Ayurvedam for Skin: మెరిసే చర్మం కోసం ఏం చేయాలో ఆయుర్వేదం చెప్పేసింది, ఇదిగోండి ఆ రహస్యం
22 August 2024, 7:00 IST
- Ayurvedam for Skin: చర్మం సహజంగా మెరిస్తేనే అందంగా కనిపిస్తారు. మార్కెట్లో రసాయనాలతో నిండిన కాస్మోటిక్ ఉత్పత్తులను తీసుకునే బదులు ఆయుర్వేదంలో పేర్కొన్న ఈ స్పెషల్ క్రీమ్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. ఆ క్రీమ్‌ను వాడితే కొద్ది రోజుల్లోనే మీ చర్మం మెరిసిపోతుంది.
ఆయుర్వేదం క్రీమ్
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తమ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా, మృదువుగా ఉంచడానికి ఎన్నో కాస్మోటిక్ ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయితే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో చాలా రసాయనాలు ఉన్నాయని, అవి చర్మానికి హాని కలిగిస్తాయని అందరికీ తెలిసిందే. అలాంటి బ్యూటీ ఉత్పత్తులకు బదులు ఆయుర్వేదం చెప్పిన క్రీమ్‌ను తయారు చేసుకుని వాడితే మంచిది. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం ఆయుర్వేదం నెయ్యితో తయారు చేసిన 'శతదౌత్ ఘృత' అనే క్రీమ్ గురించి చెబుతోంది. ఈ క్రీమ్‌ను ఇంట్లోనే తయారుచేసి వాడుకోవచ్చు.
శతదోత్ ఘృత అంటే…
శత అంటే వంద, ధౌత్ అంటే శుభ్రం చేయడం, ఘృత అంటే నెయ్యి అని అర్థం. శతదౌత్ ఘృత అంటే 100 సార్లు నెయ్యితో శుభ్రపరచడం అని అర్థమవుతుంది. పేరుకు తగ్గట్టుగానే ‘శతదోత్ ఘృత’ తయారీలో, ఆయుర్వేద పద్దతిలో దీనికి అనేక ఔషధాలు కూడా కలుపుతారు. ఇది చర్మానికి సంబంధించిన అనేక వ్యాధులను కూడా అడ్డుకుంటుంది. కానీ ఇంట్లో కూడా ఎలాంటి మందులు వాడకుండా సులభంగా తయారు చేసుకోవచ్చు.
క్రీమ్ తయారీ ఇలా
ఇంట్లో 'శతదోత్ ఘృత్' తయారు చేయడానికి, 50 గ్రాముల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 100 మిల్లీలీటర్ల చల్లటి నీరు అవసరం. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యిలో చల్లటి నీరు వేసి స్పూనుతో కలుపుతూ ఉండాలి. అలా చిన్న మంట మీద మరిగిస్తూ స్పూనుతో కలుపుతూనే ఉండాలి. ఇలా నీటిని పదేపదే కలపడం వల్ల, చివరికి వెన్న వంటి తెల్లని పేస్టును పొందుతారు. ఇదే క్రీమ్.
ఈ క్రీమ్ ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఈ క్రీమ్ రాయడం వల్ల చర్మానికి సంబంధించిన అనేక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. నెయ్యి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. పూర్వాకాలంలో తొలిసారి ఋషులు శతదోత్ ఘృతాన్ని తయారు చేయడం ప్రారంభించారు. నేటి కాలంలో, చాలా మంది ఆయుర్వేద చర్మవ్యాధి నిపుణులు కూడా దీనిని ఉపయోగించమని సిఫార్సు చేస్తారు.
ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసే 'శతదోత్ ఘృత'ను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. కానీ డెర్మటాలజిస్టుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో తయారుచేసిన ఈ క్రీమును రెండు వారాల పాటు మాత్రమే నిల్వ ఉంచాలి. ఆ తర్వాత కొత్త క్రీమ్ తయారు చేసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా, స్మూత్ గా ఉండాలంటే ఈ క్రీమ్ ను చర్మంపై అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. మీ చర్మం చాలా పొడిగా ఉంటే, దీన్ని రోజంతా అలాగే ఉంచవచ్చు. నీటితో కడగాల్సిన అవసరం లేదు.