Henna for Hair: జుట్టుకు పెట్టే హెన్నాలో ఇవి కలపండి, మంచి రంగుతో పాటూ లాభాలెన్నో
19 September 2024, 12:30 IST
Henna for Hair: రంగుకోసం హెన్నా వాడటం మామూలే. కానీ మీరు పెట్టుకునే హెన్నాలోనే కొన్ని పదార్థాలు కలిపారంటే రంగుతో పాటూ జుట్టు కుదుళ్లు బలపడతాయి. జుట్టు ఆరోగ్యం పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
హెన్నా
జుట్టు మంచి రంగులో ఉండాలంటే నెలకోసారైనా హెన్నా పెట్టుకోవడం చాలా మంది చేసే పనే. అయితే ఈ హెన్నా పొడిలోనే కొన్ని పదార్థాలు కలపడం వల్ల జుట్టుకు రంగుతో పాటే జుట్టు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. హెన్నాతో పాటే వాటి ప్రయోజనాలు కూడా పొందొచ్చు. జుట్టు రాలడం నుంచి పెరుగుదల వరకు అనేక సమస్యలు తగ్గించే కొన్ని హెన్నా హెయిర్ ప్యాక్స్ చూడండి.
హెన్నా హెయిర్ ప్యాక్స్:
1. మెంతులు:
హెన్నా పెట్టుకునే ముందు రోజు రాత్రి రెండు చెంచాల మెంతులను నీళ్లలో నానబెట్టండి. ఉదయాన్నే నీళ్లు వంపేసిన మెంతులను మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే హెన్నా పొడి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. నీళ్లు కలిపి దీన్ని తలకు పట్టించండి. ఆరాక కడిగేసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టుకు కండీషనర్ లాగా మెంతులు పనిచేస్తాయి.
2. ముల్తానీ మట్టి:
రెండు నుంచి మూడు చెంచాల హెన్నా పొడికి, అంతే పరిమాణంలో ముల్తానీ మట్టి కలపండి. దాంట్లో నీళ్లు పోసి బాగా చిక్కగా పేస్ట్ అయ్యేలాగా చూడండి. దీన్ని మాడుకు పట్టించండి. తర్వాత కడిగేసుకుంటే ముల్తానీ మట్టి క్లెన్సర్ లాగా పనిచేస్తుంది. మాడు మీద పేరుకున్న జిడ్డు తొలగించి మాడును శుభ్రంగా చేస్తుంది.
3. మందారాలతో:
ముందుగా మిక్సీ జార్లో ఐదారు మందారం ఆకులు మిక్సీ పట్టుకోండి. అందులోనే హెన్నా పొడి, రెండు చెంచాల బాదాం నూనె వేసి మరోసారి మిక్సీ పట్టండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కాస్త జారుడుగా చేసుకోండి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. గంట సేపు ఆగి కడిగేసుకుంటే చాలు. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.
4. అరటిపండు:
2 చెంచాల హెన్నా పొడిలో, 2 చెంచాల పెరుగు, 1 అరటిపండు అవసరం. ముందుగా ఒక పాత్రలో బాగా పండిన అరటిపండును మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో హెన్నా పొడిని, పెరుగును వేసి బాగా కలిపి తలకు పట్టించాలి. గంటయ్యాక కడిగేసుకుంటే మెరిసే ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది.