు చేయండి.. మనసు తేలికవుతుంది!

Feel Good Exercises | బాధగా ఉంటే ఈ వ్యాయామాలు చేయండి.. మనసు తేలికవుతుంది!

HT Telugu Desk HT Telugu

14 June 2022, 19:22 IST

google News
    • మనసులో బాధ పొంగుకొస్తుందా? భావోద్వేగాలను అదుపు చేయలేకపోతున్నారా? అయితే ఈ వ్యాయామాలు చేయండి, మీకు బాధ నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.
Exercises for ease depression
Exercises for ease depression (Pixabay)

Exercises for ease depression

మనసులో ఆందోళన, విచారం మన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. పనిచేయాలనే సంకల్పాన్ని దెబ్బతీస్తుంది. భావోద్వేగాలు విపరీతంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎలా బయటపడాలి? అంటే అందుకు కూడా వ్యాయామాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే మనకు మనసంతా బాధగా ఉన్నపుడు, మన మీద మనకే కోపం వచ్చినపుడు అరుస్తాం, ఏదైనా విసిరేస్తాం, బయటకు కొద్దిసేపు నడకకు వెళ్తాం. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమలోని బాధను బయటకు నెట్టివేస్తారు. మనం అప్రయత్నంగా చేసే ఆ పనే మనకు మంచి ఫలితాన్నే ఇస్తుంది. బాధ నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కూడా అదే ట్రిక్ ఉపయోగించాలి.

మనసేం బాగాలేనపుడు వ్యాయామాలు చేయాలి. శారీరకంగా కొన్ని కసరత్తులు చేసి లోపలి బాధను బయటకు నెట్టివేయాలి. అలా అని ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ లాగా బాక్సింగ్ బ్యాగ్‌ను బద్దలు కొట్టేసి గాయాలు చేసుకోవద్దు. మామూలుగా చేయాలి. ఇంతకీ ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

ధ్యానం - నడక

ఒక పరిశోధనా ప్రకారం ధ్యానం, కార్డియో ఎక్సర్‌సైజులు విచారాన్ని దూరం చేస్తాయి. ఒక అరగంట పాటు ధ్యానం చేయాలి. అలాగే మరొక అరగంట నడకకు వెళ్లాలి. ఈ 60 నిమిషాల సెషన్ మనసులోని విచారం అలాగే రుమినేటివ్ ఆలోచనలను గణనీయంగా తగ్గిస్తుందని నివేదికలు తెలిపాయి. ఇంత సమయం కూడా మీరు వెచ్చించలేకపోతే ఒక 10 నిమిషాలు మీ అడుగులను గమనిస్తూ నెమ్మదిగా నడవండి. మీ శరీర భాగాలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి మీ భావోద్వేగాలు తగ్గుతాయి. ప్రతిరోజూ 20 నిమిషాల పాటు ధ్యానం చేసేవారు తమ ఆలోచనలను అదుపులో ఉంచుకోగలరని ఒక అధ్యయనంలో రుజువైంది.

తాయ్ చి

తాయ్ చి అనేది పురాతన చైనీస్ యుద్ధ కళ. ఇప్పుడు ఈ కళను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునే సాధనంగా అభ్యసిస్తున్నారు. తమ డైలీ రొటీన్ లో భాగంగా తాయ్ చి సాధన చేస్తున్నారు. తాయ్ చి ఎంతో సులభంగా చేసే అభ్యాసం. నెమ్మదిగా శ్వాస పీలుస్తూ సుతారంగా చేతులను ఆడించడం చేస్తారు. ఇది కండరాలలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, మనసుకు ఏకాగ్రత కలిగిస్తుంది. దీంతో కొద్దిసేపట్లోనే మీ ఆందోళన, విచారం మటుమాయమవుతాయి.

హఠ యోగం

హఠ యోగా అనేది యోగాలో ఒక ప్రత్యేక భాగం. ఇది శారీరకంగా కొన్ని భంగిమలను అనుసరించి శక్తిని కూడగట్టేందుకు ఉపయోగపడుతుంది. హఠ అంటే సంస్కృతంలో శక్తి అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ హఠ యోగాసనాలు మీలో అంతర్గతంగా శక్తిని పెంచుతాయి. ఇది మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఈ యోగా శైలి దు:ఖం, నిరాశ భావాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నివేదికలు పేర్కొన్నాయి.

ప్రకృతితో గడపండి

మీ బాధను పంచుకోవడానికి ఎవరూ లేకపోయినా, ప్రకృతి మీతో ఉంటుంది. కొద్దిసేపు చెట్లు మధ్య నడవండి. అడవులలో షికారు చేయండి, కొండలు ఎక్కండి. ఇవేవి మీకు అందుబాటులో లేకపోతే నగరంలోనే రోడ్డుపై ట్రాఫిక్ చూస్తూ నడవండి. ఇలా చేసినా కూడా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏది ఏమైనా వీలు చిక్కినప్పుడు అడవుల్లో సఫారీ మీ జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం