Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?
16 May 2024, 14:15 IST
- Garlic Peel: చాలామంది వెల్లుల్లిని పైన పొట్టు తీసి లోపల రెబ్బలు మాత్రమే వినియోగిస్తారు. నిజానికి రెబ్బలు ఎన్ని పోషకాలు ఉన్నాయో.. వెల్లుల్లి పొట్టులో కూడా అన్నే ఉంటాయి.
వెల్లుల్లి రెబ్బలు
Garlic Peel: ఏ కూర వండినా అందులో వెల్లుల్లి పడాల్సిందే. ఆరోగ్యానికి వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే వెల్లుల్లి వాడేటప్పుడు అందరూ చేసే ఒక తప్పు... పైన పొట్టును తీసి పడేస్తారు. లోపల ఉన్న తెల్ల రెబ్బలు మాత్రమే వాడతారు. నిజానికి వెల్లుల్లి రెబ్బలు ఎన్ని పోషకాలు ఉంటాయో.. వెల్లుల్లి పొట్టులో కూడా అన్నే పోషకాలు ఉంటాయి. కాబట్టి వెల్లుల్లి పొట్టును పడేయకుండా వాడుకోవడమే ఉత్తమం. ఆయుర్వేద నిపుణులు ఈ విషయాన్ని సమర్థిస్తున్నారు. వెల్లుల్లి పొట్టును వాడడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
వెల్లుల్లి పొట్టులో పోషకాలు
వెల్లుల్లి పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు ఉంటాయి. చర్మ సమస్యలు రాకుండా అడ్డుకునే సమ్మేళనాలు దీనిలో ఉంటాయి. వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పొట్టులో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. కాబట్టి వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నప్పుడు వెల్లుల్లి పొట్టుతో సహా పేస్ట్ చేయడమే ఉత్తమం. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏదైనా సూప్, కూర, పులుసుల్లో వాడినప్పుడు పొట్టును పొడిలా చేసి వాడుకుంటే ఉత్తమం.
వెల్లుల్లి పొట్టును నీటిలో వేసి కాసేపు మరిగించి ఆ నీటిని తాగితే నిద్రలేమి సమస్యలు తగ్గిపోతాయి. వెల్లుల్లి పొట్టులో విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వెల్లుల్లి పొట్టుతో సహా వాడడమే మంచిది.
వెల్లుల్లి పొట్టుతో సహా వాడటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడె కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఎంతోమంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు వెల్లుల్లి పొట్టుతో సహా తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎందుకంటే వెల్లుల్లి పొట్టులో సల్ఫర్ అధికంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో టాక్సిన్లను బయటికి పంపించడంలో ఈ సల్ఫర్ ఉపయోగపడుతుంది.
వెల్లుల్లిని పొట్టుతో సహా చిన్న ముక్కలుగా కోసుకొని దాన్ని నూనెలో వేయించి అన్నంలో కలుపుకొని తరచూ తింటూ ఉంటే కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతూ ఉంటాయి. వెల్లుల్లిని పొట్టుతో తినేవారికి ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువే. కాబట్టి ఇకపై వెల్లుల్లి వాడేటప్పుడు పొట్టుతో సహా వాడేందుకే ప్రయత్నించండి.