2022 WagonR | మారుతీ సుజుకీ వాగన్ఆర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. మైలేజ్ హైక్
28 February 2022, 14:21 IST
- మారుతీ సుజుకీ తన పాపులర్ మోడల్ వాగన్ఆర్‌కు సంబంధించి లేటెస్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో దీని ప్రారంభ ధర రూ.5.4 లక్షలుగా నిర్దేశించింది. ఈ సరికొత్త వాహనంలో క్రితం మోడల్ కంటే కూడా మైలేజి పెరిగింది.
మారుతీ సుజుకీ వాగన్ఆర్
ప్రముఖ వాహన సంస్థ మారుతీ సుజుకీ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసు పెట్టి తన వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తోంది. గతేడాది తన సెలెరియో మోడల్ లేటెస్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. ఇటీవలే బాలెనో మోడల్‌ను విపణిలోకి వదిలింది. తాజాగా తన వాగన్ఆర్ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ 2022 వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ. 5.4 లక్షలుగా నిర్దేశించింది. ఈ సరికొత్త వాహనంలో పాత మోడల్ కంటే మరిన్నీ అప్డేట్లను పొందుపరిచారు.
అంతేకాకుండా ఈ 2022 మారుతీ సుజుకీ వాగన్ ఆర్ కారు గల్లాండ్ రెడ్-బ్లా రూఫ్, మాగ్మాగ గ్రే-బ్లాక్ రూఫ్ రంగుల్లో లభ్యమవుతుంది. ఈ మార్పులు కాకుండా గ్రే మెలాంజ్ ఫ్యాబ్రిక్ డిజైన్ సీట్లను ఇందులో పొందుపరిచారు. వివిధ వేరియంట్లలో లభ్యమవుతోన్న ఈ వాహనం కనీస ధర రూ.5.4 లక్షలు అయితే గరిష్ఠంగా రూ.7.1(టాప్ వేరియంట్) లక్షల వరకు ఉంది.
ఫీచర్లు..
ఈ సరికొత్త మారుతీ సుజుకీ వాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఫీచర్లకు కొరతే లేదు. 7-అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో, స్మార్ట్ ఫోన్ నేవిగేషన్, నాలుగు స్పీకర్ల సదుపాయం, క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ వ్యవస్థ, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి కాకుండా కీ లెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, ఏసీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం లాంటి తదితర అదనపు ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.
ఇంజిన్..
ఈ 2022 వాగన్ఆర్ వెర్షన్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 66 బీహెచ్‌పీ బ్రేక్ హార్స్ పవర్, 89 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 5-మ్యానువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంతేకాకుండా లీటరుకు గరిష్ఠంగా 25.19 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. క్రితం మోడల్‌తో పోలిస్తే మైలేజీ 16 శాతం పెరిగింది. ఇందులో 1.0-లీటర్ సీఎన్జీ పవర్టెయిన్ కూడా ఉంది. ఇది కూడా 56 బీహెచ్‌పీ బ్రేక్ హార్స్ పవర్, 82 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా లీటరుకు గరిష్ఠంగా 34.05 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
ఈ వాహనంలో ఉన్న మరో ఇంజిన్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్. ఈ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ 88.5 బీహెచ్‌పీ బ్రేక్ హార్స్ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా లీటరుకు గరిష్ఠంగా 24.43 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. క్రితం మోడల్‌తో పోలిస్తే 19 శాతం పెరిగింది.
టాపిక్