తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloo Palak Paratha: బ్రేక్ ఫాస్ట్‌లో ఆలూ పాలక్ పరాటా ట్రై చేయండి, మధ్యాహ్నం వరకు ఆకలే వేయదు

Aloo Palak Paratha: బ్రేక్ ఫాస్ట్‌లో ఆలూ పాలక్ పరాటా ట్రై చేయండి, మధ్యాహ్నం వరకు ఆకలే వేయదు

Haritha Chappa HT Telugu

01 June 2024, 6:00 IST

google News
    • Aloo Palak Paratha: బ్రేక్ ఫాస్ట్ ఎంత గట్టిగా తింటే అంత మంచిది. మధ్యాహ్న భోజనం వరకు ఇతర ఆహారాలు తినాలనిపించదు. దీనివల్ల బరువు కూడా పెరగరు.
ఆలూ పాలక్ పరాటా రెసిపీ
ఆలూ పాలక్ పరాటా రెసిపీ

ఆలూ పాలక్ పరాటా రెసిపీ

Aloo Palak Paratha: అల్పాహారం చాలా గట్టిగా తినమని చెబుతారు వైద్యులు. అల్పాహారంలో పోషకాహారం తింటే మధ్యలో ఎలాంటి చిరుతిళ్లు తినాలనిపించదు. నేరుగా మధ్యాహ్న భోజనమే చేస్తారు. కాబట్టి ఆరోగ్యకరంగానే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము ఆలూ పాలక్ పరాటా రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో పాలకూర, బంగాళాదుంపలు, చీజ్, గోధుమపిండి వంటివి వాడతాము. కాబట్టి త్వరగా ఆకలి వేయదు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

ఆలూ పాలక్ పరాటా రెసిపీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నెయ్యి - రెండు స్పూన్లు

వేడి నీరు - ఒక గ్లాసు

బంగాళాదుంపలు - మూడు

పాలకూర తరుగు - ఒక కప్పు

ఉల్లిపాయ - ఒకటి

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు

చీజ్ తురుము - రెండు స్పూన్లు

కారం - ఒక స్పూన్

చాట్ మసాలా - ఒక స్పూను

ఆమ్చూర్ పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నెయ్యి - తగినంత

బటర్ - ఒక స్పూన్

ఆలూ పాలక్ పరాటా రెసిపీ

1. గోధుమ పిండిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.

2. అందులో ఉప్పు, రెండు స్పూన్ల నెయ్యి, వెచ్చని నీరు వేసి చపాతీ పిండిలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

4. అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.

5. ఉల్లిపాయ తరుగును కూడా వేసి వేయించాలి.

6. అందులో కారం, పాలకూర తరుగు వేసి బాగా కలపాలి.

7. మూత పెట్టి ఉడికించాలి. అందులో పాలకూరలోని నీరంతా దిగి దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి.

8. అందులోనే చాట్ మసాలా కూడా వేయాలి.

9. బంగాళాదుంపలను ఉడికించి గుజ్జులా చేసి వాటిని వేసి బాగా కలుపుకోవాలి.

10. తర్వాత అందులోనే ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి.

11. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.

12. స్టవ్ ఆఫ్ చేసాక చీజ్ ను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి.

13. ఇప్పుడు ముందుగా కలుపుకున్న గోధుమపిండి నుంచి కొంత ముద్దను తీసి పూరీలాగా ఒత్తుకోవాలి.

14. మధ్యలో ఈ బంగాళదుంప పాలకూర మిశ్రమాన్ని పెట్టి చపాతీని పోట్లీ లాగా కవర్ చేసుకోవాలి.

15. తర్వాత మళ్లీ దాన్ని చేత్తో నొక్కి పరాటాలగా ఒత్తుకోవాలి.

16. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

17. దానిపై ఈ పరాటాని వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

18. ఇది బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలి.

19. అంతే పైన కాస్త బటర్ ను రాసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

ఇది చేయడానికి ఒక అరగంట సమయం పడుతుంది. కానీ రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఉదయం పూట ఇలా ఒక పరాటా తింటే చాలు. పొట్ట నిండిపోతుంది. మళ్లీ లంచ్ సమయం వరకు కూడా ఆకలి వేయదు.

తదుపరి వ్యాసం