Health Benefits of Vegan Diet : బరువు తగ్గాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. వీగన్ డైట్ పర్ఫెక్ట్
24 November 2022, 8:29 IST
- Health Benefits of Vegan Diet: ఈ మధ్యకాలంలో వీగన్ డైట్ బాగా ప్రాచూర్యం పొందింది. జంతువులకు హానీ కలిగించకుండా ఉండేందుకు చాలా మంది ఈ డైట్‌ని ఫాలో అవుతారు. అయితే బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఈ డైట్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వీగన్ డైట్ బెనిఫిట్స్
Health Benefits of Vegan Diet: చాలామంది ఇటీవల కాలంలో తమ ఆహారంలో మాంసం, పాలను తగ్గించేస్తున్నారు. వారి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం.. శాకాహారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనినే వీగన్ డైట్ అంటున్నారు. అంతేకాకుండా లెదర్ వంటి వస్తువులను కూడా ఉపయోగించడం మానేస్తున్నారు. అయితే ఈ వీగన్ డైట్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఈ డైట్ చేస్తున్నప్పుడు.. రోజువారీ మాక్రోన్యూట్రియెంట్ అవసరాలు తీరుతున్నాయా, కేలరీలు అందుతున్నాయా వంటి అంశాల గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికై..
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు శాకాహారాన్ని ప్రయత్నించవచ్చు. అదేనండి వీగన్ డైట్‌ని ఫాలో అవ్వొచ్చు. మాంసాహారం నుంచి.. మొక్కల ఆధారిత ఆహారాలు ఎక్కువగా ఉన్న డైట్‌కి మారినప్పుడు.. ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే శాకాహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండినట్టు ఉండేలా చేస్తుంది. చిరుతిళ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. తద్వారా మీరు బరువు తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన గుండెకోసం..
కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ సాధారణంగా శాకాహారం ద్వారా తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గణనీయమైన సంఖ్యలో జంతు ఆధారిత ఉత్పత్తులను కలిగి ఉన్న ఆహారంతో పోల్చితే.. చాలా పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, సోయా వంటి మాంసం ప్రత్యామ్నాయాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు అభివృద్ధి చెందే అవకాశం తగ్గుతుంది. ఒత్తిడి, టైప్ 2 మధుమేహం అదుపులో ఉంటుంది.
హెల్తీ గట్ కోసం..
వీగన్ డైట్ గట్ మైక్రోబయోటాను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికే కాకుండా.. మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. విభిన్నమైన మొక్కల ఆధారిత ఆహారం.. మన గట్ మైక్రోబయోటాను త్వరగా, ప్రభావవంతంగా మార్చడంలో సహాయం చేస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరిచి.. జీర్ణసమస్యలతో పోరాడేలా చేస్తుంది.
కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
సోయాబీన్స్, పండ్లు, కూరగాయలు వంటి మొక్కల ఆధారిత ఆహారాన్ని మీ డైట్లో చేర్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని అధ్యయనాలు నిరూపించాయి. వాహిక, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా వీగన్ డైట్లో ఎక్కువగా సోయా ఉత్పత్తులు ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్‌ను నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
వీగన్ డైట్ అనేది.. మీ ఆహారాన్ని మెరుగుపరచడానికి, పోషకాహారాన్ని మీ డైట్లో చేర్చుకోవడానికి మంచి ఆప్షన్. ఇది ఆహారపు అలవాట్లను మార్చి.. బరువు తగ్గేలా చేస్తుంది. అంతేకాకుండా మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మీరు ఈ డైట్ ఫాలో అయ్యే ముందు.. మీ వైద్యుడిని సంప్రదించడం మేలు.