Refreshing Iced Teas । చల్లగా ఐస్‌డ్ టీలు తాగండి.. వేసవి వేడిని తరిమేయండి!
13 June 2023, 18:42 IST
- Refreshing Iced Teas Recipes: వేసవిలో సాయంత్రం వేళ చల్లగా సేదతీరాలి అనుకుంటే ఒక కప్పు ఐస్‌డ్ టీ తాగటం అద్భుతమైన మార్గం ఈ రెసిపీలను ట్రై చేయండి.
Iced teas to beat the heat
Summer Refreshing Drinks: వేసవి వేడి నుండి తప్పించుకోవాలి, సాయంత్రం వేళ చల్లగా సేదతీరాలి అనుకుంటే ఒక కప్పు ఐస్‌డ్ టీ తాగటం అద్భుతమైన మార్గం. ఈ ఐస్‌డ్ టీ వేసవిలో మీ దాహాన్ని తీరుస్తుంది, మీ శరీరాన్ని చల్లబరుస్తుంది అలాగే మీ ఇంద్రియాలను రిఫ్రెష్ చేస్తుంది. ఐస్‌డ్ టీని లెమన్, మ్యాంగో, పీచ్, చెర్రీ మొదలైన ఫ్రూట్ ఫ్లేవర్లలో ఆస్వాదించవచ్చు, పుదీనా వేసుకుని తాగితే మరింత చల్లటి అనుభూతిని పొందవచ్చు.
ఐస్‌డ్ టీ మీ శరీర వేడిని తగ్గించడమే కాకుండా మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి.
బెంగళూరులోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ న్యూట్రిషనిస్ట్ అయిన స్నేహ సంజయ్ వేసవిలో ఐస్‌డ్ టీలు తాగటం చాలా మంచిదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె రెండు రెసిపీలను పంచుకున్నారు. వాటిని ఈ కింద చూసి మీరు మీ ఇంట్లో ప్రయత్నించండి.
Mango Iced Tea Recipe కోసం కావలసినవి
- మామిడిపండు గుజ్జు/సిరప్ - 2 స్పూన్లు
- నీరు - 300 మి.లీ
- టీ బ్యాగులు - 3
- పుదీనా ఆకులు- 5-6
- తేనె/ చక్కెర - 2 స్పూన్లు
- ఐస్ క్యూబ్స్- 2-3
మ్యాంగో ఐస్‌డ్ టీ ఎలా తయారు చేయాలి
- ముందుగా టీ బ్యాగ్‌లను వేడి నీటిలో ఉంచి కాసేపు ఉంచితే డికాక్షన్ తయారవుతుంది, అనంతరం ఈ డికాక్షన్ ను పూర్తిగా చల్లబరచండి.
- ఆపై అందులో ఐస్ క్యూబ్స్, మామిడి గుజ్జు కలపండి, దీనిని 2 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి.
- అనంతరం బయటకు తీసి అందులో తాజా పుదీనా ఆకులను క్రష్ చేసి వేయండి.
- ఈ పానీయాన్ని ఒక కప్పులోకి తీసుకొని రుచి కోసం కొద్దిగా తేనె కలపండి, అర చెంచా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
అంతే, మ్యాంగో ఐస్‌డ్ టీ రెడీ. చల్లచల్లగా ఆస్వాదించండి.
Lemon Iced Tea Recipe కోసం కావలసినవి
- నీరు - 300 మి.లీ
- టీ ఆకులు - 2 స్పూన్లు
- నిమ్మరసం - 10 మి.లీ
- చక్కెర / తేనె - 1 చెంచా
లెమన్ ఐస్‌డ్ టీ తయారీ విధానం
- ముందుగా నీరు మరిగించి, అందులో టీ ఆకులను కలపండి, బాగా మరిగించాలి.
- ఆపై చక్కెర వేసి డికాక్షన్ ను పూర్తిగా చల్లబరచండి.
- గది ఉష్ణోగ్రతకు వచ్చాక అందులో నిమ్మరసం వేసి ఫిల్టర్ చేయాలి.
- ఆపై దీన్ని రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచండి.
అనంతరం బయటకు తీస్తే లెమన్ ఐస్‌డ్ టీ రెడీ. చల్లచల్లగా పుల్లపుల్లని లెమన్ ఐస్‌డ్ టీని ఆస్వాదించండి.