Health Insurance Rules : ఆరోగ్య బీమాలో పెద్ద మార్పు.. 65 ఏళ్లపైబడిన వారూ బీమా చేసుకోవచ్చు
23 April 2024, 9:30 IST
- Health Insurance Above 65 Years : ఆరోగ్య బీమా విలువ మధ్యతరగతి కుటుంబాలకు తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎక్కువ వయసు ఉన్నవారికి వర్తించకుండా రూల్స్ ఉండేవి. అయితే ఇక నుంచి 65 ఏళ్లు పైబడినవారు కూడా బీమా తీసుకోవచ్చు.
ఆరోగ్య బీమా
సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. జీవితంలో ఏదో ఒకటి జరుగుతుందిలే.. అని చూస్తూ వెళ్లిపోయేవారు చాలా మందే ఉంటారు. కానీ మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. భవిష్యత్ జీవితం కోసం ఈ రోజు ఆలోచించేవాడు భవిష్యత్తులో కష్టాలను సులభంగా ఎదుర్కొంటాడు. కానీ మనం దీని గురించి ఆలోచించడం లేదు.
అందరం భవిష్యత్తు కోసం బీమా చేస్తాం. క్లిష్ట సమయాల్లో బీమా రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య బీమా చాలా ప్రయోజనకరం. మీకు ఆరోగ్య బీమా లేకపోతే, ముందుగా దీన్ని చేయండి. ఎవరి ఆరోగ్యం ఎప్పుడు క్షీణిస్తుందో చెప్పలేం. అందువల్ల ఆరోగ్య బీమా అనేది చాలా ముఖ్యమైన అంశం.
ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమాకు అర్హులు కాదు. గతంలో భారతదేశంలో 65 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య బీమా వర్తించేది కాదు. అయితే ఇప్పుడు దానిని సవరించి, 65 ఏళ్లు పైబడిన వారు కూడా ఆరోగ్య బీమా పొందవచ్చని బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ (IRDAI) తెలియజేసింది.
ఆరోగ్య బీమా తీసుకోవడానికి 65 ఏళ్ల వయోపరిమితి రద్దు చేశారు. కవరేజీని మరింత అందుబాటులోకి తెచ్చింది అథారిటీ. వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రూపొందించడం, ఊహించని వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంతకుముందు కొత్త బీమా 65 వరకు మాత్రమే పొందగలిగేది. ఇప్పుడు ఎవరైనా ఏప్రిల్ 1 నుండి ఆరోగ్య బీమాను పొందవచ్చు. తద్వారా లక్షలాది మందికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. వయస్సు కారణంగా మినహాయించబడిన చాలా మందికి ఇప్పుడు ఆరోగ్య బీమా లభిస్తుంది. ఆయుర్వేదం, యోగాతో సహా ఆయుష్ చికిత్సలకు పరిమితి లేదు. అయితే ప్రయోజనం ఆధారిత పాలసీదారులు వివిధ బీమా సంస్థలతో బహుళ క్లెయిమ్‌లను దాఖలు చేయవచ్చు. క్యాన్సర్, గుండె లేదా మూత్రపిండ వైఫల్యం, AIDS వంటి క్లిష్టమైన అనారోగ్యాలతో సహా ముందుగా ఉన్న వైద్య పరిస్థితులు ఉన్న వ్యక్తులకు కూడా బీమా సంస్థలు ఆరోగ్య బీమాను అందించాల్సి ఉంటుంది. తద్వారా అందరికీ సమగ్రమైన కవరేజీని అందిస్తుంది.
ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వ్యవస్థలను కలిగి ఉన్న ఆయుష్ చికిత్సలకు ఎటువంటి పరిమితి లేకుండా బీమా మొత్తం వరకు అపరిమిత కవరేజీని ఈ నియంత్రణ తప్పనిసరి చేస్తుంది. ప్రయోజనం-ఆధారిత పాలసీలు ఉన్న పాలసీదారులు ఇప్పుడు వివిధ బీమా సంస్థలతో బహుళ క్లెయిమ్‌లను ఫైల్ చేయవచ్చు. ఇది కాకుండా ప్రత్యేక సీనియర్ సిటిజన్ల ఫిర్యాదులు, సందేహాలను పరిష్కరించడానికి కొత్త హెల్ప్‌లైన్‌ను ప్రారంభించనున్నట్లు బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ తెలిపింది.
అయితే అంతకుముందు మీరు మీ ఆరోగ్య బీమా పాలసీని చేయవలసి వస్తే మీరు అనేక నియమాలకు కట్టుబడి చేయాల్సి వచ్చేది. వాటిలో కొన్నింటికి మినహాయింపు ఉంటుంది. అలాగే ఈ కొత్త రూల్ వల్ల ఇప్పటి వరకు బీమా పొందలేని చాలా మంది ఆరోగ్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు.