తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation: భగవద్గీత చెప్పిన ప్రకారం మీలో ఈ లక్షణాలు ఉంటేనే విజయం సాధించేది

Friday Motivation: భగవద్గీత చెప్పిన ప్రకారం మీలో ఈ లక్షణాలు ఉంటేనే విజయం సాధించేది

Haritha Chappa HT Telugu

26 July 2024, 5:00 IST

google News
    • Friday Motivation: భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి మాటా మనుషులకు ఉపయోగపడేదే. విజయం సాధించినందుకు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి మాటను ఫాలో అయితే చాలు.
మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Pixabay)

మోటివేషనల్ స్టోరీ

Friday Motivation: భగవద్గీత... హిందువుల పవిత్ర గ్రంథం. అంతేకాదు జీవిత సారాన్ని నింపుకున్న మహాకావ్యం. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో భయపడిన అర్జునుడికి ఎన్నో ఉపదేశాలు చేశారు. అవే భగవద్గీతలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ బోధనలు నేటి యువతకు ఆచరణీయం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను ఫాలో అయితే చాలు... విజయాన్ని అందుకోవడానికి దగ్గరదారులు వేసుకున్నట్టే లెక్క. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి విజయవంతం అయ్యేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి పనిని మొదలుపెట్టేటప్పుడు అది విజయవంతం అవుతుందో లేదో అన్న అనుమానాలు పెట్టుకోకూడదు. ఓటమి చెందుతామనే భయాన్ని వదిలిపెట్టాలి. భయంతో చేస్తే ఆ పనిని ఆ వ్యక్తి ఎప్పటికీ పూర్తి చేయలేడు. అలాంటి ఆలోచనలతో తనను తానే నాశనం చేసుకుంటాడు. కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా మీపై మీకు పూర్తి విశ్వాసంతో పనిని మొదలుపెట్టండి. అది ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది.

మితిమీరిన ప్రేమలు వద్దు

మనిషికి అనుబంధాలు ఉండొచ్చు. కానీ మితిమీరిన ప్రేమలో అనుబంధాలు మనిషిని కట్టిపడేస్తాయి. అవి కష్టాలకు దారితీస్తాయి. మితిమీరిన ప్రేమలు, కోపానికి, బాధలకు గురిచేస్తాయి. కాబట్టి దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఏది కూడా మితిమీరకూడదు. హద్దులు దాటకూడదు.

ప్రతిఫలాన్ని ఆశించి ఏ పనీ మొదలు పెట్టకండి. ఆ పని విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మొదలు పెట్టండి. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ముందుగా ఆ పని నేర్చుకొని దానిపై దృష్టి పెట్టాలి. ఆ పని వల్ల వచ్చే ప్రతిఫలంపైనే దృష్టి పెడితే... మీరు ఆ పనిని పూర్తి చేయలేరు. మనసును లగ్నం చేయలేరు. కాబట్టి ఫలితం మీద కాకుండా చేసే పనిపై మనసు పెట్టడం ముఖ్యం.

భయం వద్దు

భయమే మీ ప్రధాన శత్రువు. ఎప్పుడైతే మీలో భయం వస్తుందో విజయం ఆమడ దూరం పారిపోతుంది. అందుకే శ్రీకృష్ణుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని భయాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. యుద్ధంలో మరణిస్తే స్వర్గం లభిస్తుందని, ఒకవేళ గెలిస్తే రాజ్యం దొరుకుతుందని హితబోధ చేశాడు. మీరు కూడా అంతే.. చేసిన పనిలో వైఫల్యం చెందితే అనుభవం వస్తుందనుకోండి, అదే విజయం సాధిస్తే మీరు అనుకున్నది సాధించారనే తృప్తి మిగులుతుందనుకోండి. అంతే తప్ప విజయం సాధిస్తానో లేదో అన్న భయం మనసులో నింపుకొని ఏ పనిని మొదలు పెట్టకండి.

మనసు వెళ్లిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు. మనిషి ఎక్కడుంటాడో మనసు కూడా అక్కడే ఉండాలి. మనసు ఒకచోట, మనిషి ఒకచోట ఉంటే ఆ వ్యక్తి ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేయడం చాలా కష్టం అని చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. కాబట్టి పని చేస్తున్నప్పుడు ప్రశాంతంగా మీ మనసు ఉండేలా చూసుకోండి. అది స్థిరంగా మీతో పాటే ఉండాలి. అంతే తప్ప దాని ఆలోచనలు ఎక్కడెక్కడో తిరగకూడదు. ఇది మీరు చేసే పనిపై దృష్టిలో నిలపకుండా చేస్తుంది. కాబట్టి మనసును మీరు అదుపులో ఉంచుకుంటే విజయం దక్కి అవకాశాలు పెరుగుతాయి.

తదుపరి వ్యాసం